క్రమశిక్షణకు మారు పేరు బీఆర్ఎస్ పార్టీ: మంత్రి గంగుల కమలాకర్

by Shiva |   ( Updated:2023-04-24 18:15:39.0  )
క్రమశిక్షణకు మారు పేరు బీఆర్ఎస్ పార్టీ: మంత్రి గంగుల కమలాకర్
X

దిశ, కరీంనగర్ టౌన్: క్రమశిక్షణకు మారు పేరు బీఆర్ఎస్ పార్టీ అని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. టీఆర్ఎస్.. బీఆర్ఎస్ గా మారిన తరువాత ఎప్రిల్ 25న నియోజవకర్గ స్థాయిలో ప్లీనరీ సమావేశాలను ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు. అందులో భాగంగా కరీంనగర్ నియోజకవర్గ ప్లీనరీని ఉదయం 10 గంటలకు రేకుర్తిలోని రాజశ్రీ గార్డెన్లో నిర్వహిస్తున్నామని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.

గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర కమిటీల సభ్యులు, అనుబంధ సంఘాలు, ముఖ్య కార్యకర్తలతో దాదాపు మూడు వేల మందికి పైగా కలిసి ప్రతినిధుల సభను నిర్వహించి రాష్ట్ర పార్టీ ఆదేశం మేరకు తీర్మానాలు చేస్తామన్నారు. రేపు ఉదయం 8 గంటల నుంచి పండగ వాతావరణంలో ఆయా గ్రామాల్లో, ప్రాంతాల్లో జెండాను ఎగరవేసి ఆ స్థానిక బీఆర్ఎస్ శ్రేణులంతా కలిసి రాజశ్రీ గార్డెన్ చేరుకుంటారని మంత్రి వెల్లడించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిని మంత్రి తీవ్రంగా ఆక్షేపించారు.

ప్లీనరీలో తెలంగాణ ప్రభుత్వం పేదలకు, సమాజానికి చేస్తున్న మంచితో పాటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వల్ల సమాజానికి జరుగుతున్న చెడును సైతం వివరిస్తామన్నారు. వెనుకబడిన వర్గాలకు చెందిన జనాబా దేశంలో 56 శాతం ఉందని దానిని అధికారికంగా నిర్దారించకపోవడం వల్ల అన్ని రంగాల్లో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. అందు కోసం జనగణనలో ఖచ్చితంగా బీసీ కుల గణన చేపట్టాలని, అంతే కాకుండా చట్ట సభల్లో ఆ దామాషా ప్రకారం బీసీ రిజర్వేషన్లు ప్రవేశ పెట్టాలన్నారు.

రూ.47 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్లో బీసీలకు నికరంగా రూ.2 వేల కోట్లు కూడా దక్కలేదన్న గంగుల బీసీ మంత్రిత్వ శాఖ లేకపోవడమే దీనికి కారణమని అన్నారు. బీసీ ప్రధాని అని చెప్పుకొనే బీజేపీ ప్రధాని ఇకనైనా బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ రచయిత బాబా సాహెబ్ అంబేద్కర్ ను ఘనంగా స్మరించుకొని 125 అడుగుల అంబేద్కర్ విగ్రహంతో పాటు, రాష్ట్ర సచివాలయానికి సైతం బాబా సాహెబ్ పేరు పెట్టిందన్న మంత్రి గంగుల, అదే స్పూర్తితో కేంద్రం సైతం నూతన పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ కనుమల్ల విజయ, నగర శాఖ అధ్యక్షులు చల్లా హరిశంకర్, కొత్తపల్లి మున్సిపల్ ఛైర్మన్ రుద్రరాజు, గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్, బీఆర్ఎస్ నేతలు వాసాల రమేష్, కాసారపు శ్రీనివాస్, దీకొండ కుల్దీప్, నేటి రవివర్మ, మిడిదొడ్డి నవీన్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed