డీజీపీ అంజనీకుమార్ ఎటువైపు?

by Nagaya |   ( Updated:2023-01-20 03:02:25.0  )
డీజీపీ అంజనీకుమార్ ఎటువైపు?
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్ సహా మొత్తం 11 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఏ రాష్ట్ర కేడర్ అవుతారో హైకోర్టు స్పష్టం చేయనున్నది. రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యూష్ సిన్హా కమిటీ ఇచ్చిన రిపోర్టు ప్రకారం ఇటీవల ఏపీకి వెళ్ళిన సోమేశ్ కుమార్, తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ తదితర 11 మంది కేంద్ర సర్వీసు అధికారులు ఆంధ్రప్రదేశ్ కేడర్‌గా ఖరారైంది. కానీ ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ వీరంతా క్యాట్ (సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్)కు వెళ్ళి తెలంగాణలో పనిచేయడానికి ఉత్తర్వులు పొందారు. దీన్ని సవాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం (డీవోపీటీ) హైకోర్టును ఆశ్రయించింది. 2017 నుంచి పెండింగ్‌లో ఉన్న ఈ వ్యవహారం శుక్రవారం కొలిక్కి రానున్నది. ఇందులో సోమేశ్ కుమార్‌ను ఏపీ కేడర్‌గా ప్రకటించి, గతంలో క్యాట్ వెలువరించిన ఉత్తర్వులను కొట్టివేస్తూ ఆంధ్రప్రదేశ్‌కు బదిలీ చేసింది.

మిగిలిన పది మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల విషయంలో హైకోర్టు తన తీర్పును శుక్రవారం వెల్లడించనున్నది. ఇందులో ప్రస్తుతం తెలంగాణకు డీజీపీగా పనిచేస్తున్న అంజనీకుమార్ కూడా ఉన్నారు. ఒకవేళ ఆయనను ఆంధ్రప్రదేశ్‌కు బదిలీ చేస్తే తెలంగాణకు కొత్త డీజీపీగా మరొకరు రావాల్సి ఉంటుంది. హైకోర్టు శుక్రవారం వెల్లడించనున్న తీర్పులో తొమ్మిది మంది ఐఏఎస్ అధికారులుకాగా, ఇద్దరు ఐపీఎస్ అధికారులు. క్యాట్ ఉత్తర్వులపై ప్రస్తుతం తెలంగాణలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారుల్లో వాణీప్రసాద్, వాకాటి కరుణ, రోనాల్డ్ రోస్, మల్లెల ప్రశాంతి, కాటా ఆమ్రపాలి తదితరులు ఉన్నారు. ఐపీఎస్ అధికారుల్లో డీజీపీ అంజనీకుమార్, అభిలాష్ భిష్ట్ ఉన్నారు. తెలంగాణ కేడర్‌గా ప్రత్యూష్ సిన్హా కమిటీ పేర్కొన్నా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్న శంషేర్ సింగ్ రావత్, అనంతరాము, గుమ్మన సృజన, లోతేటి శివశంకర్ ఉన్నారు. వీరందరి కేడర్‌పై తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ నేతృత్వంలోని బెంచ్ శుక్రవారం తీర్పు ఇవ్వనున్నది.

Also Read...

Secunderabad డెక్కన్ మాల్ ప్రమాదంపై కేసు నమోదు

Advertisement

Next Story