బీఆర్ఎస్ పాలనలో దగా పడ్డ ఉద్యమకారులు..: ఎమ్మెల్యే కవ్వంపల్లి

by Aamani |
బీఆర్ఎస్ పాలనలో దగా పడ్డ ఉద్యమకారులు..: ఎమ్మెల్యే కవ్వంపల్లి
X

దిశ, తిమ్మాపూర్ : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేయగా, రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వారి త్యాగాలను గుర్తించి గౌరవిస్తోందని మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ఈనెల 27, 28 తేదీల్లో కరీంనగర్ లోని అమరవీరుల స్థూపం నుంచి వేములవాడ మహాదేవుని ఆలయం వరకు నిర్వహించ తలపెట్టిన మహా పాదయాత్ర కు సంబంధించిన పోస్టర్ ను ఆయన గురువారం ఎల్ఎండీ కాలనీలోని క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులను గత ప్రభుత్వం తన రాజకీయ అవసరాల కోసం వాడుకుని వదిలేసిందని విమర్శించారు. అన్ని విధాలుగా ఉద్యమకారులను దగా చేసిందని ఆయన మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ముఖ్య భూమిక పోషించిన ఉద్యమకారులను కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి సముచిత రీతిలో గౌరవిస్తుందన్నారు.

తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా నెరవేరుస్తుందని, భవిష్యత్తులోనూ వారికి అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. మంచి సంకల్పం తో నిర్వహించ తలపెట్టిన ఈ పాదయాత్రను విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కరీంనగర్ జిల్లా చైర్మన్ కనకం కుమారస్వామి, రాష్ట్ర మహిళా నాయకురాలు ఐల ప్రసన్న, కంజర్ల రేణుక, భార్గవి , ఫోరం మండలాల అధ్యక్షుడు దేవునూరి అంకూస్, గోశెట్టి సంజీవ్, బట్టి చంద్రమౌళి, భూమ సదానందం, కే విద్యాసాగర్, తాటిపల్లి శంకర్, నాయకులు మామిడి మొగిలి, చొప్పరి సుధాకర్, తార, మామిడి వెంకటి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed