Bomma Mahesh Kumar Goud : త్యాగాలు చేసిన కుటుంబం పై విమర్శలా..?

by Aamani |
Bomma Mahesh Kumar Goud : త్యాగాలు చేసిన కుటుంబం పై విమర్శలా..?
X

దిశ,హుజురాబాద్ రూరల్: దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసిన ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ల కుటుంబంపై తీవ్రవాద భాష వాడుతున్న బిజెపి నాయకులపై కేసులు నమోదు చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. టీపీసీసీ అధ్యక్షునిగా ఎన్నికై బుధవారం మొట్టమొదటిసారి హుజురాబాద్ పట్టణానికి విచ్చేసిన ఆయనకు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో పదవులు అనుభవించి బీజేపీ పార్టీలో చేరిన కొందరు నాయకులు కాంగ్రెస్ పార్టీని విమర్శించడం బాధాకరంగా ఉందన్నారు. బీజేపీ నాయకులు రాహుల్ గాంధీ పై తీవ్రవాద భాష మాట్లాడుతుంటే దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హోంమంత్రి అమిత్ షా లు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు.

మహాత్మా గాంధీని గాడ్సే చంపితే సంబరాలు చేసుకున్న బీజేపీ పార్టీ నాయకులు గాడ్సే విధానాలను అవలంబిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కులం, మతం పేరిట రాజకీయాలు చేసి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బిజెపి పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులను, రాహుల్ గాంధీని విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ ,హోంమంత్రి అమిత్ షా కుటుంబాల్లో ఎవరైనా దేశం కోసం ప్రాణ త్యాగం చేశారా అని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతం దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే రాహుల్ గాంధీ పై బిజెపి నాయకులు విమర్శలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర రవాణా ,బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ... అధికారులు ,ప్రజల సహకారంతో వినాయక నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా జరిగిందన్నారు.

సమ్మిరెడ్డి కుటుంబానికి అండగా ఉంటాం... జమ్మికుంట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సమ్మిరెడ్డి ఇటీవల ఆకస్మిక మరణం చెందడం బాధాకరమని వారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. సమ్మిరెడ్డి తనకు చాలా కాలంగా సుపరిచితుడని ఆయన మృతి తనను ఎంతగానో బాధించిందని పేర్కొన్నారు. ఆయన అంత్యక్రియలకు తాను హాజరు కావాలని ప్రయత్నం చేశానని పరిస్థితి అనుకూలించక మంత్రి పొన్నం ప్రభాకర్ ను పంపించినట్లు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed