కాళేశ్వరం పనికిరాని చెత్త ప్రాజెక్ట్.. కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Sathputhe Rajesh |   ( Updated:2023-10-25 16:20:40.0  )
కాళేశ్వరం పనికిరాని చెత్త ప్రాజెక్ట్.. కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : కాళేశ్వరం ప్రాజెక్టు ఒక పనికిరాని చెత్త ప్రాజెక్ట్ అని, ఇదొక పిచ్చి తుగ్లక్ డిజైన్ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు చేశారు. ఢిల్లీలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రూ.30 వేల కోట్లతో పూర్తయ్యే నిర్మాణానికి రూ.లక్ష 30 వేల కోట్లకు పెంచి దోచుకున్నారని ఆరోపణలు చేశారు. అధికారుల నోళ్లు నొక్కి కేసీఆర్ ఇష్టానుసారంగా ప్రాజెక్టు కట్టారని ఫైర్ అయ్యారు. ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆయన ధ్వజమెత్తారు.

కేసీఆర్ ఒక సూపర్ ఇంజినీర్‌గా అవతారమెత్తి డ్రీమ్ ప్రాజెక్ట్ అంటూ నిర్మించిన ప్రాజెక్ట్ గుదిబండగా మారిందని పేర్కొన్నారు. లక్ష్మీ బ్యారేజ్ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ కు లైఫ్ లైన్ అని, ఇది దెబ్బతింటే మొత్తం వ్యవస్థపై దాని ప్రభావం ఉంటుందన్నారు. కాళేశ్వరం.. కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంలా మారింది తప్ప, ఎనీ టైం వాటర్‌గా మారలేదని ధ్వజమెత్తారు. పిల్లర్లు కుంగిపోవడం చాలా పెద్ద సమస్య అని, కుంగిపోయిన తర్వాత 85 గేట్లు ఎత్తి 10 టీఎంసీల నీటిని కిందకు వదిలేయాల్సి వచ్చిందన్నారు. ఏడాదికి 400 టీఎంసీల నీటిని ఎత్తి పోస్తామని చెప్పి ఇప్పటి వరకు మొత్తం కలిపి 154 టీఎంసీల నీటిని మాత్రమే ఎత్తి పోశారని, ఇందులో కేవలం 104 టీఎంసీల నీటిని మాత్రమే వినియోగించారన్నారు.

ఈ ప్రాజెక్ట్ సాగు లక్ష్యం 18.27 లక్షల ఎకరాలయితే.. కేవలం 56 వేల ఎకరాలు మాత్రమే సాగైనట్లు తెలిపారు. ఇంజనీరింగ్ నిపుణులు చేసిన సూచనలను పట్టించుకోకుండా, అధికారుల నోర్లు మూయించి కేసీఆర్ ప్రాజెక్ట్ నిర్మాణం చేశారని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఇదొక పెద్ద బ్లండర్ అని పేర్కొన్నారు. తల మీది నీటిని నోట్లోకి తీసుకురాకుండా, కాళ్ళ దగ్గరకు తీసుకొచ్చి ఆపై నోటి దగ్గరకు తెచ్చినట్టుగా ఈ డిజైన్ ఉందని విరుచుకుపడ్డారు. కుట్ర కారణంగా పిల్లర్లు కుంగిపోయాయని చెబుతున్నారని, ఇంతకంటే చేతకానితనం ఉంటుందా అని ఆయన విమర్శలు చేశారు.

దీనిపై న్యాయ విచారణకు సీఎం సిద్ధంగా ఉన్నారా? అని ఆయన ప్రశ్నించారు. దీనిపై కేసు పెట్టాలంటే ముందు సీఎం కేసీఆర్‌పై పెట్టాలన్నారు. ఇంజినీర్ల అభ్యంతరాలు నిజమని తేలడంతో సీఎం నోరు మెదపడం లేదన్నారు. డ్యాం సేఫ్టీపై నిపుణులు ప్రాజెక్టును పరిశీలించి నివేదిక తయారు చేస్తున్నారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. వాళ్ళు డ్యాం డిజైన్లు అడుగుతుంటే, రాష్ట్ర ప్రభుత్వం సరైన సమాచారం ఇవ్వడం లేదని ధ్వజమెత్తారు.

కుంగిపోడానికి కారణం తెలుసుకుని, దానికి పరిష్కారం కోసం ఇంజినీర్లు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. డ్యామ్‌కి సంబంధించిన అన్ని అంశాలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపించాలని, ఈ విషయంలో కేసీఆర్ రాజీనామా చేయాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రాజెక్టులో మళ్ళీ నీళ్లు నింపగలమా అనే అనుమానాలు ఇంజినీరింగ్ నిపుణుల నుంచి వ్యక్తమవుతున్నాయని, కాళేశ్వరం ప్రాజెక్టు నిష్ప్రయోజనంగా మారే ప్రమాదం ఉందని తెలంగాణ ప్రజల్లో అనుమానాలున్నాయన్నారు.

Advertisement

Next Story

Most Viewed