టార్గెట్ టీఆర్‌ఎస్.. కాళేశ్వరం కంపెనీలపై ఐటీ రైడ్స్

by Sathputhe Rajesh |
టార్గెట్ టీఆర్‌ఎస్.. కాళేశ్వరం కంపెనీలపై ఐటీ రైడ్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య రాజకీయ వైరం సరికొత్త మలుపు తిరుగుతున్నది. టీఆర్ఎస్‌ను ఇరుకున పెట్టడానికి బీజేపీ అన్ని అస్త్రాలనూ ప్రయోగిస్తున్నది. ఐటీ, సీబీఐ, ఈడీ లాంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను కీలుబొమ్మలుగా మార్చుకున్నదంటూ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహా పలువురు గులాబీ నేతలు ఆరోపించారు. కక్షపూరితంగా ప్రతిపక్ష పార్టీలపైకి ఉసిగొల్పుతున్నదని విమర్శించారు. దానికి బలం చేకూర్చే విధంగా కొంత కాలంగా రాష్ట్రంలోని పలు నిర్మాణ సంస్థలపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఒక కాంట్రాక్టు సంస్థగా ఉన్న కేఎన్ఆర్ ఇన్‌ఫ్రా కంపెనీలో ఐదు రోజులుగా సోదాలు జరుగుతున్నాయి. గతంలో సీ-5, మెగా ఇంజినీరింగ్ సంస్థపైనా దాడుల జరిగిన విషయం తెలిసిందే. త్వరలో మరికొన్ని సంస్థలపైనా ఐటీ దాడులకు అవకాశం ఉందనే ఊహాగానాలున్నాయి. కొన్నింటికి ఇప్పటికే నోటీసులు ఇచ్చినట్టు సమాచారం.

కాళేశ్వరం ఓ ఏటీఎం

కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ కుటుంబానికి భారీ స్థాయిలో కమీషన్లు ముట్టాయని, అది వారికి ఓ 'ఏటీఎం'లా మారిందని బీజేపీ గతంలో వ్యాఖ్యలు చేసింది. అవినీతికి పాల్పడిన ముఖ్యమంత్రి కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ పలుమార్లు బహిరంగంగానే వ్యాఖ్యానించారు. మాటలే తప్ప చేతలేవీ? అంటూ కాంగ్రెస్ సైతం బీజేపీని రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్‌లోని ఆయకార్ భవన్ తో సంబంధం లేకుండా ఢిల్లీ లాంటి ఇతర రాష్ట్రాలకు చెందిన అధికారులు కేఎన్ఆర్ ఇన్‌ఫ్రా సంస్థపై సోదాలు జరుపుతున్నారు. హైదరాబాద్, వరంగల్, విజయవాడ, ఢిల్లీ లాంటి మొత్తం పన్నెండు చోట్ల ఏక కాలంలో సోదాలు నిర్వహిస్తున్నట్టు ఐటీ వర్గాల సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన మరికొన్ని కాంట్రాక్టు కంపెనీలపైనా ఇలాంటి సోదాలు జరిగే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఐదు బృందాలు హైదరాబాద్‌కు చేరుకున్నాయని, గ్రౌండ్ వర్కు చేసుకుంటున్నాయని, ఏ సమయంలోనైనా దాడులు చేసే అవకాశం ఉందంటూ రాష్ట్ర ఇంటెలిజెన్స్ వర్గాలూ అనుమానిస్తున్నాయి. ఒకవైపు కేఎన్ఆర్ సంస్థపైటీ బృందాలు సోదాలు నిర్వహిస్తున్న సమయంలోనే సీఎం కేసీఆర్ తన ఎర్రవల్లి ఫామ్ హౌజ్‌లో మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించడం ఆసక్తికర చర్చకు దారితీసింది. వడ్ల కొనుగోళ్ల అంశం అంటూ ప్రభుత్వ వర్గాలు పైకి చెప్తున్నా అసలు కారణం వేరే ఉన్నదంటూ బీజేపీ నాయకులూ వ్యాఖ్యానిస్తున్నారు. దానికి వక్కాణింపుగా కేటీఆర్ అమెరికా పర్యటననూ జోడిస్తున్నారు. యూపీ ఎన్నికల తర్వాత ఇలాంటి సోదాలు పెరుగుతాయంటూ బీజేపీ నేతలు గతంలోనే వ్యాఖ్యానించారు. అవి నిజమయ్యే తీరులో ఇప్పుడు కార్యాచరణ కొనసాగుతుండటం గమనార్హం.

నిర్మాణ సంస్థలపై ఐటీ నిఘా

గత కొన్ని నెలలుగా తెలంగాణలోని నిర్మాణ సంస్థలపై ఐటీ శాఖ నిఘా పెట్టింది. పలుమార్లు సోదాలు కూడా నిర్వహించింది. ఇప్పటికీ ఆ డ్రైవ్ కొనసాగుతూనే ఉన్నది. ఇప్పటివరకు జరిగిన సోదాల్లో ఒక్కటి మినహా మిగిలిన కంపెనీలన్నీ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో వివిధ స్థాయిల్లో భాగస్వామ్యం ఉన్నవే. కాళేశ్వరం ప్రాజెక్టు అతి తక్కువ కాలంలోనే పూర్తయిందంటూ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్నది. అంచనా వ్యయాన్ని ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం పెంచేసిందంటూ రిటైర్డ్ ఇంజనీర్లు ఆరోపిస్తున్నారు. కమీషన్ల కోసమే డిజైన్‌ను మార్చేసిందంటూ కాంగ్రెస్ ఆరోపిస్తున్నది. ఏటీఎంలా మారిందంటూ బీజేపీ కామెంట్ చేసింది. వీటన్నింటి నేపథ్యంలో ఇప్పుడు ఐటీ అధికారులు సోదాలు చేస్తుండటం అనేక రకాల చర్చకు దారితీసింది. 'కేసీఆర్‌ను వదిలేదే లేదు' అంటూ బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణచుగ్ సైతం గతంలో హెచ్చరించారు. కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమంటూ బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ వ్యాఖ్యానిస్తే... టచ్ చేసే దమ్ముందా అంటూ టీఆర్ఎస్ కూడా ఘాటుగానే బదులిచ్చింది. ఐటీ సోదాలు నిర్మాణ సంస్థలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed