Telangana: ఆపరేషన్.. ఆపరేటర్స్.. ధరణిలో అక్రమాలు వారి వల్లే..!

by Indraja |
Telangana: ఆపరేషన్.. ఆపరేటర్స్.. ధరణిలో అక్రమాలు వారి వల్లే..!
X

దిశ,తెలంగాణ బ్యూరో: ధరణిలో జరిగిన అక్రమాలు అన్నీఇన్నీ కావు. వేలాది ఎకరాల భూములు అక్రమంగా చేతులు మారాయనే ఆరోపణలు ఉన్నాయి. ధరణిని అడ్డుపెట్టుకొని చాలా మంది కోట్లాది రూపాయలు సంపాదించారనే అపవాదు సైతం ఉంది. ఒక్కొక్కటిగా అక్రమాలు వెలుగులోకి వస్తుండటంతో రెవెన్యూ అధికారులు మాత్రం ఆపరేటర్ల మీద నెట్టేసి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ, ఆపరేటర్ల ఆపరేషన్ వెనుక రెవెన్యూ అధికారులే ‘కీ’ రోల్‌గా పోషించినట్లు తెలుస్తోంది.

తప్పుదోవ పట్టిస్తూ..

గత బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణిని అందుబాటులోకి తీసుకురాగా, అందుకోసం మండలాల వారీగా ఆపరేటర్లను నియమించింది. భూముల కచ్చితమైన లెక్కల కోసం అంటూ యాప్ తీసుకొచ్చినా.. గత మూడేళ్లలో 2.31 లక్షల ఎకరాలు మాయమైనట్లు అంచనా. వీటిలో అత్యధికంగా మాజీ, ప్రస్తుత ప్రజాప్రతినిధులు, వారి బినామీలే కాజేసినట్లుగా ఆరోపణలున్నాయి.

దానికంతటికీ ఆపరేటర్లే కారణమంటూ తహశీల్దార్లు చెబుతున్నారు. నిజానికి ధరణి ఆపరేటర్ల అవినీతి వెనకాల ‘కీ’ రోల్ పోషించింది తహశీల్దార్లు, కలెక్టర్లే అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ధరణిలో భూముల డేటా ఎంట్రీ చేయాలంటే కచ్చితంగా లాగిన్, థంబ్ అవసరం. చేర్పులు, మార్పులు చేయాలన్నా అధికారి ఉండాల్సిందే. తహశీల్దార్, కలెక్టర్ ప్రమేయం లేకుండా నేరుగా ధరణిని ఆపరేటర్ చేసే అవకాశం ఆపరేటర్లకు లేదు. ఈ మాత్రం తెలీకుండా అధికారులు ఆపరేటర్లపై నేరం మోపడం పలు అనుమానాలకు తావిస్తోంది.

ఆపరేటర్ల వెనుక అధికారులు..

నల్లగొండ జిల్లా గట్టుప్పల్ మండలం(ఏడాది క్రితం మర్రిగూడ మండలం) సోమరాజుగూడలో వేల ఎకరాల దందా నడిచింది. 2 వేల ఎకరాలు రెండు మార్లు అమ్మకం జరిగింది. ఇక్కడ రూ.వందల కోట్లు చేతులు మారాయి. ఎకరం రూ.10 లక్షలలోపే అంటూ రియల్ ఎస్టేట్ బ్రోకర్లు హైదరాబాద్ కంపెనీలను తీసుకొచ్చాయి.

నిజానికి ఇక్కడ ఎకరం రూ.50 లక్షలకు పైగా పలుకుతోంది. అయితే, ఈ డబుల్ సేల్ ల్యాండ్ మాత్రం అతి తక్కువ ధరకే లభిస్తుండటంతో తొందరపడి పలువురు కొనేశారు. గట్టుప్పల్ మండలం సోమరాజుగూడ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 150 నుంచి 200 వరకు గల భూములను గతంలోనే ఆకుల రాజయ్య అండ్ కోకి అమ్మేశారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో ఈసీని పరిశీలించినా ఈ విషయం తెలుస్తుంది.

కానీ, కొందరు బ్రోకర్లు ధరణి ఆపరేటర్ల సాయంతో పాస్‌బుక్స్‌ పొందారు. వాటిన మళ్లీ సేల్ చేసి రూ.కోట్లు కూడబెట్టుకున్నారు. ఈ తతంగంలో మర్రిగూడ, గట్టుప్పల్ తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, నల్లగొండ కలెక్టరేట్‌లో పనిచేస్తోన్న ధరణి ఆపరేటర్ కీలకంగా పనిచేశారు. అమ్మేసిన భూములకు తిరిగి కొత్త పాసు బుక్స్ ఇప్పించడంలో క్రియాశీలకంగా వ్యవహరించారని వారిపై ఆరోపణలు ఉన్నాయి.

అధికారుల సహకారం లేకుండా ఇంత పెద్ద పని ఎలా జరిగిందనేది మిలియన్ డాలర్ క్వశ్చన్‌గా మిగిలింది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పోకల్‌వాడలో 5 ఎకరాల ప్రభుత్వ భూమికి పట్టా ఇప్పించడంలో ధరణి ఆపరేటర్లు కీలక పాత్ర వహించారని పోలీసులకు ఫిర్యాదు అందింది.ఆ భూమిని పూస రవీందర్,పూస ప్రహ్లాద్ ఆక్రమించుకునేందుకు యత్నించారని గండిపేట తహశీల్దార్ శ్రీనివాస్ రెడ్డి సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ కేసులో ఐదుగురు అరెస్టు అయ్యారు.రూ.10 కోట్ల డీల్ మాట్లాడుకుని ఈ దందా నడిపించారన్నది ఆరోపణ.అలాగే, రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం గంధంగూడలో రూ.500 కోట్ల విలువైన 10 ఎకరాల ప్రభుత్వ భూమిని క్షణాల్లో మాయం చేశారు. ఆ తర్వాత ‘దిశ’లో కథనం రాగానే చక్కదిద్దే పనిలో నిమగ్నమయ్యారు. ఇక్కడ తహశీల్దార్, కలెక్టర్లు,సెక్షన్ ఆఫీసర్లకు తెలియకుండా ఎలా జరిగింది అనేది అంతుచిక్కని ప్రశ్న.

రంగారెడ్డి జిల్లా ఆదిబట్లలోనూ 72 ఎన్ఓసీ ఫైళ్లను తనకు తెలియకుండానే క్లియర్ చేసేందుకు యత్నించారంటూ ధరణి ఆపరేటర్లపై కలెక్టర్‌ భారతి హోలికేరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిజానికి పాస్‌వర్డ్ ఆపరేటర్‌కి ఎలా తెలిసింది? డిజిటల్ సైన్ లేకుండా ఈ ప్రక్రియ ఎలా ముందుకెళ్లింది? అసలు థంబ్ పెట్టకుండా చేంజెస్‌కి ఆస్కారం ఎక్కడిది? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతికితే ఏ అధికారి పాత్ర ఎంత అనేది తెలుస్తుందని రెవెన్యూ అధికారులే అంటున్నారు.

కేవలం ఆపరేటర్లు మాత్రమే దీని వెనుక ఉన్నారా? విషయం బయట పడిందని తప్పించుకునేందుకు ఆ నెపాన్ని తాత్కాలిక ఉద్యోగుల మీదికి నెట్టారా? అనేది తేలాల్సిన అంశం.

మేడ్చల్ జిల్లా ఘట్‌‌కేసర్, శామీర్‌పేట మండలాలు, యాదాద్రి జిల్లా బీబీనగర్, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్, శంకర్‌పల్లి మండలాల్లో ఏనాడో ప్లాట్లుగా మారిన భూములకు కూడా పాసు పుస్తకాలు జారీ చేశారు. ప్లాట్లను వ్యవసాయ భూములుగా పాసు పుస్తకాలు పొందిన వారిలో మాజీ మంత్రుల అనుచరులు, ఎమ్మెల్యేలు, వారి వారసులు ఉన్నారు.

ఏకంగా ఆ స్థలాల్లో ఫంక్షన్ హాళ్లు నిర్మించి సొమ్ము చేసుకుంటున్న ఉదంతాలు అనేకం ఉన్నాయి. వీటిలోనూ ధరణి ఆపరేటర్లు సూత్రధారులే. కానీ, వారిని నడిపించింది మాత్రం తహశీల్దార్లు, కలెక్టర్లే అన్నది నిర్వివాదం.

ఆపరేటర్లపైనా ఆరోపణలు..

ధరణి పుణ్యమా అని కొంతమంది ఆపరేటర్లు, రెవెన్యూ అధికారులు కోట్లకు పడగలెత్తినట్లు ఆరోపణలున్నాయి. కేవలం రూ.15,000 జీతం తీసుకునే ఆపరేటర్లు సైతం ప్రజల ఆస్తులు మింగేసినట్లు టాక్. జీహెచ్ఎంసీ, అర్బన్, సెమీ అర్బన్ పట్టణ ప్రాంతాల్లో రూ.కోట్ల విలువైన పట్టా భూముల లావాదేవీల్లో ఆపరేటర్లే కీలక పాత్ర పోషించి.. రూ.కోట్లు సంపాదించారని ప్రచారం జరుగుతున్నది.

కొన్నిసార్లు తహశీల్దార్లు, కలెక్టర్లను కొందరు ఆపరేటర్లు బురిడీ కొట్టించినట్లు తెలుస్తోంది. నిషేధిత జాబితాలో ఉన్నా.. కొన్నిసార్లు స్లాట్ బుక్ అవడంతో అందిన కాడికి దండుకున్నారని సమాచారం. స్లాట్ బుక్ కాగానే ధరణిలో అర్జీదారుల వివరాలు తెలుసుకుని కొందరికి నేరుగా ఫోన్ చేసి డబ్బుల కోసం డిమాండ్ చేసినట్లు సమాచారం. వ్యవసాయ భూములు గుంటల్లో రిజిస్ట్రేషన్ చేయడానికి కుదరదని చెప్పి, కొర్రీలు వేసి వసూలు చేసినట్లు తెలిసింది.

గతంలో వరంగల్ జిల్లాలో పనిచేసిన ఓ ఆపరేటర్ రూ.కోట్లు వసూలు చేసి కార్లు, బుల్లెట్ బండి కొన్నట్లు ఆరోపణలొచ్చాయి. దాంతో ఆయన్ను మరో మండలానికి బదిలీ చేశారు. ధరణిలో ఉన్న లొసుగులు ఆధారంగా ఒక్కో చోట ఒక్కో విధంగా రేట్లు ఫిక్స్ చేసి మరీ వసూలు చేసినట్లుగా వినికిడి. వీరి దందా ఇలా ఉంటే.. కలెక్టరేట్ కార్యాలయాల్లో పనిచేసే ధరణి కో ఆర్డినేటర్లది మరో రకమైన దందా నడిచింది.

ధరణి గ్రీవెన్సుల పేరుతో వారు కూడా కోట్లాది రూపాయలు తీసుకున్నట్లు సమాచారం.వరంగల్ జిల్లాలో ఓ కో- ఆర్డినేటర్ మీద ఆరోపణలు రావడంతో ఏకంగా ఉద్యోగం నుంచే తొలగించారు.అసలు ధరణి పోర్టల్ నిర్వహణకు ప్రైవేటు ఏజెన్సీ తరఫున ఏజెంట్లను నియమించడం ఏంటి? వాళ్లకి ఉన్న అర్హతలు ఏంటి? అనే ప్రశ్నలు సైతం వస్తున్నాయి.

Advertisement

Next Story