తెలంగాణ బీజేపీలో స్టేట్ చీఫ్ ఎంపికపై తీవ్ర ఉత్కంఠ

by Gantepaka Srikanth |
తెలంగాణ బీజేపీలో స్టేట్ చీఫ్ ఎంపికపై తీవ్ర ఉత్కంఠ
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ బీజేపీలో స్టేట్ చీఫ్ ఎంపికపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది. కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు ఎవరికిస్తారా? ఎప్పుడెప్పుడు నియమిస్తారా? అని ఆశావహులు, శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాషాయ దళపతి పీఠం కోసం పాత నేతలతో పాటు కొత్త నేతలు సైతం రేసులో ఉన్నారు. అయితే, ఇక్కడే అధిష్ఠానం ఓ మెలిక పెట్టింది. పార్టీలో రెండుసార్లు క్రియాశీల సభ్యత్వం ఉన్నవారికే పగ్గాలు అప్పగించాలని జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. జిల్లా అధ్యక్ష పదవి మొదలు స్టేట్ చీఫ్‌కు కూడా ఇదే నిబంధనను తీసుకొచ్చింది. ఈ నిబంధనలను ఒక్క తెలంగాణకే కాకుండా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల చీఫ్ ల ఎంపికను దీని ఆధారంగానే చేయనున్నట్టు తెలుస్తోంది.

కొత్త నేతల పట్టు..

తెలంగాణ బీజేపీ అధ్యక్ష రేసులో పలువురు కీలక నేతలు ఉన్నారు. ఎవరికి వారు పీఠం తమదేనని ఎవరికి వారుగా ధీమాతో ఉన్నారు. కానీ ఈ నిబంధనల నుంచి మినహాయింపు ఇవ్వాల్సిందేనని కొత్త నేతలు పట్టు పడుతున్నట్టు సమాచారం. పాత నేతలు మాత్రం ఇదే విధానాన్ని అమలుచేయాలని నొక్కి చెబుతున్నారు. సంస్థాగత ఎన్నికల ప్రక్రియను కమలదళం ముమ్మరంగా చేపడుతోంది. అందులో భాగంగా ఒకట్రెండు రోజుల్లో మండల కమిటీల ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని చూస్తోంది. ఇప్పటికే అభిప్రాయాల సేకరణ పూర్తయినట్టు సమాచారం. ముగ్గురి పేర్లను పార్టీకి అందించినట్టు తెలుస్తోంది. ఈ నెల 6 నుంచి జిల్లా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ ప్రారంభంకానుందని సమాచారం. సంక్రాంతి వరకు ఈ ప్రక్రియను పూర్తిచేయాలని పార్టీ యోచిస్తోంది. సంక్రాంతి తర్వాత రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికల ప్రక్రియను ప్రారంభించి నెలాఖరులో పూర్తి చేయాలని పార్టీ భావిస్తోంది.

సునీల్ బన్సల్ పర్యటన

రాష్ట్రంలో ఆది, సోమవారాలు రెండ్రోజుల పాటు పార్టీ స్టేట్ ఇన్ చార్జి సునీల్ బన్సల్ పర్యటించడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. జిల్లా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అంశాలపై నాయకులకు ఆయన దిశానిర్దేశం చేసే అవకాశముంది. సునీల్ బన్సల్ తో పలువురు కొత్త నేతలు భేటీ అయి కొత్త నిబంధనల వల్ల ఎదురయ్యే ఇబ్బందులను గురించి చర్చించే చాన్స్ ఉందని సమాచారం. కొత్త రూల్స్ వల్ల పార్టీకి నష్టమని, ఈ నిబంధనల కారణంగా కొత్త వారు పార్టీలోకి వచ్చే అవకాశాలు తగ్గుతాయని బన్సల్ దృష్టికి తీసుకెళ్లే అవకాశముందని విశ్వసనీయ సమాచారం. మండల అధ్యక్షుడి నుంచి మొదలు స్టేట్ ప్రెసిడెంట్ పోస్టు వరకు క్రియాశీల సభ్యత్వం మస్ట్ అని నిబంధనను పార్టీ పెట్టడంతో పాత నేతలు సంతోషంగానే ఉన్నా కొత్త నేతల పరిస్థితి అగమ్యగోచరంగా మారినట్టు వినికిడి. గతంలోనే రెండుసార్లు క్రియాశీల సభ్యత్వం తీసుకున్న వారికే అర్హత ఉంటుందా ? లేక ఇప్పుడు తీసుకోబోయే క్రియాశీల సభ్యత్వంతో రెండుసార్లు ఉంటే చాలా? అనే అంశంపై నేతల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై సునీల్ బన్సల్ క్లారిటీ ఇవ్వనున్నారని తెలుస్తోంది. మరి కొత్త నిబంధనలతో ఎదురయ్యే చిక్కులను పార్టీ ఎలా అధిగమిస్తుందనేది చూడాలి. ఎవరికి అధ్యక్ష పీఠాన్ని కట్టబెడుతుందో చూడాలి.

Advertisement

Next Story

Most Viewed