Thalasani Srinivas Yadav: అది కుల గణన సర్వే కాదు : మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

by Y. Venkata Narasimha Reddy |
Thalasani Srinivas Yadav: అది కుల గణన సర్వే కాదు : మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సర్వే కుల గణన(caste enumeration) సర్వే కాదని మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(Thalasani Srinivas Yadav) విమర్శించారు. బన్సీలాల్ పేటలో పర్యటించిన శ్రీనివాస్ యాదవ్ ఎన్యూమరేటర్లు సర్వే చేస్తున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కుల గణన సర్వేలో 75 ప్రశ్నలు ఎందుకని ప్రశ్నించారు. సర్వే పేరుతో కాలయాపన చేస్తూ ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందని విమర్శించారు. ప్రభుత్వం చేపట్టిన సర్వేను ప్రజలు వ్యతిరేకిస్తున్నారన్నారు. సర్వేలోని ఆస్తులు, ఉద్యోగాలు, ఆదాయాలు, ఆధార్, వాహనాలు, గతంలో ప్రభుత్వ పథకాలు, రుణాలు పోంది ఉన్నారా వంటి ప్రశ్నలు చూసి ఎక్కడా తమ సంక్షేమ పథకాలు కోత పడుతాయోనని, వ్యక్తిగత వివరాలు బహిర్గతమవుతాయన్న భయాలు ప్రజల్లో వినిపిస్తున్నాయన్నారు.

కుల గణనకు కేవలం కులం, కుటుంబ సభ్యుల వివరాలు, వయసు సేకరిస్తే సరిపోతుందన్నారు. అదిగాక సర్వే పూర్తికాకుండానే, బీసీ రిజర్వేషన్లను తేల్చకుండానే సర్పంచ్ ఎన్నికలపై ప్రకటన ఎలా చేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేసీఆర్ ఆధ్వర్యంలో గతంలో తెలంగాణ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వేను ఒక్కరోజే పూర్తి చేసిందన్నారు. రాహుల్ గాంధీని ఫోకస్ చేసేందుకే కుల గణనపై కాంగ్రెస్ హడావుడి చేస్తోందన్నారు. ప్రజల నుండి వచ్చే వ్యతిరేకతతో సర్వేకు వెళ్ళే ఎన్యుమరేటర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. అనవసరంగా వారి సమయం కూడా వృధా అవుతోందన్నారు. సర్వేను రెండు రోజుల్లో పూర్తి చేసే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలన్నారు.

Advertisement

Next Story