ధరణిపై కాంగ్రెస్ ఫోకస్..సమస్యలు గుర్తిస్తూ ప్రజల్లోకి..

by samatah |
ధరణిపై కాంగ్రెస్ ఫోకస్..సమస్యలు గుర్తిస్తూ ప్రజల్లోకి..
X

దిశ, పెద్దపల్లి: తాను అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ రద్దు చేస్తామని ప్రకటించిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రె‌డ్డి ధరణి సమస్యలను మరింత ఫోకస్ చేసే పనిలో పడ్డారు. ధరణి సమస్యలను గ్రామ గ్రామాన గుర్తించి రైతుల మద్దతు పొంది వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందాలని కాంగ్రెస్​ పార్టీ భావిస్తుంది. ధరణి సమస్యలను గుర్తించే పనిలో భాగంగా పెద్దపల్లి నియోజకవర్గాన్ని ఫైలెట్ ప్రాజెక్ట్‌గా తీసుకున్నారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలోని సుల్తాన్​ పూర్‌లో ప్రారంభిస్తున్న కార్యక్రమానికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్​‌తో పాటు పీపీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ సెక్రెటరీ శ్రీధర్ బాబు హాజరుకానున్నారు. కాంగ్రెస్​ పార్టీ సోషల్​ మీడియా విభాగానికి ఇటీవల హైదరాబాద్‌​లో ధరణి సమస్య గుర్తింపు కోసం రెండు రోజుల శిక్షణ ఇచ్చిన విషయం తెలిసిందే.

నేడు సుల్తాన్​పూర్​ నుంచి..

ధరణి సమస్యల గుర్తింపులో భాగంగా పెద్దపల్లి జిల్లాలోని ఎలిగేడు మండలంలోని సుల్తాన్​పూర్​ గ్రామం నుంచి ప్రారంభించనున్నారు. ముఖ్య అతిథులుగా ఏఐసీసీ కార్యదర్శి జైరాం రమేష్​‌తో‌పాటు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి ఏఐసీసీ సెక్రెటరీ శ్రీధర్​ బాబు హాజరుకానున్నారు. ఉదయం 10గంటలకు ధరణి పోర్టల్​ సమస్యలను గుర్తించే కార్యక్రమాన్ని ప్రారంభించిన తరవాత ఏర్పాటు చేసిన సమావేశంలో నేతలు ప్రసంగిస్తారు. ధరణి పోర్టల్​ సమస్యలపై కాంగ్రెస్​ పార్టీ చేపట్టిన కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు.

Advertisement

Next Story

Most Viewed