బీజేపీ కార్యకర్తలకు బంపర్ ఆఫర్ ప్రకటించిన బండి సంజయ్

by Aamani |
బీజేపీ కార్యకర్తలకు బంపర్ ఆఫర్ ప్రకటించిన బండి సంజయ్
X

దిశ, కరీంనగర్ రూరల్: దేశమంతా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టిన రోజు వేడుకలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ బుధవారం బీజేపీ కార్యకర్తలకు ‘ప్రజాస్వామ్య కానుక’ను అందించారు. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో 80 శాతం అంతకంటే ఎక్కువ పోలింగ్ ను నమోదు చేయించిన పోలింగ్ బూత్ కమిటీలను గుర్తించి ఘనంగా సన్మానించారు. నగదు ప్రోత్సహకాన్ని సైతం అందించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ లో గత కొంత కాలంగా ఎన్నికల పోలింగ్ శాతం నానాటికీ పడిపోతుండటంతో ఒకవైపు ఎన్నికల సంఘం ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు అనేక చర్యలు చేపట్టింది. అయినప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదని హైదరాబాద్, సికింద్రాబాద్ సహా నగరాలు, పట్టణాల్లో పోలింగ్ శాతం 50, 60 శాతం దాటడం లేదన్నారు.

ఇది గమనించిన బండి సంజయ్ మొన్నటి ఎంపీ ఎన్నికల సందర్భంగా మీకు నచ్చితే ఏ పార్టీకైనా ఓటు వేయాలని అభ్యంతరం లేదన్నారు. కానీ తప్పనిసరిగా ఓటు మాత్రం వేయాలని పిలుపునిచ్చారు. అదే సమయంలో బీజేపీ కార్యకర్తలకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. నా పార్లమెంట్ నియోజకవర్గంలో పార్టీ గుర్తులతో సంబంధం లేకుండా ఏ పోలింగ్ బూత్ లోనైతే 80 శాతం, అంతకుమించి ఓట్లు పోలవుతాయనే ఆ పోలింగ్ బూత్ కమిటీ బాధ్యులకు ఒక్కొక్కరికి రూ.10 వేల నగదు ప్రోత్సాహకం తో పాటు ఘనంగా సత్కరిస్తానని ప్రకటించారు.ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాల అనంతరం ఏ పోలింగ్ బూత్ లో 80 శాతానికి పైగా ఓట్లు పోలయ్యాయనే వివరాలను సేకరించారు. ఒకటి రెండు కాదు... ఏకంగా 222 పోలింగ్ బూత్ లలో ఏకంగా 80 శాతం అంతకంటే ఎక్కువ ఓటింగ్ నమోదైనట్లు జాబితా రూపొందించారు. కొన్ని పోలింగ్ బూత్ లలో బీజేపీకి తక్కువ ఓట్లు పోలైనట్లు గుర్తించినప్పటికీ, వాటిని కూడా ఈ జాబితాలో చేర్చారు.నరేంద్ర మోదీ జన్మదిన వేడుకల సందర్భంగా బీజేపీ పక్షం రోజుల పాటు ‘సేవా పఖ్వాడ’ పేరిట అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్న విషయం తెలిసిందే. బుధవారం సాయంత్రం కరీంనగర్ లోని ఈఎన్ గార్డెన్ లో ఆయా పోలింగ్ బూత్ కమిటీ సభ్యులందరినీ పిలిపించి వారిని ఘనంగా సన్మానించారు. నగదు బహుమతి అందజేసి ప్రోత్సహించారు. అంతకుముందు బీజేపీ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మోదీ జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని బండి సంజయ్ ప్రారంభించారు. పలువురు బీజేపీ కార్యకర్తలు స్వచ్ఛందంగా రక్తదాన శిబిరానికి హాజరై రక్తదానం చేశారు.

Advertisement

Next Story

Most Viewed