RTC MD Sajjanar : పాపులారిటీ కోసం వెర్రి చేష్టలు అవసరమా! ఎక్స్‌లో సజ్జనార్ ఏపీ పోలీసులకు ట్యాగ్

by Ramesh N |
RTC MD Sajjanar : పాపులారిటీ కోసం వెర్రి చేష్టలు అవసరమా! ఎక్స్‌లో సజ్జనార్ ఏపీ పోలీసులకు ట్యాగ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: సోషల్ మీడియాలో పాపులారిటీ, లైకులు, వ్యూస్ కోసం చాలా మంది యువతీయువకులు రీల్స్ పిచ్చిలో పడిపోయారు. కొంత మంది రీల్స్ పేరుతో పిచ్చి చేష్టలు చేస్తూ ఎదుటివారికి ఇబ్బందిగా మారుతున్నారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో కూడా తెగ వైరల్ అవుతుంటాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు ఎదుటివారికి ఇబ్బందులు కలిగిస్తున్న వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటున్న కూడా ఇంకా రీల్స్ బ్యాచ్ వికృత చేష్టలు మాత్రం మారడం లేదు. తాజాగా ఓ వీడియో నెట్టంట వైరల్‌గా మారింది. రీల్స్‌లో భాగంగా ఓ యువకుడు రోడ్డుపై వచ్చే ఆర్టీసీ బస్సును ఆపి అక్కడి నుంచే పరిగెత్తే చాలెంజ్ చేశాడు. తను అనుకున్నట్లుగానే రోడ్డుపై ఏపీఎస్ ఆర్టీసీకి చెందిన పల్లె వెలుగు బస్సును తాను ఎక్కుతున్నట్లు డ్రైవరుగా చెయ్యి చూపించి ఆగమన్నాడు. బస్సు తన వద్దకు వచ్చి ఆగిన తర్వాత ఆ యువకుడు అక్కడి నుంచి పారిపోయాడు. దీనికి సంబంధించిన వీడియోను టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

అతన్ని అరెస్ట్ చేసి వీడియో పెట్టాలి : నెటిజన్స్ విజ్ఞప్తి

సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం ఇలాంటి వెర్రి చేష్టలు అవసరమా అంటూ సజ్జనార్ ప్రశ్నించారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి అసౌకర్యం కలుగుతుందనే సోయి లేకుండా కొందరు ఇలా వికృతానందం పొందుతున్నారని ఫైర్ అయ్యారు. లైక్‌లు, కామెంట్ల కోసం పిచ్చి పనులు మానుకోవాలని హెచ్చరించారు. బంగారు భవిష్యత్ వైపునకు బాటలు వేసి.. జీవితంలో ఉన్నతంగా ఎదగాలని సూచించారు. ఈ క్రమంలోనే ఏపీ పోలీసులకు సజ్జనార్ ఎక్స్‌లో ట్యాగ్ చేశారు. సజ్జనార్ ట్వీట్‌పై పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ‘మనకి కూడా లైక్స్ రీచ్ కావాలి సార్. కేసు కట్టాలి. వాణ్ణి లోపలేసి వీడియో పెట్టాలి’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ఇలాంటి సన్నాసులకు జైల్లో పెట్టాలని మరికొంత మంది నెటిజన్లు ఏపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘వీణ్ణి బొక్కలో వేసి కుమ్ముతూ ఆ వీడియో వీడి ఛానల్ లో అప్లోడ్ చేయండి. మిగతా అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు’ అని మరో నెటిజన్ స్పందించారు. వీడియోలో గుంటూరు జిల్లా వినుకొండ బస్సు అని, ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు చూడాలి ఏం చేస్తారో..? అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టారు.

Advertisement

Next Story