కేసీఆర్ పిటిషన్‌పై తీర్పు రిజర్వు.. విచారణ అర్హతపై క్లారిటీ ఇవ్వనున్న హైకోర్టు

by Shiva |
కేసీఆర్ పిటిషన్‌పై తీర్పు రిజర్వు.. విచారణ అర్హతపై క్లారిటీ ఇవ్వనున్న హైకోర్టు
X

దిశ, తెలంగాణ బ్యూరో: జస్టిస్ నర్సింహారెడ్డి నేతృత్వంలోని కమిషన్ ఏర్పాటును, అది జారీ చేసిన నోటీసులు సవాలు చేస్తూ కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్ విచారణ అర్హతపై తీర్పును హైకోర్టు రిజర్వు చేసింది. ఈ పిటిషన్‌కు ఉన్న విచారణ అర్హతపై కేసీఆర్ తరఫున వాదనలు గురువారం పూర్తికాగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు శుక్రవారం ముగిశాయి. ఇరు తరఫున వాదనలు కంప్లీట్ కావడంతో తీర్పును రిజర్వు చేస్తున్న చీఫ్ జస్టిస్ అలోక్ ఆరథే, జస్టిస్ జూలకంటి అనిల్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం ప్రకటించింది. తీర్పును ఎప్పుడు వెల్లడిస్తుందనేది ఉత్కంఠగా మారింది. కేసీఆర్ లేవనెత్తిన అంశాల లోతుల్లోకి వెళ్ళి విచారణ జరపడానికి ఈ పిటిషన్‌కు అర్హత ఉన్నదో లేదో హైకోర్టు తీర్పుతో స్పష్టం కానున్నది.

పదేండ్ల పాలనలో విద్యుత్ రంగంలో చోటుచేసుకున్న అవకతవకలపై ఎంక్వయిరీ చేసి నివేదిక ఇవ్వాల్సిందిగా జస్టిస్ నర్సింహారెడ్డి నేతృత్వంలో జ్యుడిషియల్ కమిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. చత్తీస్‌గడ్ నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందంతో పాటు యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల ఏర్పాటులో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను కమిషన్ స్టడీ చేస్తుంది. విద్యుత్ శాఖలోని పలువురు అధికారులకు, రిటైర్ అయిన ఆఫీసర్లకు నోటీసులను జారీచేసింది. అప్పటి ముఖ్యమంత్రిగా విధాన నిర్ణయం తీసుకున్న కేసీఆర్‌కు సైతం ఏప్రిల్‌లో నోటీసులు జారీచేసింది. ఆయన విజ్ఞప్తి మేరకు గడువును పొడిగించడానికి కమిషన్ అనుమతి ఇచ్చింది.

ఈ నెల 19న మరోసారి నోటీసు ఇచ్చిన కమిషన్... వ్యక్తిగతంగా జూన్ 27 లోగా హాజరు కావాలని స్పష్టం చేసింది. దీనిని సవాలు చేస్తూ కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ విద్యుత్ శాఖ సెక్రెటరీ జీవో ఇవ్వడం ఎలక్ట్రిసిటీ చట్టం ప్రకారం చెల్లదని, తనకు జారీ చేసిన నోటీసులను రద్దు చేయాలని ఆ పిటిషన్‌లో కోరారు. కేసీఆర్ తరఫున సీనియర్ అడ్వొకేట్ ఆదిత్య సోంధీ గురువారం వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి శుక్రవారం వాదిస్తూ... కమిషన్ జారీ చేసిన నోటీసులకు కేసీఆర్ కోరిక మేరకు గడువు లభించిందని, మీడియా సమావేశంలో పరిధికి మించి జస్టిస్ నర్సింహారెడ్డి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు.

చత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్లలో అనుమానాలుంటే కమిషన్‌ను ఏర్పాటు చేసుకోవచ్చంటూ బీఆర్ఎస్ పార్టీయే గత అసెంబ్లీ సమావేశంలో సూచించిందని కోర్టు దృష్టికి తెచ్చారు. ఇప్పటికే 15 మందిని కమిషన్ విచారించిందని, అందులో మాజీ సీఎండీ ప్రభాకర్ రావు కూడా ఉన్నారని తెలిపారు. విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి సమాచారం ఉన్నవారు వివరాలను ఇవ్వవచ్చంటూ కమిషన్‌ ఒక ప్రకటన కూడా ఇచ్చిందని, ప్రొఫెసర్ కోదండరాం, విద్యుత్ జేఏసీ నేత రఘుతో పాటు కొందరు డాక్యుమెంట్లు, వారిదగ్గర ఉన్న ఆధారాలను సమర్పించారని తెలిపారు. ఈ డాక్యుమెంట్లు, ప్రభుత్వ నిర్ణయాలపై వివరణ కోసమే కేసీఆర్‌కు జస్టిస్ నరసింహా రెడ్డి నోటీసు జారీ చేశారని పేర్కొన్నారు.

విద్యుత్ కొనుగోళ్లు, రెండు థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణాలపై కమిషన్ బహిరంగ విచారణ చేపట్టిందని, ఇందులో పక్షపాత ధోరణికి తావే లేదని క్లారిటీ ఇచ్చారు. విచారణకు పిలిచే అధికారం ఎలక్ట్రిసిటీ చట్టంలోని సెక్షన్ 8-బి ప్రకారం కిమషన్‌కు ఉంటుందని పేర్కొన్నారు. కేసీఆర్ పిటిషన్‌‌కు విచారణ అర్హత లేదని, దాన్ని స్వీకరించవద్దని కోర్టును కోరారు. పిటిషన్‌లో లేవనెత్తిన అంశాలపై అడ్వొకేట్ జనరల్ ప్రస్తావించే ప్రయత్నం చేయగా... పిటిషన్‌ను విచారణకు అనుమతించడంపైనే వాదనలు వినిపించాలని, అందులోని మెరిట్స్‌ లోకి వెళ్లవద్దని సీజే బెంచ్ సూచించింది. ఇరు పక్షాల తరఫున వాదనలు కంప్లీట్ అయినట్లు ప్రకటించిన సీజే బెంచ్... తీర్పును రిజర్వులో ఉంచుతున్నట్లు తెలిపారు.



Next Story