ఇన్‌చార్జి మార్పు.. BRSతో Congress పొత్తు?

by GSrikanth |   ( Updated:2023-01-05 06:50:29.0  )
ఇన్‌చార్జి మార్పు.. BRSతో Congress  పొత్తు?
X

దిశ, డైనమిక్ బ్యూరో: టీకాంగ్రెస్‌లో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. ఇన్నాళ్లు పార్టీ వ్యవహారాల ఇన్ చార్జిగా ఉన్న మాణిక్కం ఠాగూర్‌ను అధిష్టానం తప్పించడం, ఆ వెంటనే కొత్త ఇన్‌చార్జి పేరు ప్రకటించడం హాట్ టాపిక్ అయింది. సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీలో ఇంత వేగంగా పరిణామాలు చోటు చేసుకోవడం ఇటు పార్టీతో పాటు ప్రత్యర్థి పార్టీల్లోనూ ఆసక్తిని రేపింది. అయితే కొత్త ఇన్ చార్జిగా మానిక్ రావు ఠాక్రే రాకతో తెలంగాణ కాంగ్రెస్‌లో ఎలాంటి మార్పులో చోటు చేసుకోబోతున్నాయనేదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారిది. ముఖ్యంగా పొత్తుల విషయంలో ఏదైనా కీలక పరిణామాలు ఉండబోతున్నాయా? రాజకీయ వర్గాల్లో ఈ అంశంపైనే జోరుగా చర్చ జరుగుతోంది. మాజీ ఇన్ చార్జి ఠాగూర్ విషయంలో సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే మాణిక్కంపై అసంతృప్తికి గల కారణాల్లో పొత్తు అంశం కూడా ఒకటనే టాక్ వినిపిస్తోంది.

అధికార బీఆర్ఎస్‌తో కాంగ్రెస్ పొత్తుకు కొంతమంది సీనియర్లు ప్రతిపాదిస్తుండగా దీనికి రేవంత్ రెడ్డి వర్గంతో పాటు మాణిక్కం ఠాగూర్ వ్యతిరేకించినట్టు ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్‌తో పొత్తు కుదుర్చుకుంటే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పరిస్థితి కాస్త మెరుగు పడటంతో పాటు కొంత వరకు ఫండింగ్ కూడా సమకూరుతుందని సీనియర్లు వాదించారని అయితే దీనికి మాణిక్కం, రేవంత్ వర్గం అంగీకరించలేదనే ప్రచారం పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతోంది. అయితే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని వరంగల్ సభలో రాహుల్ గాంధీ క్లారిటీ ఇచ్చారు. ఇయినా కొంత మంది సీనియర్లు మాత్రం అధికార పార్టీతో పొత్తు కుదుర్చుకుంటేనే ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ మనుగడ సాధ్యం అవుతుందని వాదిస్తూ వచ్చారని, ఈ వ్యవహారంతోనే సీనియర్లకు, మాణిక్కం ఠాగూర్, రేవంత్ రెడ్డి వర్గాల మధ్య మరింత గ్యాప్ వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఏఐసీసీ నూతన అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే ఎన్నికయ్యారు. ఈ క్రమంలో టీ కాంగ్రెస్ లో సీనియర్ల అసమ్మతి భగ్గుమనడంతో దిగ్విజయ్ సింగ్ ఎంటర్ అయ్యారు. ఈ క్రమంలో దిగ్విజయ్ సింగ్ ఇచ్చిన నివేదికతో మాణిక్కం ఠాగూర్ తప్పుకోవడం ఆ మేరకు అధిష్టానం గంటల వ్యవధిలోనే కొత్త ఇన్ చార్జ్ ను అనౌన్స్ చేయడం చక చక జరిగిపోయాయి. జరుగుతున్న ప్రచారం ప్రకారం మాణిక్కం ఠాగూర్ పై సీనియర్ల అసంతృప్తికి గల కారణాల్లో ఒకటి పొత్తుల అంశమే అని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో మరి కొత్త ఇన్ చార్జ్ ఈ విషయంలో ఎలాంటి ఆలోచన చేయబోతున్నారనేది కీలకంగా మారింది. ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల వాతావరణం సందడి చేస్తోంది. బీజేపీ దూకుడు పెంచుతోంది. కారు పార్టీ స్పీడుకు బ్రేకులు వేయాలని తహతహలాడుతోంది. ఈ క్రమంలో ఒక వేళ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ తో చేతులు కలిపితే ఆ ప్రయోగం గులాబీ పార్టీకి ప్రయోజనకరంగా ఉంటుందేమో కాని కాంగ్రెస్ కు ఎలా కలిసి రానుందనేది ఆసక్తికర అంశం. అయితే మొదటి నుంచి ఉప్పు నిప్పుగా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ తో పొత్తు అంటే అంగీకారం తెలుపుతాడా అనేది కీలకాంశం. మొత్తంగా సీనియర్ల అసమ్మతితో రచ్చ రంబోలగా మారిన కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరు కొత్త ఇన్ చార్జ్ ఎలా హ్యాండిల్ చేస్తారనేది హాట్ టాపిక్ గా మారింది.

ఇది కూడా చదవండి : ఆంక్షలపై వాళ్లిద్దరూ సేమ్ టు సేమ్!

Advertisement

Next Story

Most Viewed