IAS Officers: వాళ్లకు నో టైమింగ్స్..! సెక్రెటేరియట్‌లో ఐఏఎస్‌ల ఇష్టారాజ్యం

by Shiva |
IAS Officers: వాళ్లకు నో టైమింగ్స్..! సెక్రెటేరియట్‌లో ఐఏఎస్‌ల ఇష్టారాజ్యం
X

దిశ, తెలంగాణ బ్యూరో: సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న ఐఏఎస్‌లు సమయపాలన పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మధ్యాహ్నం 2 తర్వాతే విధులకు హాజరవుతున్నారని టాక్. కొందరు బ్యూరోక్రాట్లు ఇలా వచ్చి అలా బయటకు వెళ్లిపోతుండగా.. మరికొందరు రాత్రి 10 దాటినా చాంబర్‌లోనే ఉంటున్నారని సెక్రెటేరియట్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. తాము సెక్షన్‌లో ఉన్నంత వరకు ఉద్యోగులు ఇంటికి వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేస్తున్నట్టు సమాచారం. దీంతో పలువురు మహిళా ఉద్యోగులు సదరు ఐఏఎస్‌లపై కోపంగా ఉన్నారు.

ఐఏఎస్‌లకు ఎందుకు మినహాయింపు?

ఐఏఎస్ ఆఫీసర్లు క్రమశిక్షణకు మారుపేరుగా ఉండాలి. అందులోనూ రాష్ట్ర పాలనకు కేంద్ర బిందువైన సెక్రెటేరియ‌ట్‌లో పనిచేసే బ్యూరోక్రాట్లు మరింత ఆదర్శంగా వ్యవహరించాలి. కానీ, మెజార్టీ ఆఫీసర్లు తమకు ఇష్టం వచ్చినప్పుడు వచ్చి.. నచ్చినప్పుడు బయటకు వెళ్తున్నారని, సమయపాలన పాటించడం లేదనే విమర్శలు వస్తు్న్నాయి. ‘సెక్రటేరియట్‌లో పనిచేస్తున్న కిందిస్థాయి ఉద్యోగులకు ఐఏఎస్‌ అధికారులు ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారు? ఉన్నతాధికారులే టైమ్‌కు రానప్పుడు మేమెందుకురావాలి’ అనే ఆలోచనను వారిలో రేకెత్తిస్తున్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆలస్యంగా వస్తున్నారనే కారణంగా ఎంప్లాయీస్‌కు ఫెషియల్ అటెండెన్స్ కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను సీఎస్ శాంతికుమారి ప్రారంభించినట్టు తెలుస్తున్నది. తమకు మాత్రమే డ్యూటీ టైమింగ్స్ ఫిక్స్ చేసిన చీఫ్ సెక్రెటరీ.. ఐఏఎస్‌లకు ఎందుకు మినహాయింపు ఇస్తున్నారనే ప్రశ్నను ఉద్యోగులు లేవనెత్తుతున్నారు. వారు సమయపాలన పాటించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

మెజార్టీ ఐఏఎస్‌లు మధ్యాహ్నం 2 తర్వాతే..

మెజార్టీ ఐఏఎస్ ఆఫీసర్లు మధ్యాహ్నం 2 గంటల తర్వాతే సెక్రెటేరియట్‌కు వస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. లేటుగా వచ్చిన బ్యూరోక్రాట్లు రాత్రి 10 గంటల వరకు, ఆ తర్వాత సైతం సెక్రటేరియట్‌లో ఉండటమే కాకుండా.. తాము ఆఫీసులో ఉన్నంత వరకు సెక్షన్‌లోనే ఉండాలని ఉద్యోగులకు కండిషన్ పెడుతున్నట్టు తెలిసింది. దీంతో చేసేదేమీ లేక ఐఏఎస్‌లు సెక్రెటేరియట్ నుంచి వెళ్లాకే తామూ ఇళ్లకు వెళ్లాల్సి వస్తున్నదని ఎంప్లాయీస్ ఆవేదన వ్యక్తం చేస్తు్న్నారు. బ్యూరోక్రాట్ల తీరుతో మహిళా ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు సమాచారం. ‘అర్జెంట్ ఫైల్స్ ఉంటే పర్లేదు. కానీ, రెగ్యూలర్ ఫైల్స్ ఉన్నప్పుడు సైతం లేట్ అవర్స్‌లో ఆఫీసులో ఉండమంటున్నారు’ అని ఓ సెక్షన్ ఆఫీసర్ వాపోయారు.

రివ్యూకు అరగంట ముందే ఆఫీసుకు..

కొందరు ఐఏఎస్‌లు సీఎం, మంత్రుల వద్ద సమీక్షలు జరిగే టైంను ముందుగా తెలుసుకుని సరిగ్గా అరగంట ముందు సెక్రెటేరియట్‌కు వస్తున్నట్టు తెలుస్తున్నది. మిగతా టైమ్‌లో ఇంటి వద్దో, లేక ఏదో ఒక హోటల్‌లో ఎంజాయ్ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. మరికొందరు ఫైల్స్‌ను తాము ఉండే ప్లేస్‌కు తెప్పించుకుని మరీ క్లియర్ చేస్తున్నట్టు టాక్. ఇంకొందరు ఆఫీసర్లు అయితే సీఎంఓ నుంచి ఆదేశాలు వస్తే తప్పా ఫైల్స్ మీద సంతకాలు చేయడం లేదని సెక్రెటేరియట్ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది.

జూనియర్ ఐఏఎస్‌లపై విమర్శలు

ఈ మధ్య కలెక్టర్లుగా పనిచేసిన కొందరు ఐఏఎస్‌లకు హెచ్ఓడీలో పనిచేసిన అనుభవం లేకున్నా నేరుగా సెక్రెటేరియట్‌లో పోస్టింగ్ ఇచ్చారు. వారికి బిజినెస్ రూల్స్ తెలియక ఎంప్లాయీస్‌తో గొడవ పడుతున్నట్టు టాక్. తాము చెప్పినట్లుగానే ఫైల్ డ్రాఫ్టింగ్ చేయాలని ఆదేశిస్తున్నట్టు సమాచారం. అయితే, కొందరు ఉద్యోగులు ధైర్యం చేసి సెక్రెటేరియట్ బిజినెస్ రూల్స్ ప్రకారం అలా చేయడం కుదరదని చెబుతుండటంతో.. తమకే ఎదురు చెప్తారా? అని వారిపై బ్యూరోక్రాట్లు చిందులు తొక్కుతున్నట్టు తెలిసింది.

ప్రత్యేక పరిస్థితుల్లో మినహాయింపులు

కేబినెట్ మీటింగ్స్, సీఎం వద్ద రివ్యూలు ఉన్నప్పుడు లేదా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో బ్యూరోక్రాట్లు, ఉద్యోగులు సెక్రెటేరియట్‌లో ఎక్కువ సమయం ఉండక తప్పదు. మిగతా రోజుల్లో మాత్రం ఉదయం 10 నుంచి సాయంత్రం 5గంటల వరకు మాత్రమే డ్యూటీ టైం. అయినప్పటికీ నార్మల్ డేస్‌లో ఐఏఎస్‌లు ఆఫీసుకు ఇన్ టైమ్‌కు ఎందుకు వస్తలేరని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏయే ఆఫీసర్ ఎప్పుడు వస్తున్నారు? ఎప్పుడు బయటకు వెళ్తున్నారు? అనే సదరు అధికారుల పేర్లను తమ ఇంటర్నల్ మీటింగ్స్‌లో ప్రస్తావిస్తున్నట్టు తెలుస్తున్నది.

త్వరలో ఐఏఎస్‌లకూ ఫెషియల్ అటెండెన్స్..

సెక్రెటేరియట్ ఉద్యోగులకు ఫెషియల్ అటెండెన్స్ అమలు చేసే ప్రయత్నాలు ఇప్పటికే మొదలయ్యాయి. సగం మంది ఉద్యోగులకు రిజిస్ట్రేషన్ సైతం పూర్తయ్యింది. ఈ క్రమంలోనే మెజార్టీ ఐఏఎస్‌లు టైం సెన్స్ పాటించడం లేదని సీఎం రేవంత్ దృష్టికి వెళ్లినట్టు తెలిసింది. అందుకే సీఎం ఆదేశాల మేరకు ఐఏఎస్ ఆఫీసర్లకు సైతం ఫెషియల్ హాజరును తప్పనిసరి చేసినట్టు సీఎంఓ వర్గాలు పేర్కొన్నాయి.

ఉద్యోగులు ఎదుర్కొన్న సమస్యలు..?

1. ఓ స్పెషల్ సీఎస్ హోదాలో ఉన్న ఐఏఎస్ మధ్యాహ్నం తర్వాతే ఆఫీసుకు వచ్చి ఆలస్యంగా వెళ్తుంటారు. ఆయన ఇంటికెళ్లాకే ఆ శాఖకు చెందిన ఉద్యోగులు ఇంటికి వెళ్తున్నారని తెలిసింది.

2. ఈ మధ్య స్పెషల్ సెక్రెటరీ హోదాలోని ఓ జూనియర్ ఐఏఎస్ మధ్యాహ్నం 2గంటలకు సెక్రెటేరియట్‌కు వచ్చారు. ముఖ్యమైన ఫైల్ ఉందని, రాత్రి 10 గంటల వరకు ఉండాలని ఓ మహిళా ఉద్యోగిని ఆదేశించారు. తీరా చూస్తే అది రోటిన్ ఫైల్ అని సదరు ఉద్యోగి తోటి ఎంప్లాయీస్ వద్ద తన గోడును వెల్లిబుచ్చారు.

3. ఓ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఆదివారం మాత్రమే కచ్చితంగా ఆఫీసుకు వస్తుంటారని, పనిలేకున్నా సదరు శాఖకు చెందిన ఉద్యోగులనూ రమ్మని వాట్సప్‌లో మెసెజ్ పెట్టడం ఆనవాయితీగా మారిందని టాక్.

4. మరో ప్రిన్సిపల్ సెక్రెటరీ విజిటర్లను కలిసేందుకు అస్సలు ఇష్టపడరు. ఎవరైనా కలిసేందుకు ఒత్తిడి తెస్తే తన చాంబర్‌లోకి పిలిచి క్లాస్ పీకి బయటకు పంపుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది.

Advertisement

Next Story

Most Viewed