CM Revanth: గొప్ప మార్పు జరగాలంటే.. సాహసం చేసి తీరాలి

by Gantepaka Srikanth |
CM Revanth: గొప్ప మార్పు జరగాలంటే.. సాహసం చేసి తీరాలి
X

దిశ, వెబ్‌డెస్క్: గొప్ప మార్పు జరగాలంటే.. ఉక్కు సంకల్పంతో కూడిన సాహసం చేసి తీరాలని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అభిప్రాయపడ్డారు. ఈ మేరకు సోషల్ మీడియా(ఎక్స్) వేదికగా పోస్టు పెట్టారు. ‘‘గొప్ప మార్పు జరగాలంటే ఉక్కు సంకల్పంతో కూడిన సాహసం చేయాలి. దశాబ్దాలుగా మూసీ గర్భంలో జీవచ్ఛవాలుగా బతుకుతున్న పేదల బతుకులు మార్చే సంకల్పం నాది. మూసీ సాగునీరుగా పారి విషమే పంటలుగా మారి నల్గొండ ప్రజల ఆరోగ్యాన్ని కబళిస్తున్న గరళ కూపాన్ని ప్రక్షాళన చేయాలన్న పట్టుదల నాది. హైదరాబాద్ చారిత్రక వైభవానికి ఆనవాలుగా మిగిలిన మూసీని పునరుజ్జీవం పోసే లక్ష్యం నాది. విశ్వ నగరంగా ఎదుగుతోన్న మన హైదరాబాద్ నగర ఆర్థిక, పర్యాటక, వాణిజ్య రంగాల ఆయువు పట్టుగా మూసీని మార్చే బాధ్యత నాది. ఎన్ని దుష్టశక్తులు అడ్డు వచ్చినా ఈ సంకల్పం చెరిగిపోదు.. ఈ లక్ష్యం చెదిరిపోదు’ అని ట్వీట్‌లో సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

అంతకుమందు మూసీ ప్రక్షాళనపై సీఎం రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తెలంగాణ ప్రజల భవిష్యత్‌ను, రాష్ట్ర, దేశ ఆర్థిక వ్యవస్థను నిర్దేశించే కార్యాచరణ ప్రభుత్వం తీసుకుంది. 33 బృందాలు మూసీ పరివాహక ప్రాంతంలో పేదల సమస్యలను తెలుసుకున్నాయి. దుర్గంధంలో దుర్భర జీవితాలను గడుపుతున్న పేదల కష్టాలను తెలుసుకున్నాం. ప్రపంచంతో పోటీ పడే నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతాం. ఉపాధి కల్పనతో అక్కడి పేదలను ఆదుకోవాలనే ఆలోచన మా ప్రభుత్వానికి ఉంది. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఎడ్యుకేషన్, ఇరిగేషన్ రెవల్యూషన్ తీసుకొచ్చారు. కాంగ్రెస్ విజన్ వల్లే దేశానికి ప్రపంచంతో పోటీ పడే శక్తి లభించింది. దేశంలో సాంకేతిక విప్లవం తీసుకొచ్చిన ఘనత రాజీవ్ గాంధీది. పెట్టుబడుల సరళీకరణ విధానం తీసుకొచ్చింది పీవీ నరసింహారావు. ఆనాడు నెహ్రూ, రాజీవ్, పీవీ ప్రవేశపెట్టిన పాలసీలను కొందరు వ్యతిరేకించారు. కానీ ఆ పాలసీలే దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాయని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed