మంత్రి కేటీఆర్ సొంత ఇలాఖాలో 'సోషల్' చిచ్చు... రంగంలోకి మంత్రి గంగుల

by Sathputhe Rajesh |   ( Updated:2022-03-19 05:02:36.0  )
మంత్రి కేటీఆర్ సొంత ఇలాఖాలో సోషల్ చిచ్చు...  రంగంలోకి మంత్రి గంగుల
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: చిలికి చిలికి గాలివానలా తయారైన ఎల్లారెడ్డిపేట పంచాయితీ శుక్రవారం అర్థరాత్రి వరకూ కొనసాగింది. సిరిసిల్ల జిల్లా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి టీఆర్‌ఎస్, బీజేపీ నాయకులను చెదరగొట్టేందుకు లాఠీఛార్జ్ చేశారు. ఇదే సమయంలో కొంతమంది బీజేపీ నాయకులు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య ఇంటివైపు వెళ్లారు. ఆగయ్య ఇంటిపై దాడి జరిగే అవకాశాలు ఉన్నాయన్న విషయాన్ని పసిగట్టిన పోలీసులు.. అటుగా వెళ్తున్న బీజేపీ నాయకులను అడ్డుకున్నారు. అయితే తోట ఆగయ్య ఇంటిపై బీజేపీ నాయకులు దాడి చేశారంటూ టీఆర్‌ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. తెల్లవారుజాము వరకూ పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఎల్లారెడ్డిపేటలో పెద్ద ఎత్తున పోలీసులు రంగంలోకి దిగి ఎక్కడికక్కడ పికెట్లు ఏర్పాటు చేశారు. పరిస్థితిని కట్టడి చేసేందుకు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డె ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతున్నారు.

రంగంలోకి మంత్రి గంగుల

శుక్రవారం అర్థరాత్రి రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య ఇంటిపై దాడి జరిగిందన్న సమాచారం అందుకున్న మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్ లతో పాటు పలువురు టీఆర్‌ఎస్ నాయకులు ఎల్లారెడ్డిపేటకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. బీజేపీ నాయకులు చేసిన దాడి గురించి ఆరా తీసి ఆగయ్యకు బాసట ఇవ్వనున్నారు.

సోషల్ మీడియా చిచ్చే...

బీజేపీ, టీఆర్‌ఎస్ కార్యకర్తల మధ్య సోషల్ మీడియా వేదికగా జరిగిన బూతు పురాణమే ఇంతదూరం తీసుకొచ్చిందని తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టుగా బూతులతో ఛాటింగ్ చేయడంతో గురువారం బీజేపీ కార్యకర్తను కొంతమంది టీఆర్‌ఎస్ నాయకులు మందలించారు. ఈ విషయంపై శుక్రవారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు బీజేపీ కార్యకర్తలు వెళ్లడం, ఈ విషయం టీఆర్‌ఎస్ నాయకులకు లీక్ కావడంతో ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ రణరంగంగా మారిపోయింది.

Advertisement

Next Story

Most Viewed