ఇష్టారీతిన లే అవుట్లు.. నిర్మాణాలు

by Y.Nagarani |
ఇష్టారీతిన లే అవుట్లు.. నిర్మాణాలు
X

దిశ, రంగారెడ్డి బ్యూరో: ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా క్షేత్రస్ధాయిలో విధులు నిర్వర్తించినప్పుడే అటు ప్రజలకు, ఇటు ప్రభుత్వాలకు సమాధానం చెప్పే అవకాశం ఉంటుంది. కానీ గ్రామ పంచాయతీ పరిధిలో ఆ విధులను సక్రమంగా నిర్వర్తించడంలో కొంతమంది కార్యదర్శులు, డీఎల్పీవోలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రంగారెడ్డి, వికారాబాద్​ జిల్లాలోని పలు గ్రామ పంచాయతీల్లో కార్యదర్శులు చేసిందే పని. చెప్పేది వ్యవహారం అన్నట్లు సాగుతున్నది. మొన్నటి వరకు గ్రామ సర్పంచుల కనుసన్నల్లో పనిచేసిన కార్యదర్శులు.. అదే అలవాటుగా ఇంకా కొనసాగిస్తుండడం విడ్డూరంగా ఉంది. కొంత మంది సర్పంచ్​లు పరిపాలనలో తమదైన ముద్ర వేసుకోనున్నారు. ప్రభుత్వం సూచించిన అభివృద్ధి కార్యక్రమాల్లో పూర్తిస్ధాయిలో భాగస్వాములై ఇప్పటికీ బిల్లులు రాక ఇబ్బంది పడుతున్న సర్పంచులున్నారు. మరికొంత మంది సర్పంచులులు అభివృద్ధి పనులను పక్కకు పెట్టి కేవలం ధనార్జనే లక్ష్యంగా పనిచేసి అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించి కార్యదర్శులను తప్పుడు మార్గాలకు ఆలవాటు చేశారు. దీంతో జిల్లాలోని పలు గ్రామ పంచాయతీల పరిధిలో ఇష్టానుసారంగా అక్రమ లేవుట్లు, అక్రమ నిర్మాణాలు జోరుగా కొనసాగుతున్నాయి.

ఏ నిబంధనలకు లోబడి నిర్మాణాలు..

ఓ గ్రామ పంచాయతీ పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా అనుమతి తప్పనిసరి. 100 నుంచి 150 గజాల స్థలంలో గ్రౌండ్​ ఫ్లోర్ నిర్మాణం చేస్తే పెద్దగా తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కానీ కొన్ని గ్రామ పంచాయతీ పరిధిలో ఇదే 100, 150 గజాల స్థలంలో ఐదు అంతస్థులు, వ్యవసాయ భూమిని ఫాంహౌస్‌గా చిత్రీకరించి రోడ్లు, భవనాలు నిర్మించడం ఏ నిబంధనలకు లోబడి ఉంటుందనేది ప్రశ్న. ఇలాంటి అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవడంలో స్థానిక పంచాయతీ కార్యదర్శి, ఎంపీవో, డీఎల్పీలో జంకుతున్నారు. వివరాలతో సహా ఫిర్యాదు చేసినా విచారణ చేపట్టి చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా డీపీవో క్షేత్రస్థాయిలోని అధికారులను వివరణ అడిగితే తప్పుడు సమాచారంతో మౌనం వహిస్తున్నారు. గత ప్రభుత్వంలో ఏ విధంగానైతే పంచాయతీ కార్యదర్శులు వ్యవహరిస్తున్నారో అదే ధోరణితో కొంత మంది వ్యవహరిస్తున్నట్లు స్పష్టమవుతున్నది. ఏ పార్టీ అధికారముంటే ఆ పార్టీలో చేరి తమ అధిపత్యాన్ని మాజీ సర్పంచులు కొనసాగిస్తున్నారు. ఇప్పటికీ మహేశ్వరం, యాచారం, ఇబ్రహీంపట్నం, శంకర్ పల్లి, చేవెళ్ల, షాద్​నగర్​మండలాల్లోని గ్రామ పంచాయతీల్లో ఇదే తంతు నడుస్తున్నది.

ఇవే కొన్ని ఉదాహరణలు..?

ఏడాది కాలం నుంచి రంగారెడ్డి, వికారాబాద్​ జిల్లాలో జరిగే అక్రమ లేవుట్లపై వివరాలతో సహా దిశ ప్రత్యేక కథనాలు ఇచ్చింది. అయినప్పటికీ సంబంధిత అధికారులు అక్రమ లేవుట్​ దారులతో కుమ్మక్కై చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల కాలంలో అనేక అక్రమాలపై విచారణ చేయాలని రంగారెడ్డి జిల్లా అధికారికి ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం. అదేవిధంగా వికారాబాద్​ జిల్లా అధికారికి ఓ లేవుట్ ​పై ఫిర్యాదు చేస్తే కేవలం నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. జిల్లా స్థాయి అధికారులు కేవలం తూతూమంత్రంగానే స్పందించడంతో క్షేత్రస్ధాయిలోని అధికారులు ఏ తప్పు చేసినా చర్యలుండవన్న ధీమాతో ఉన్నట్లు తెలుస్తుంది.

–కొందుర్గ్​ మండలం చెరుకుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో స్వర్గసీమ సుకేతన లేవుట్అనుమతి పరిమితం. నిర్మాణం అధికం. పంచాయతీ కార్యదర్శి, ఎంపీవోలిద్దరూ కుమ్మక్కై ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు.

– కొందుర్గ్​ మండలం టేకులపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని 26 ఎకరాల వ్యవసాయ భూమిలో భారీ ప్రహరీ, 30 ఫీట్ల రోడ్లు చేసి గజాల్లో ధర నిర్ణయించి.. వ్యవసాయ భూమిగా విక్రయిస్తున్నారు.

– షాబాద్​ మండలం ఐతాబాద్, నాగర్ గూడ, చందన్​వెల్లి, షాబాద్​ పంచాయతీ పరిధిలో నాలుగు, ఐదు అంతస్ధుల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టారు.

– మహేశ్వరం మండలం తుమ్మలూర్, మహేశ్వరం, మన్​సన్​పల్లి పంచాయతీల పరిధిలో అక్రమ నిర్మాణాలతో పాటు అక్రమ లేవుట్లు చేపట్టి రోడ్లు నిర్మించారు.

– వికారాబాద్​ జిల్లా నవాబ్​పేట్ మండలం పుల్​మామిడి గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్​41,42, 43,44, 45లో ఎలాంటి అనుమతులు లేకుండా ముఖద్వారం నిర్మాణం, రోడ్లు, ప్లాటింగ్ వేశారు. దిశలో వచ్చిన కథనాలకు అధికారులు నోటీసులిచ్చారు. కానీ చర్యలు తీసుకునేందుకు జాప్యం చేస్తున్నారు.

– వికారాబాద్​ జిల్లా యాలాల మండలం అగ్గనూర్​ గ్రామ పంచాయతీ పరిధిలో 52 ఎకరాల్లో శ్రీ అనురాగ్​ ఇన్ఫ్రా ప్రాజెక్టు వెంచర్ అక్రమ పద్ధతిలో నిర్మించారు. అయినప్పటికీ అధికారులు చర్యలు తీసుకోవడానికి జంకుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed