మార్చి 15 కల్లా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పంపిణీకి సిద్ధంగా ఉండాలి: కలెక్టర్

by S Gopi |
మార్చి 15 కల్లా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పంపిణీకి సిద్ధంగా ఉండాలి: కలెక్టర్
X

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ రూం ఇండ్ల పెండింగ్ పనులను పూర్తి చేసి వచ్చే మార్చి 15 కల్లా లబ్ధిదారులకు ఇచ్చేందుకు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మున్సిపల్, ఆర్ అండ్ బీ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ... సిరిసిల్ల మున్సిపల్ అర్బన్ పరిధిలో ఉన్న పెద్దూరు, రగుడు, సిరిసిల్లలోని శాంతినగర్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేసి, లబ్ధిదారులకు అందజేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. రగుడులో 72, శాంతి నగర్ లో 204, పెద్దూర్ లో 516 డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం చేపట్టిన చోట బ్లాకుల వారీగా నిర్మాణాలు, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలనీ మున్సిపల్ అధికారులకు జిల్లా కలెక్టర్ సూచించారు.

నిర్మాణాలు పూర్తయిన చోట విద్యుద్దీకరణ, శానిటరీ, డ్రైన్స్ నిర్మాణం, విద్యుత్, సీవరేజ్, సెప్టిక్ ట్యాంకుల నిర్మాణాలు, అంతర్గత రోడ్లపై దృష్టి పెట్టి పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. ప్రతి డబుల్ బెడ్ రూం కాలనీలో ఆరోగ్య ఉప కేంద్రం, అంగన్వాడీ కేంద్రాలకు అనువైన బిల్డింగ్ లను గుర్తించాలని చెప్పారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కాలనీకి వెళ్లే మార్గాలు, అంతర్గత రోడ్లకు ఇరువైపులా మొక్కలను నాటాలన్నారు. వివిధ శాఖల సమన్వయంతో మార్చ్ 15 కల్లా పనుల పూర్తికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పంపిణీలకు సిద్ధంగా ఉండేలా చూడాలన్నారు.

మార్చి నెలాఖరులోగా గ్రౌండ్ అభివృద్ధి పనులను పూర్తి చేయాలి

అనంతరం జిల్లా కలెక్టర్ సిరిసిల్ల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో గ్రౌండ్ అభివృద్ధి పనులను మున్సిపల్ కమిషనర్ సమ్మయ్యతో కలిసి పరిశీలించారు. రూ. 2 కోట్లతో చేపడుతున్న ఈ అభివృద్ధి పనులలో వేగం పెంచి మార్చి నెలాఖరులోగా అభివృద్ధి పనులను పూర్తి చేయాలన్నారు. గ్రౌండ్ కు వచ్చే అన్ని గేట్ల ప్రవేశ మార్గాలను అందంగా తీర్చిదిద్దాలన్నారు. క్రికెట్, కబడ్డీ, వాలీబాల్ కోర్టులను అభివృద్ధి చేయాలన్నారు. రాత్రి వేళలో కూడా క్రీడలను సాధన చేసేందుకు వీలుగా నాలుగు వైపులా లైట్లు ఏర్పాటు చేయాలన్నారు. వాకింగ్ ట్రాక్ ను కూడా ఏర్పాటు చేస్తూ దానికి ఇరువైపులా అలంకరణ మొక్కలను నాటాలన్నారు. గ్రౌండ్లో మహిళలకు, పురుషులకు వేర్వేరుగా టాయిలెట్ బ్లాకులను నిర్మించాలనీ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, ఎమ్మార్వో విజయ్ కుమార్, ఏఈ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed