గ్రామస్థాయిలో ప్రభుత్వ ఫలాలు అందేలా చర్యలు

by Sridhar Babu |
గ్రామస్థాయిలో ప్రభుత్వ ఫలాలు అందేలా చర్యలు
X

దిశ, పెద్దపల్లి : ప్రజలకు గ్రామ స్థాయిలో ప్రభుత్వ ఫలాలు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లో గ్రామపంచాయతీల పని తీరు పై కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇందిరమ్మ ఇండ్ల సర్వే, జాతీయ ఉపాధి హామీ పనులు, గ్రామాలలో పారిశుద్ధ్య నిర్వహణ, డంపింగ్ యార్డ్, విద్యుత్ సరఫరా పనులు, గ్రామపంచాయతీ ఎన్నికల సన్నద్ధత వంటి పలు అంశాలపై కలెక్టర్ సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి మండలంలో ఉపాధి హామీ పనుల్లో లేబర్ టర్న్ ఔట్ పెంచాలని, ఉపాధి కార్మికులకు కూలీల చెల్లింపు సకాలంలో జరిగేలా చూడాలని, కూలీల చెల్లింపులు ఎటువంటి సమస్యలు రావద్దని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. గ్రామాలలో నూతనంగా నిర్మాణం అవుతున్న ఇండ్లలో స్వచ్ఛ భారత్ మిషన్ కింద వ్యక్తిగత మరుగుదొడ్లు (ఐ.హెచ్.హెచ్.ఎల్) మంజూరు చేయాలని కోరారు.

గ్రామాలలో పారిశుద్ధ్య నిర్వహణపై మండల పంచాయతీ అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. గ్రామాలలో చెత్త అధికంగా ఉంటున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని, రోడ్ల పై చెత్త, ప్లాస్టిక్ ఉండకుండా పంచాయతీ కార్యదర్శులను బాధ్యులను చేయాలని, ప్రతి రోజూ మల్టి పర్పస్ వర్కర్లతో రోడ్లు శుభ్రం చేయించాలని, పనులను నిరంతరం తనిఖీ చేయాలని అన్నారు. ప్రతి రోజూ గ్రామాలలో జరిగే పారిశుద్ధ్య పనులు తనిఖీ చేస్తూ సిబ్బంది అటెండెన్స్ వేయాలని, సంక్రాంతి నాటికి పరిస్థితులు మారాలని అన్నారు. ఎంపీఓ లు అధికంగా గ్రామాలను తనిఖీ చేయాలని, సదరు తనిఖీ వివరాలతో నివేదిక అందించాలని అన్నారు. గ్రామాలలో ఉన్న సెగ్రిగేషన్ షెడ్ పని తీరు పరిశీలన కోసం ఒక బృందాన్ని ఏర్పాటు చేయాలని కలెక్టర్ జిల్లా పంచాయతీ అధికారికి తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో నర్సరీ లలో బ్యాగ్ ఫిల్లింగ్​ ప్రక్రియ సకాలంలో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రతి గ్రామంలో ఉన్న విద్యుత్, తాగు నీటి సమస్యల వివరాలను వచ్చే శనివారం నాటికి జిల్లా పంచాయతీ అధికారికి అందించాలని ఎంపీడీఓలకు సూచించారు.

జాతీయ ఉపాధి హామీ కింద గ్రామాలలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించి చెల్లింపులు సంక్రాంతి నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సన్నద్దం కావాలని, ప్రతి గ్రామంలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులకు పోలింగ్ కు అవసరమైన పోలింగ్ కేంద్రాలు, అవసరమైన సిబ్బంది మొదలగు వివరాలను సరి చూసుకోవాలని అన్నారు. ప్రజా పాలన ద్వారా ఇందిరమ్మ ఇండ్ల కోసం వచ్చిన ప్రతి దరఖాస్తుదారుడి ఇంటికి వెళ్లి ప్రస్తుత స్థితిగతి తెలిసేలా ఫొటో యాప్ లో అప్లోడ్ చేయాలని, ఇందిరమ్మ ఇండ్ల సర్వే ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ప్రతి మండలంలో నమూనా ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం స్థలాన్ని గుర్తించి పనులు వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య, జెడ్పీ సీఈఓ నరేందర్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి, ఎంపీడీఓలు, ఎంపీఓలు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed