Collector : మహిళల ఆరోగ్యం కోసమే శుక్రవారం సభ

by Sridhar Babu |
Collector : మహిళల ఆరోగ్యం కోసమే శుక్రవారం సభ
X

దిశ, హుజురాబాద్ రూరల్ : పోషకాహార లోపం బారిన పడకుండా మహిళలను ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దేందుకే మూడు నెలల క్రితం శుక్రవారం సభ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు కలెక్టర్ పమేలా సత్పతి (Collector Pamela Satpathy)అన్నారు. శుక్రవారం మహిళాభివృద్ధి శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మండలంలోని వెంకట్రావుపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రం ఆవరణలో శుక్రవారం సభ ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరై మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రంలో ప్రతి శుక్రవారం నిర్వహించే శుక్రవారం సభ (Friday meeting)కు మహిళలు తప్పనిసరిగా రావాలన్నారు. దీంతో పోషకాహారం, ఆరోగ్య పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలపై అవగాహన కలుగుతుందని పేర్కొన్నారు.

మహిళలు మొదట తమ ఆరోగ్యంపై దృష్టి సారించాలన్నారు. ఆరోగ్య మహిళా కార్యక్రమం కింద ప్రభుత్వ ఆసుపత్రుల్లో 52 రకాల వైద్య పరీక్షలు (52 types of medical tests)ఉచితంగా చేస్తారని, మహిళలందరూ మూడు నెలలకోసారి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఇవే పరీక్షలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేయించుకుంటే సుమారు 40 వేలకు పైనే అవుతాయన్నారు. అంగన్వాడీ కేంద్రాలను ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా అప్ గ్రేడ్ చేసి టీచర్లకు శిక్షణ ఇచ్చామన్నారు. ఐదేళ్ల లోపు చిన్నారులను కేంద్రాలకు విధిగా పంపించాలని తల్లులకు సూచించారు.

భ్రూణ హత్యలు పాపమని, కడుపులో ఉన్న బిడ్డ ఆడపిల్ల అని తెలిస్తే బయటి ప్రపంచాన్ని చూడనివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆడపిల్ల అయినా మగపిల్లాడు అయినా ఒకేలా చూడాలన్నారు. భ్రూణ హత్యలు జరగకుండా ప్రజలను చైతన్యవంతం చేయాలని పాత్రికేయులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, ఆర్డీఓ రమేష్ బాబు, డీఎంహెచ్ఓ సుజాత, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, తహసీల్దార్ కనకయ్య, అంగన్వాడీ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story