కేసీఆర్‌కు జగన్ ఫియర్.. అందుకే డైలామా!

by Sathputhe Rajesh |
కేసీఆర్‌కు జగన్ ఫియర్.. అందుకే డైలామా!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఏపీలో బీఆర్ఎస్ విస్తరణపై సీఎం కేసీఆర్ ఊగిసలాటలో ఉన్నట్టు తెలుస్తున్నది. అక్కడ పార్టీ యాక్టివిటీస్ స్టార్ట్ చేయడానికి జగన్ రూపంలో భయం వెంటాడుతుందనే చర్చ జరుగుతున్నది. అందుకే ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటించి మౌనంగా ఉన్నట్టు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ కేసీఆర్ ఏపీలో అడుగుపెడితే తెలంగాణలో జగన్ పొలిటికల్ ఎంట్రీకి ప్లాన్ చేసుకున్నట్టు సమాచారం. ఈ విషయం గ్రహించిన కేసీఆర్ ఏపీలో ఎలాంటి రాజకీయ కార్యక్రమాలు చేయకుండా మంత్రుల ద్వారా తన అక్కసును వెళ్లగక్కిస్తున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

విశాఖ మీటింగ్ లేనట్టేనా?

బీఆర్ఎస్ పార్టీని దక్షిణాదిన విస్తరించేందుకు కేసీఆర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అందుకోసం కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్‌పై ఫోకస్ పెట్టారు. అక్కడి లీడర్లను బీఆర్ఎస్‌లో చేర్చుకుంటున్నారు. మహారాష్ట్రలో రెండు పబ్లిక్ మీటింగ్‌లను నిర్వహించారు. కానీ పొరుగునే ఉన్న ఏపీలో మాత్రం అడుగుపెట్టేందుకు జంకుతున్నట్టు తెలుస్తున్నది. ఏపీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడుగా తోట చంద్రశేఖర్ రావును ప్రకటించిన తర్వాత అక్కడికి వెళ్లి సభలు నిర్వహించేందుకు ప్లాన్ చేసుకున్నారు. అందులో భాగంగా వైజాగ్ బహిరంగ సభకు రెడీ అయ్యారు. అయితే ఈ విషయం గ్రహించిన జగన్ కేసీఆర్‌కు కౌంటర్‌గా తన పార్టీ యాక్టివిటీస్‌ని తెలంగాణలో స్టార్ట్ చేస్తాననే సంకేతాలు పంపారని ప్రచారం జరుగుతున్నది. దీంతో బీఆర్ఎస్ వైజాగ్ మీటింగ్ ను వాయిదా వేసుకున్నట్టు తెలుస్తున్నది.

జగన్ ఎంట్రీ ఇస్తే..

కేసీఆర్‌ను గద్దే దించేందుకు విపక్షాలు రెడీగా ఉన్నాయి. ఇలాంటి సమయంలో జగన్ తెలంగాణలో ఎంట్రీ ఇస్తే బీఆర్ఎస్‌కు మరిన్ని కష్టాలు వచ్చే ప్రమాదముంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జగన్ పార్టీకి ఓటు బ్యాంక్ ఉన్నట్టు నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. 2014లో జరిగిన ఎన్నికల్లో ఒక ఎంపీ సీటు, మూడు అసెంబ్లీ సీట్లను గెలుచుకుంది. ఆ తర్వాత వారంత గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ ఓటు బ్యాంకు గులాబీ పార్టీకి షిప్ట్ అయింది. ఇప్పుడు మళ్లీ జగన్ తెలంగాణలో రాజకీయ కార్యక్రమాలు ప్రారంభిస్తే బీఆర్ఎస్ ఓటు బ్యాంకుకు నష్టం వాటిల్లే ప్రమాదముందనే అనుమానం బీఆర్ఎస్‌లో ఉంది.

పొంగులేటి ఎంకరేజ్‌పై గుస్సా

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏపీ సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితుడు. 2014లో పొంగులేటి వైసీపీ టికెట్ మీద గెలిచారు. ఆ తర్వాత ఆయన గులాబీ పార్టీలో జాయిన్ అయ్యారు. కానీ ఇరువురి మధ్య స్నేహం చెడిపోలేదు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో పొంగులేటికి కేసీఆర్ ఎంపీ సీటు ఇవ్వలేదు. అప్పటి నుంచి అవకాశాల కోసం ఎదురుచూసి విసిగి పోయిన పొంగులేటి, బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పారు. అయితే ఆ నిర్ణయం తీసుకోవడం వెనుక జగన్ ప్రోత్సాహం ఉందనే అనుమానం బీఆర్ఎస్ లీడర్లకు ఉంది. అందుకే జగన్ పాలనలో ఏపీలో ఏం అభివృద్ది జరగలేదని మంత్రి హరీశ్ ద్వారా కేసీఆర్ పదే పదే ప్రకటనలు ఇప్పిస్తున్నారనే ప్రచారం జరుగుతున్నది.

Advertisement

Next Story

Most Viewed