మృత్యుదారిగా రహదారి.. అటు వెళ్లాలంటే భయపడాల్సిందే!

by samatah |
మృత్యుదారిగా రహదారి.. అటు వెళ్లాలంటే భయపడాల్సిందే!
X

దిశ, కోరుట్ల రూరల్ : అది జాతీయ రహదారి.. నాలుగు వరుసలతో విశాలంగా మెట్‌పల్లి, కోరుట్ల మీదుగా జగిత్యాలకు వెళ్లే రద్దీగా ఉండే దారి. అయితే అదే మృత్యుదారిగా మారి వాహనదారుల ఉసురు తీస్తున్నది. కొద్ది సంవత్సరాలుగా వరుస ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఎందరో అసువులు బాసి ఎన్నో కుటుంబాలు దిక్కులేనివిగా మారాయి. ఈ వరుస ప్రమాదాలు మేడిపల్లి - మోహన్ రావు పేట్ గ్రామాల మధ్య ప్రాంతంలోనే జరుగుతుండడం ఆందోళన కలిగించే అంశం. నెల రోజుల వ్యవధిలో ఏకంగా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ రహదారి బాధిత కుటుంబాల్లో విషాదం నింపింది. ప్రమాదాలను నివారించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

నెల రోజుల్లోనే ఐదు ప్రమాదాలు..

మెట్‌పల్లి నుంచి కోరుట్ల మీదుగా జగిత్యాలకు వెళ్లే జాతీయ రహదారి నంబరు-63 ప్రమాదాలకు నెలవుగా మారింది. నెల రోజుల్లోనే ఐదు తీవ్రమైన ప్రమాదాలు జరిగి ఏకంగా నాలుగు ప్రాణాలు గాల్లో కలిశాయి. ఐదు కుటుంబాలు పెద్దదిక్కును కోల్పోయాయి. మార్చి 5న మోహన్ రావుపేటకు చెందిన బోయిని గంగారాం ద్విచక్రవాహనంపై వెళ్తుండగా వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కాలు పూర్తిగా శరీరం నుంచి వేరైన గంగారాం చికిత్స పొందుతూ మృతి చెందాడు. అదే నెల 30న ఓ గ్రానైట్ రాళ్లు తరలించే లారీ వేగంగా వచ్చి చెట్టును ఢీకొన్న ఘటనలో క్లీనర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. డ్రైవర్ క్యాబిన్‌లో ఇరుక్కుని పోగా పోలీసులు శ్రమించి బయటకు తీసి తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఏప్రిల్ 3న అదే స్థలంలో మల్యాల మండలంలోని నూకపల్లికి చెందిన రాజయ్యను వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మున్సిపల్ ఉద్యోగి అయిన రాజయ్య అక్కడికక్కడే మృతి చెందగా ఆయన కుటుంబ దిక్కులేనిదైంది. అంతకుముందు నెలలో గల్ఫ్ నుంచి వచ్చిన భీమారం వాసి కారు చెట్టుకు ఢీకొన్న ఘటనలో ఆ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా, మున్సిపల్ ఉద్యోగి రాజయ్య హెల్మెట్ పెట్టుకుని నడుపుతున్నా ప్రమాదంలో మృతి చెందడం ఇక్కడ ఉన్న పరిస్థితికి అద్దం పడుతోంది.

మూలమలుపులే ప్రధాన కారణం..

మేడిపల్లి శివారు నుంచి మోహన్‌రావుపేట శివారు వరకు రెండు ప్రధాన మలుపులు జాతీయ రహదారిపై ఉన్నాయి. ఇప్పటివరకు జరిగిన ప్రమాదాలన్నింటికీ ఈ మలుపులే ప్రధాన కారణం. వరుసగా అదే చోట ప్రమాదాలు జరుగుతూ పదుల సంఖ్యలో ప్రాణాలు పోతున్న ఆ ప్రదేశం యమపురిని తలపిస్తున్నది. ఎదురుగా వచ్చే వాహనాలు ఢీకొనేంత సమీపంలోకి వచ్చేదాకా పరస్పరం కనిపించని విధంగా ఉన్న మలుపుల కారణంగా వాహనదారులు అసువులుబాస్తున్నారు. అలాగే ఈ మలుపు వద్ద ఓవర్‌టేక్ చేసే ప్రయత్నం ప్రాణాలతో చెలగాటమే అవుతున్నా వాహనదారులు తెలిసో తెలియకో ఓవర్‌టేక్ ప్రయత్నాలు చేయడం కూడా ఒక కారణంగా కనిపిస్తున్నది. అలాగే ఈ సమీపంలో ప్రమాదాలు జరిగిన వాహనాలు అక్కడే నిలిపి ఉంచడం, రాత్రివేళ ఆగిపోయిన వాహనాలు ఎటువంటి సూచికలు లేకుండా ఆపి ఉంచడం కూడా పలుసార్లు ప్రమాదానికి కారణం అవుతున్నాయి. ప్రమాదానికి మూల కేంద్రాలుగా ఉన్న ఈ మలుపుల వద్ద తగిన జాగ్రత్తలు పాటించేలా సూచనలు ఏర్పాటు చేయాల్సి ఉంది. అక్కడ ప్రమాద సూచికలు ఏర్పాటు చేసి ప్రమాదాలను నివారించాలనే సోయి అధికారుల్లో కనిపించడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. ఇకనైనా ఈ ప్రాంతాన్ని అత్యంత ప్రమాదకర ప్రాంతంగా గుర్తించి, పటిష్టమైన చర్యలు చేపట్టి తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Next Story