మాఫియాలా కల్వకుంట్ల కుటుంబం : బొడిగె శోభ (వీడియో)

by Sathputhe Rajesh |   ( Updated:2023-10-10 16:04:43.0  )
మాఫియాలా కల్వకుంట్ల కుటుంబం : బొడిగె శోభ (వీడియో)
X

దిశ, డైనమిక్ బ్యూరో: నీళ్లు, నిధులు, నియామకాల నినాదం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ బంగారు తెలంగాణ నినాదం ఎత్తుకున్నారని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకురాలు బొడిగె శోభ విమర్శించారు. తొమ్మిదేళ్లలో కల్వకుంట్ల కుటుంబం మాత్రమే బంగారు తెలంగాణగా మారిందని ధ్వజమెత్తారు. 'దిశ టీవీ'తో మాట్లాడిన ఆమె పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి మాట తప్పిన కేసీఆర్.. తన కుమారుడు కేటీఆర్ కు రెండు సార్లు మంత్రిగా, తన కూతురు ఓడిపోయినా ఎమ్మెల్సీ ఇచ్చి రాజకీయ ఉద్యోగాలు కల్పించాడని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీలో బొడిగే శోభ సభ్యురాలు కాదని వారసురాలని అన్నారు.

చొప్పదండి నియోజకవర్గంలో తన ఎదుగుదలను చూసి ఓర్వలేకే న్యూస్ పేపర్‌ను అడ్డం పెట్టుకుని సంతోష్ తనపై లేనిపోని ఆరోపణలు, అవాస్తవాలు ప్రచారం చేశారన్నారు. కేసీఆర్ చెప్పుడు మాటలు విని ఇప్పుడు అనుభవిస్తున్నాడన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులను ఇమిడించుకోవడం లేదని మండిపడ్డారు. ఉద్యమ కాలంలో కేసీఆర్ కు తామంతా రక్షణగా నిలిస్తే ఆ సమయంలో కవిత, సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి వీళ్లంతా ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. 2018లో చెప్పుడు మాటలు విని తనకు టికెట్ ఇవ్వలేదని ఆరోపించారు. బొడిగె శోభకు టికెట్ ఇవ్వకపోవడంతో కేసీఆర్ ఫెయిల్ అయ్యారని మండిపడ్డారు. ఉద్యమకారురాలిని కేసీఆర్ దెబ్బతీస్తే ఆయన సొంత కూతురు కవితను నిజామాబాద్ ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించారని. కేసీఆర్ మూర్ఖత్వంతో తనలాంటి ఉద్యమకారులను దూరం చేసుకుని ఇవాళ అనుభవిస్తున్నాడన్నారు.

మాఫియాలా కల్వకుంట్ల కుటుంబం

కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబం రాసుకున్న రాజ్యాంగం నడుస్తోందన్నారు. కల్వకుంట్ల కుటుబం ఈ రాష్ట్రంలో మాఫియా కుటుంబంగా మారిందని, ఈ కుటుంబం తెలంగాణను దోచుకుని దాచుకుని విదేశాల్లో పెట్టుబడులు పెడుతోందని ఆరోపించారు. కల్వకుంట్ల కుటుంబమే ఓ పురుగులాంటిదని, అద్బుతమైన వనరులు ఉన్న రాష్ట్రాన్ని చెదల్లా తినేసిందని ఘాటు విమర్శలు చేశారు. తొమ్మిదేళ్ల కేసీఆర్ పరిపాలనలో ఏ వర్గం ఆనందంగా లేదని, ప్రజల బాధలు పంచుకోని ముఖ్యమంత్రి దశాబ్ది ఉత్సవాలు ఎలా జరుపుకోవాలో చెప్పాలన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ ను చావుదెబ్బ కొట్టబోతున్నారని ఇంటెలిజెన్స్ రిపోర్ట్‌తోనే కేసీఆర్ దశాబ్ది ఉత్సవాల పేరుతో ప్రజల్లోకి వెళ్లేందుకు ఇది ఓ నాటకం అన్నారు.

అక్కడ కేసీఆర్ ముఖం చెల్లలేదా?

గతంలో కేసీఆర్ ముఖం చూసే ప్రజలు శోభను గెలిపించారు తప్ప ఆమె కు ప్రయార్టీ లేదనే విమర్శలపై స్పందిస్తూ ఇదే మాట వాస్తవం అయితే నిజామాబాద్ లో కవిత, కరీంనగర్ లో కేసీఆర్ తమ్ముడు అని చెప్పుకునే వినోద్ ఎందుకు ఓడిపోయారు. అక్కడ కేసీఆర్ ముఖం చెల్లలేదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులను ఇమిడించుకోలేదని కేసీఆర్ ను బూతులు తిట్టినవారు ఇవాళ కేబినెట్ లో ఉంటే అదే కేసీఆర్ ను కంటికి రెప్పలా కాపాడుకున్న తనలాంటి ఎందరో ఉద్యమకారులను పార్టీ నుంచి బయటకు పంపించారని అన్నారు. హుందాతనం లేకుండానే ప్రతిపక్షాలపై నోరుపారేసుకునే ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో కేసీఆర్ ఒక్కరే అన్నారు. కేసీఆర్ విమర్శలకు ఆయన భాషలోనే సమాధానం ఇస్తాం తప్ప ఎక్కడా సీఎంను దూషించలేదని, కేసీఆర్‌తో తనకు ఎక్కడ వ్యక్తిగత విభేదాలు లేవన్నారు.

బీజేపీలో అసంతృప్తి కేటీఆర్ సృష్టి!

కేసీఆర్ ను గద్దె దింపే సత్తా బీజేపీకి ఉందా అనే ప్రశ్నకు బదులిస్తూ ఆ సత్తా ఏ పార్టికి ఉందనే విషయం తాను చెప్పలేనన్నారు. కానీ కేసీఆర్ ను ఇంటికి పంపించే సత్తా నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలకు ఉందన్నారు. ప్రజా తీర్పు ముందు కేసీఆర్ జేజమ్మ అయినా దిగిరావాల్సిందే అన్నారు. కేసీఆర్ పాలనకు చరమగీతం పాడబోయేది రాష్ట్ర ప్రజలే అన్నారు. ప్రజలు కాంగ్రెస్, బీఆర్ఎస్ కు అవకాశం ఇచ్చారని బీజేపీకి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. బీజేపీలో తనకు ఎలాంటి ఇబ్బంది లేదని తనకు ఉండే గౌరవం పార్టీలో ఉందని అన్నారు. బీజేపీలో అసంతృప్తులు ఉన్నారనే ప్రచారం అంతా కేటీఆర్ సృష్టినే అన్నారు. బీజేపీలో అసంతృప్తులు ఉన్నారనేది దుష్ప్రచారం చేయడం కోసమే లక్షల రూపాయల జీతాలు ఇస్తూ కేటీఆర్ వందల యూట్యూబ్ ఛానెళ్లు నడిపిస్తున్నాడని ఆరోపించారు. కేంద్రంలో నామినేటెడ్ పదవి దక్కకుండా బీజేపీలోని కొందరు అడ్డుకున్నారనే ఆరోపణల్లో నిజం లేదని తాను ఏనాడు పదవి అడగలేదని వాళ్లు ఇస్తామని చెప్పలేదన్నారు. బీజేపీలో తనను ఎవరు తొక్కిపెట్టడం లేదన్నారు. మోత్కుపల్లి నర్సింహులు బీజేపీ నుంచి బయటకు రావడం ఆయన వ్యక్తిగత విషయం అయినప్పటికీ ఆయన వ్యక్తిపూజను ఇష్టపడ్డారని విమర్శించారు. పొంగులేటి, జూపల్లి ఏ పార్టీలోకి వెళ్లాలి అనేది అది వారి వ్యక్తిగత అభిప్రాయం అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధిష్టానం చొప్పదండి నుంచే తనకు టికెట్ ఇస్తుందని ఆశాభావంతో ఉన్నారని చెప్పారు.

కవిత భర్తనే షాడో ప్రజాప్రతినిధి

తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తన భర్త ఎక్కడా షోడో ఎమ్మెల్యేగా వ్యవహరించలేదన్నారు. ప్రజలకు సేవ చేసే క్రమంలో ప్రజాసమస్యలపై మరింత దృష్టి సారించాలని ప్రోత్సహించాడే తప్ప ఎక్కడా తన అధికారంలో తలదూర్చలేదన్నారు. నా భర్త గాలన్న కవిత భర్త మాదిరిగా కాదన్నారు. కవిత భర్త లిక్కర్ దందా, అక్రమంగా పేదల భూములు, నయీం భూములు లాక్కకున్నట్లు తన భర్త ఎక్కడా చేయలేదన్నారు. భార్యను ఎంపీగా చేసి ఆమె స్థానంలో తానే ఎంపీగా వ్యవహరించిన వాడు కవిత భర్త అని ఆరోపించారు. కొండగట్టు ప్రమాదం సమయంలో తాను ఏడ్చుకుంటూ సీఎం కేసీఆర్, కేటీఆర్, కవిత, ఈటల రాజేందర్ కు తాను ఫోన్ చేశానన్నారు. ప్రమాదం జరిగినా అక్కడికి కేసీఆర్ రాలేదన్నారు.

Advertisement

Next Story

Most Viewed