సీతారాం ఏచూరి సంస్మరణ సభ.. సీఎం రేవంత్, కేటీఆర్‌కు ఆహ్వానం

by Gantepaka Srikanth |
సీతారాం ఏచూరి సంస్మరణ సభ.. సీఎం రేవంత్, కేటీఆర్‌కు ఆహ్వానం
X

దిశ, తెలంగాణ బ్యూరో: సీపీఐఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఈనెల 12న అనారోగ్యంతో కన్నుమూయడంతో ఆయన సంస్మరణార్థం ఆ పార్టీ రాష్ట్ర యూనిట్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ నెల 21 ప్రత్యేక ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నది. అన్ని పార్టీల ప్రతినిధులకూ సీపీఎం స్టేట్ సెక్రెటరీ తమ్మినేని వీరభద్రం ఆహ్వానం పంపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పీసీసీ చీఫ్ మహేశ్‌ కుమార్ గౌడ్, సీపీఐ స్టేట్ సెక్రెటరీ కూనంనేని సాంబశివరావు, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, పలు వామపక్ష పార్టీల రాష్ట్ర నాయకులనూ ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నారు. సీఎం రేవంత్, కేటీఆర్ మధ్య ఇటీవలి కాలంలో మాటల తూటాలు పేలుతున్న సమయంలో సీతారాం ఏచూరి సంస్మరణ కార్యక్రమంలో ఒకే వేదిక మీద కనిపిస్తుండడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరిలో ఒకరు వెళ్ళిపోయిన తర్వాత మరొకరు వస్తారా?... లేక వీరిద్దరినీ కలిపే వేదికగా సీతారాం ఏచూరి సంస్మరణ సభ ఉంటుందా అనే ఉత్కంఠ నెలకొన్నది.

ఈ కార్యక్రమం సీతారాం ఏచూరి సంస్మరణ కోసం జరుగుతున్నందున కేవలం ఆ అంశానికి మాత్రమే పరిమితమయ్యేలా తమ్మినేని వీరభద్రం చొరవ తీసుకుంటారా?... పొలిటికల్ విమర్శలకు తావు లేకుండా జాగ్రత్త పడతారా?... లేక మళ్ళీ వీరిద్దరి మధ్య మాటల తూటాలు పేలుతాయా?... అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. రాజకీయ విమర్శలు చేసుకోడానికి ఇది వేదిక కానందున ఒకే చోట కనిపించే సీఎం రేవంత్, కేటీఆర్ హుందాతనంతో ఎలా వ్యవహరిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

Advertisement

Next Story

Most Viewed