మహిళా రెజ్లర్లకు న్యాయం చేయండి.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని

by Vinod kumar |
మహిళా రెజ్లర్లకు న్యాయం చేయండి.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని
X

దిశ, తెలంగాణ బ్యూరో: రెజ్లింగ్‌లో లైంగిక వేధింపుల నేపథ్యంలో ఢిల్లీలో నిరసన వ్యక్తం చేస్తున్న మహిళా రెజ్లర్లకు న్యాయం చేయాలని, వారి డిమాండ్లను నెరవేర్చాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ఎన్ఎఫ్ఐడబ్ల్యూ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో మంగళవారం మాఖ్దూం‌భవన్ లో నిర్వహించిన సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కూనంనేని మాట్లాడుతూ.. మహిళా రెజ్లర్లు నాలుగు నెలల నుంచి తమను లైంగిక వేధింపులకు గురిచేసిన, బ్రిజ్ భూషణ్ ను వెంటనే అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలని విన్నవించు కున్నప్పటికి.. ప్రభుత్వం నుంచి కనీస స్పందన వస్తుందని ఎదురుచూశారన్నారు. కానీ, ఎటువంటి చర్యలు నిందితులపై లేకపోగా, బాధితులకు భరోసా కూడా కల్పించలేదన్నారు. పైగా మహిళా మల్ల యోధులను బెదిరించడం, వేధించడం మొదలెట్టారని అన్నారు.

దీనితో విసిగిపోయిన రెజ్లర్లు తమకు న్యాయం చేయాలని కోరుతూ తిరిగి నిరసన ప్రారంభించారన్నారు. స్త్రీలను దేవతలుగా చూస్తామని చెప్పుకుంటున్న దేశంలో వారి పోరాటానికి కనీస స్పందన కరువయ్యిందన్నారు. పైగా, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ నిరసనకారులపై దాడులకు పాల్పడటం సిగ్గుచేటన్నారు. అక్కడ గూండాలు, పోలీసులు అభ్యంతరకరంగా ప్రవర్తిస్తూ, అవమానాలకు గురిచేస్తున్నారని అన్నారు. మహిళా రెజ్లర్లపై జరిగిన లైంగిక వేధింపులపై సుప్రీం కోర్టు జడ్జి చేత సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పోరాడుతున్న మహిళా మల్ల యోధులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎన్ఎఫ్ఐడబ్ల్యూ సీనియర్ నాయకురాలు పశ్య పద్మ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేదునూరి జ్యోతి, సహాయ కార్యదర్శి ఎం నళినీ, ఏ లతా దేవి, ఫైమిద, సుగుణమ్మ, జంగమ్మ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed