వరి పంటపై వరుసగా తెగుళ్ళ దాడి.. తీవ్రంగా నష్టపోతున్న అన్నదాత

by Mahesh |
వరి పంటపై వరుసగా తెగుళ్ళ దాడి.. తీవ్రంగా నష్టపోతున్న అన్నదాత
X

దిశ, కరీంనగర్ బ్యూరో: వరుసగా సోకుతున్న తెగుళ్లు వరి పంటకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. నాట్లు వేసిన నెల రోజుల వ్యవధిలోనే మొగి పురుగు ఆశించగా, ఫిబ్రవరిలో అగ్గి తెగులు సోకింది. ఇప్పుడు పంట చేతికొస్తున్న సమయంలో వరిపైరుపై మూడు రకాల చీడలు దాడి చేసి అన్నదాతను అరిగోస పెడుతున్నాయి. అగ్గి తెగులు, మెడవిరుపు, మొగి పురుగు మూడు చీడలు దాడి చేయడంతో అన్నదాతలు అందోళన చెందుతున్నారు.

మందులు పిచికారి చేసినా..

సమృద్ధిగా వర్షాలు కురియడంతో అన్ని ప్రాజెక్టులు నిండిపోయాయి. యాసంగి సాగుకు ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేస్తామని అధికారులు ప్రకటించడంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో పెద్ద ఎత్తున వరి సాగు చేశారు. పెద్దపల్లి జిల్లాలో 1,99,451 ఎకరాలు, రాజన్న సిరిసిల్లలో 1,71,000 ఎకరాలు, కరీంనగర్ లో 2,71,419 ఎకరాలు, జగిత్యాలలో 1,99,000 ఎకరాల్లో వరి సాగు చేశారు. వరి నాట్లు డిసెంబర్‌లో ప్రారంభమై జనవరి చివర్లో పూర్తయ్యాయి. నాట్లు పూర్తయిన 25 నుంచి 35 రోజుల మధ్యలో వరి పంటకు మొగి పురుగు ఆశించింది. అప్పుడు పంటను రక్షించుకోవడానికి రైతులు రెండు సార్లు మందులు పిచికారి చేశారు. ఆ తర్వాత అగ్గి తెగులు సోకడంతో మళ్లీ రెండు నుండి మూడు సార్లు మందులు పిచికారి చేయాల్సి వచ్చింది.

అకాల వర్షంతో..

తెగుళ్లతోనే పరేషాన్ ఉన్న అన్నదాతలను మార్చిలో కురిసిన అకాల వర్షాలు మరింత కుంగదీశాయి. పెద్ద ఎత్తున పంట నష్టం వాటిల్లింది. ఉన్న పంటపై ఇప్పుడు మూడు రకాల తెగుళ్లు దాడి చేస్తున్నాయి. పైరుకు మొగి పురుగు, మెడవిరుపు, అగ్గి తెగులు ఆశించి తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. వరి కంకులు తెల్లగా మారిపోవడంతో దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో 20 నుంచి 25 శాతం దిగుబడి తగ్గే అవకాశమున్నదని వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు.

సాధారణంగా యాసంగిలో సుమారు 25 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. ఈసారి చీడ పీడల ప్రభావం ఎక్కువగా ఉండటంతో ఎకరాకు సుమారు ఐదు క్వింటాళ్ల వరకు దిగుబడి తగ్గవచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే పెట్టుబడి ఖర్చులు ఎక్కువ కావడం, దిగుబడి తగ్గుతుండడంతో తీవ్రంగా నష్టపోతున్నారని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed