Bandi Sanjay : బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ పైనే కేసీఆర్‌కు నమ్మకం ఎక్కువ

by Mahesh |   ( Updated:2023-06-22 06:41:05.0  )
Bandi Sanjay : బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ పైనే కేసీఆర్‌కు నమ్మకం ఎక్కువ
X

దిశ, కరీంనగర్: కాంగ్రెస్‌లో చేరడమంటే బీఆర్ఎస్‌కు సహకరించినట్లేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బీఆర్ఎస్ నాయకల కంటే కాంగ్రెస్ పైనే ఎక్కువ నమ్మకం ఉందన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని నడిపిస్తోంది కేసీఆర్ అని, 30 స్థానాల్లో ఆ పార్టీకి డబ్బులు పంపిణీ చేశారని అన్నారు. కాంగ్రెస్ నుంచి ఎవరు గెలిచినా మళ్లీ వెళ్లేది బీఆర్ఎస్‌లోకేనని చెప్పారు. కేసీఆర్ ను ఓడించాలి.. ప్రజలను ఆదుకోవాలనే లక్ష్యంతో పనిచేస్తున్న నాయకులంతా ఈ విషయంపై ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. 9 ఏళ్లుగా ప్రజలను పట్టించుకోని కేసీఆర్ ప్రచారం కోసం వెయ్యి కోట్ల ప్రజా ధనాన్ని ఖర్చు చేస్తూ ప్రజలను మభ్యపెట్టేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. ఏనాడూ అమరవీరుల కుటుంబాల ముఖం చూడని కేసీఆర్.. ఇయాళ పిలిచి సన్మానం చేయడం.. శంకరమ్మకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం వెనుక పెద్ద జిమ్మిక్కు అని అన్నారు.

‘మహా జన సంపర్క్ అభియాన్’’లో భాగంగా బండి సంజయ్ ఈరోజు కరీంనగర్ లోని చైతన్యపురి, జ్యోతి నగర్ కాలనీలో ఇంటింటికీ బీజేపీ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఇంటికీ వెళ్లి పేరుపేరునా పలకరిస్తూ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం గత 9 ఏళ్లలో సాధించిన విజయాలు, చేపట్టిన అభివృద్ధి, పేదలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. స్టిక్కర్లను స్వయంగా అంటించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

పోలింగ్ బూత్ అధ్యక్షుడి నుండి రాష్ట్ర అధ్యక్షుడి వరకు తాము నివాసం ఉండే పోలింగ్ బూత్‌లకు వెళ్లి ప్రజలతో మమేకం అవుతుండటం సంతోషంగా ఉంది. మోడీ గారు 9 ఏళ్ల పాలనను వివరిస్తూ ఇంటింటికీ కరపత్రాలను పంపిణీ చేస్తున్నాం. ఇంటింటికీ బీజేపీ’’ కార్యక్రమం ద్వారా ఈ ఒక్కరోజే 35 లక్షల కుటుంబాలను కలవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. తెలంగాణలో 90 లక్షలకు పైగా కుటుంబాలుంటే అందులో మూడో వంతుకు పైగా కుటుంబాలను బీజేపీ కార్యకర్తల నుండి రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకుల వరకు కలిసేలా కార్యాచరణ రూపొందించాం. ఇది ఒక రికార్డు.

అలాగే తెలంగాణకు కేంద్రం ఏం చేసిందనే అంశంపై మొన్న కిషన్ రెడ్డి అన్ని వివరాలు ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీ కూడా ఎన్నికలప్పుడు ఏయే హామీలిచ్చారు? ఎన్ని నెరవేర్చారు? ఎంత అభివ్రుద్ధి చేశారో ‌వివరించాలని మేం కోరుతుంటే.. కేసీఆర్ కుటుంబం మాత్రం అందుకు భిన్నంగా ప్రతిపక్షాలను తిట్టడమే పనిగా పెట్టుకుంది. ప్రజలను నమ్మించి మోసం చేస్తున్నారు. ప్రజలను మభ్యపెట్టేందుకు ఇయాళ 15 వేల ఇండ్లను ప్రారంభిస్తున్నడట. కేసీఆర్ తీరు ఎట్లుందంటే కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుంది. డబుల్ బెడ్రూం ఇండ్లు కూడా శిథిలావస్థలో ఉన్నయ్. క్వాలిటీ లేదు. గోడలు కూలుతున్నయి. కిటీకీలు ఊడుతున్నయ్. పేదలు ఇండ్లు లేక కిరాయిలు కట్టలేక అల్లాడుతున్నరు.

అందరికీ ఇండ్లు ఇవ్వండి. కేంద్రం 2. 4 లక్షల ఇండ్లు మంజూరు చేసింది. అవన్నీ ప్రజలకు పంచిపెడితే మరో 5 లక్షల ఇండ్లను మంజూరు చేయించే బాధ్యత నాదని కూడా చెప్పినా.. కేసీఆర్ ఇంత వరకు పట్టించుకోలేదు. ప్రజలను మభ్యపెట్టేందుకు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి పేపర్లు, టీవీల్లో యాడ్స్ ఇస్తూ ప్రజలు చెమటోడ్చి సంపాదించిన సొమ్ముతో కట్టిన పన్నుల ఆదాయాన్ని యాడ్స్ పేరుతో నీళ్లలా ఖర్చు చేస్తూ.. ప్రజాధనాన్ని వ్రుధా చేస్తున్నారు. ఢిల్లీ ఎయిర్ పోర్టులో దళిత బంధు సక్సెస్ అని, డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చినట్లు హోర్డింగ్స్, వీడియోలు పెట్టడానికి సిగ్గుండాలే.

దళిత బంధులో 30 శాతం కమీషన్లు తీసుకుంటున్నరని కేసీఆరే చెప్పిండు. ఏకంగా బడ్జెట్‌లోనే వెయ్యి కోట్లు ప్రచారం కోసం కేటాయించారంటే కేసీఆర్‌కు ప్రచార యావ ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవాలి. ధరణి తప్పుల తడక. రైతులు అల్లాడుతున్నరు. కేసీఆర్ కు నిజంగా దమ్ముంటే.. పరేడ్ గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభ పెట్టి స్క్రీన్లు పెట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఎవరు ఎక్కువ అభివ్రుద్ధి చేశారో వివరిద్దాం.. చర్చిద్దాం... సిద్దమా?

ఇంతకీ కేసీఆర్ సాధించిందేమిటి? రుణమాఫీ, నిరుద్యోగ భృతి, ఏ ఇంటికో ఉద్యోగం, పేదలందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు వంటి ఏ ఒక్క హామీని నెరవేర్చలేక పోయారు. ఇది తెలిసే ప్రజలను మభ్యపెట్టేందుకు కేసీఆర్ వందల కోట్లు ఖర్చు పెట్టి ప్రచారం చేసుకుంటున్నడు. బీజేపీ- బీఆర్ఎస్ ఒకటేనంటూ కాంగ్రెస్ చేస్తున్న ప్రచారంపై.. దుబ్బాకలో బీజేపీ ఎవరి మీద గెలిచింది. హుజూరాబాద్, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీపై బీజేపీ గెలిచింది.

కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు రాలే.... కాంగ్రెస్ సిట్టింగ్ సీట్లలో కూడా ఆ పార్టీకి డిపాజిట్లు గల్లంతైనాయి. బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనని ప్రజలు నమ్మి ఓట్లేస్తున్నరు. అంతేగాదు.. పార్లమెంట్‌లో బీఆర్ఎస్-కాంగ్రెస్ కలిసే కొట్లాడుతున్నయ్. ఢిల్లీలో ర్యాలీలు తీస్తున్నయ్. బీఆర్ఎస్-కాంగ్రెస్ కలిసే పోటీ చేయబోతున్నాయని జానా రెడ్డి, కోమటిరెడ్డి అంటున్నారు. ఇప్పుడు మీరు చెప్పండి ఎవరు ఎవరితో కుమ్మక్కయ్యారో?

పొన్నం వ్యాఖ్యలపై.. విమర్శలు హుందాగా ఉండాలే. నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సాయంతో ఎంపీగా గెలిచానంటే జనం నవ్వుకుంటున్నారు. అదే నిజమైతే రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీలుగా ఎట్లా గెలిచారని ప్రశ్నించారు. కాంగ్రెస్ మునిగిపోయే నావ. కేసీఆర్‌ను ఓడించాలి-ప్రజలను ఆదుకోవాలని లక్ష్యం ఉన్న నాయకులెవరూ ఆ పార్టీలో చేరవద్దని కోరుతున్నా. ఎందుకంటే కాంగ్రెస్-బీఆర్ఎస్ ఒక్కటే. కాంగ్రెస్ తో కేసీఆర్ కలిసి పనిచేస్తున్నడు. గతంలో పొత్తు పెట్టుకున్నడు. ఈసారి కూడా కలిసే పోటీ చేస్తారని చెప్పుకొచ్చారు.

బీజేపీ జాయినింగ్స్ కమిటీ విఫలమైనట్లేనా?

విఫలం, సఫలం అనేది ఉండదు. ఎవరి ఆలోచనలకు అనుగుణంగా వారు ఉంటారు. అందరికీ నేను చెప్పేది ఒక్కటే. బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా కొట్లాడుతున్న పార్టీ ఏది? ప్రజలు ఏ పార్టీని ఆదరిస్తున్నారో అర్ధం చేసుకోవాలని అన్నారు.

కవితను లిక్కర్ స్కాం లో అరెస్ట్ చేయకపోవడంపై

సీబీఐ, ఈడీ రాజ్యాంగబద్ద సంస్థలు. మోదీ హయాంలో అవినీతిపరులు తప్పించుకునే ఆస్కారమే లేదు. అయితే నిందితులు తప్పించుకోవడానికి వీల్లేకుండా పకడ్బందీగా ఆధారాలు సేకరించిన తర్వాత అరెస్టు చేసి జైలుకు పంపుతోంది. అంతే తప్ప బీజేపీ చెబితే అరెస్టు చేయరు. వద్దంటే ఆగరని బండి సంజయ్ అన్నారు.

Read more :

ఎన్నికల వేళ బీజేపీకి బిగ్ షాక్! ‘ఇంటింటికి బీజేపీ’‌కి ఇద్దరు కీలక నేతలు దూరం

పార్టీ మార్పు ప్రచారం.. కొండా విశ్వేశ్వర్ రెడ్డి క్లారిటీ

వారం రోజులు.. 119 సభలు.. బీజేపీ భారీ ప్లాన్

Advertisement

Next Story