Lagcherla incident: గ‌వ‌ర్నర్‌‌కు తెలంగాణ ఉద్యోగుల జేఏసీ కీలక విజ్ఞప్తి

by Gantepaka Srikanth |
Lagcherla incident: గ‌వ‌ర్నర్‌‌కు తెలంగాణ ఉద్యోగుల జేఏసీ కీలక విజ్ఞప్తి
X

దిశ, తెలంగాణ బ్యూరో: వికారాబాద్ జిల్లా ల‌గ‌చ‌ర్ల(Lagcherla incident)లో ప్రభుత్వ అధికారుల‌పై రైతుల మాటున దాడి చేసిన దోషులు, దాడికి ప్రేరేపించిన కుట్రదారుల‌పై క‌ఠిన చ‌ర్యల‌కు ఆదేశించాల‌ని గ‌వ‌ర్నర్ జిష్ణుదేవ్ వ‌ర్మ(Governor Jishnu Dev Varma)ను తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ(Telangana Employees JAC) నేత‌లు కోరారు. జేఏసీ చైర్మన్ వి.ల‌చ్చిరెడ్డి నేతృత్వంలో మంగ‌ళ‌వారం జేఏసీ నేత‌లు రాజ్‌భ‌వ‌న్‌లో గ‌వ‌ర్నర్‌ను క‌లిసి వినతిప‌త్రం స‌మ‌ర్పించారు. ల‌గ‌చ‌ర్ల ఘ‌ట‌న‌కు సంబంధించిన పూర్తి వివరాలను గ‌వ‌ర్నర్‌కు వివ‌రించారు. రైతుల మాటున కొంద‌రు దుండ‌గులు అధికారుల‌పై దాడికి పాల్పడ‌టం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసింద‌ని గ‌వ‌ర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇలాంటి ఘ‌ట‌న‌ల‌పై చ‌ర్యలు తీసుకోక‌పోతే, రాష్ట్రంలోని ఇత‌ర ప్రాంతాల‌కూ విస్తరించే ప్రమాదం ఉంద‌నే ఆందోళ‌న ఉద్యోగుల్లో నెల‌కొంద‌ని పేర్కొన్నారు.

ఈ నేప‌థ్యంలో రైతుల మాటున అధికారుల‌పై దాడికి పాల్పడ్డ దుండ‌గుల‌పై, దాడికి ప్రేరేపించిన వ్యక్తుల‌పై క‌ఠిన చ‌ర్యలు తీసుకునేలా ఆదేశించాల‌ని గ‌వ‌ర్నర్‌ను కోరారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల భ‌ద్రత కోసం, వారు సుర‌క్షిత వాతావ‌ర‌ణంలో స్వేచ్ఛగా విధులు నిర్వర్తించే ప‌రిస్థితులు క‌ల్పించేలా సంబంధిత అధికార‌ వ‌ర్గాల‌కు ఆదేశాలు ఇవ్వాల‌ని విన్నవించారు. జేఏసీ నాయకులు విన్నవించిన ప్రతి అంశాన్ని సావధానంగా గవర్నర్ వినడంతో పాటు తదుపరి చర్యలకు సంబంధించిన అంశాలపై కూడా సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు డా. నిర్మల, జీఎస్ కుమారస్వామి, కె. రామకృష్ణ, ఎస్.రాములు, రమేష్ పాక, మేడి రమేష్, దర్శన్ గౌడ్, ఫూల్ సింగ్ చౌహాన్, మహిపాల్ రెడ్డి, అంజయ్య, రాబర్ట్ బ్రూస్ పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed