Collector Sandeep Kumar Jha : ఓటరు జాబితా రూపకల్పన పై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలి

by Aamani |
Collector Sandeep Kumar Jha :  ఓటరు జాబితా రూపకల్పన పై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలి
X

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : గ్రామీణ ఓటరు జాబితాను పకడ్బందీగా రూపొందించేందుకు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ సంపూర్ణ సహకారం అందజేయాలని, ఓటరు జాబితా రూపకల్పనపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ కోరారు. బుధవారం ఆయన సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని మినీ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ ఖీమా నాయక్ తో కలిసి గ్రామీణ ఓటర్ల జాబితా రూపకల్పన పై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీలకు 2వ సాధారణ ఎన్నికల నేపథ్యంలో గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితా రూపకల్పనకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిందని, ఈ షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 13న గ్రామ పంచాయతీలలో వార్డుల వారీగా ఓటరు జాబితా సిద్ధం చేసి గ్రామ పంచాయతీ కార్యాలయాలలో ప్రదర్శించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.

జిల్లాలో కొత్త గ్రామపంచాయితీల ప్రతిపాదనలు కలుపుకుని మొత్తం 260 గ్రామ పంచాయతీల పరిధిలోని 2268 వార్డుల్లో మొత్తం 3 లక్షల 46 వేల 220 ఓటర్లతో డ్రాఫ్ట్ ఓటరు జాబితా విడుదల చేశామన్నారు. ఇందులో గల అభ్యంతరాలు, నూతన ఓటర్ నమోదు దరఖాస్తులను సెప్టెంబర్ 21 లోపు సంబంధిత మండలాల ఎంపీడీఓలకు లిఖిత పూర్వకంగా సమర్పించాలని, సెప్టెంబర్ 26 లోపు అభ్యంతరాలను పరిష్కరించి, సెప్టెంబర్ 28న తుది ఓటర్ల జాబితా విడుదల చేస్తామన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఇంఛార్జి పంచాయతీ అధికారి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శేషాద్రి, జడ్పీ డిప్యూటీ సీఈఓ గీతా,వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed