వెన్నుపోటు కాంగ్రెస్‌ను నమ్మితే అది గ్యారంటీ.. : మంత్రి హరీష్ రావు

by Rajesh |
వెన్నుపోటు కాంగ్రెస్‌ను నమ్మితే అది గ్యారంటీ.. : మంత్రి హరీష్ రావు
X

దిశ, డైనమిక్ బ్యూరో: గెలిచే వరకు ఒక్క ఛాన్స్ ప్లీజ్, గెలిచాక ఎక్స్ క్యూజ్ మీ అనడమే కాంగ్రెస్ పార్టీ ధోరణి అని, అలాంటి ఢిల్లీ నేతల హామీలు నమ్మితే తెలంగాణ మోసపోవడం ఖాయం అని మంత్రి హరీష్ రావు అన్నారు. ఆరు నెలల క్రితం కర్నాటక ప్రజలకు సైతం ఈ కాంగ్రెస్ పార్టీ ఐదు గ్యారెంటీల పేరుతో అరచేతిలో వైకుంఠం చూపిందని తీరా అధికారంలోకి వచ్చాక ప్రజలను కాటేస్తోందని దుయ్యబట్టారు.

శుక్రవారం తెలంగాణ భవన్ లో కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళా నేత కత్తి కార్తిక మంత్రి హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్ రావు.. కర్నాటకలోని కాంగ్రెస్ పాలనలో అన్ని వ్యవస్థలు కుప్పకూలాయని ధ్వజమెత్తారు. ఆ రాష్ట్రం పూర్తిగా దివాలా తీసిందని అక్కడ పరిపాలన పడకేసింది, అభివృద్ధి ఆగిపోయింది, సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ సమాధి కట్టిందని ఆరోపించారు. ఆరు నెలల క్రితం చేసిన తప్పుకు కర్నాటక ప్రజలు అనుక్షణం బాధపడుతున్నారు. ఈ బాధ తెలంగాణ ప్రజలకు రాకూడదనేది మా ప్రయత్నం అన్నారు.

రాహుల్ గాంధీ యువతను రెచ్చగొట్టారు..

కర్నాటక మోడల్‌ను తెలంగాణలో అమలు చేస్తామని వస్తున్న వారిని ప్రజలు నమ్మకూడదని కర్నాటకలో ఖజానా ఖాళీ అయి పలు సంక్షేమ పథకాలకు కోత పెట్టారని ఆరోపించారు. కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలకు రైతులు, ఎస్సీ, ఎస్టీ, బీసీలే ప్రధాన ప్రధాన బాధితులన్నారు. కర్నాటకలో జాబ్ క్యాలెండర్ పేరుతో యువతను రెచ్చగొట్టిన రాహుల్ గాంధీ అధికారంలోకి వచ్చాక ఆ రాష్ట్రానికి వెళ్లడం లేదని ధ్వజమెత్తారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 6 నెలలు గడిచిన ఒక్క జాబ్ నోటిఫికేషన్ ఇవ్వలేదని వెన్నుపోటు పొడిచే కాంగ్రెస్ తెలంగాణకు అవసరమా అని ప్రశ్నించారు.

నేను రైతును అని గర్వంగా చెప్పుకునే స్థితికి తెలంగాణను కేసీఆర్ తీసుకువస్తే కర్నాటకలో ఆరు నెలల కాంగ్రెస్ పాలనలో 350 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. కర్నాటక ప్రజల పరిస్థితి మబ్బులను చూసి కుండల్లో ఉన్న నీళ్లను వొలకబోసిట్లుగా మారిందన్నారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే వన్స్ ఛాన్స్ అనే వారికి బుద్ధి చెప్పాలే. తిరిగి కేసీఆర్ కే పట్టాం కట్టాలని పిలుపునిచ్చారు. వెన్నుపోటు కాంగ్రెస్‌ను నమ్ముకుంటే.. తెలంగాణ ప్రజలకు గుండెపోటు తప్పదని హెచ్చరించారు. చిదంబరం వ్యాఖ్యలు చూస్తే కడుపులో చిచ్చు పెట్టి కండ్లు తుడవ వచ్చినట్లుగా ఉందని దుయ్యబట్టారు. అమరవీరుల తల్లిదండ్రులు కరడాలతో కొట్టినా మీ పాపం పోదు. చిదంబరం బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story