IPL 2025 : కేకేఆర్ కొత్త కెప్టెన్ ఎవరో తేలిపోయింది.. అతనికే పగ్గాలు?

by Harish |
IPL 2025 : కేకేఆర్ కొత్త కెప్టెన్ ఎవరో తేలిపోయింది.. అతనికే పగ్గాలు?
X

దిశ, స్పోర్ట్స్ : ఈ ఏడాది ఐపీఎల్ టైటిల్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్‌(కేకేఆర్)పై వచ్చే సీజన్‌లో భారీ అంచనాలు ఉంటాయనడంలో సందేహాలు లేవు. అంచనాలకు తగ్గట్టు జట్టును నిర్మించుకోవాల్సిన అవసరం ఉన్నది. అంతకుముందు ఆ ఫ్రాంచైజీ చేయాల్సిన పని కొత్త కెప్టెన్‌న నియమించుకోవడం. వచ్చే సీజన్‌‌లో కేకేఆర్‌ కెప్టెన్ ఎవరు? అన్న చర్చ క్రికెట్ వర్గాల్లో జరుగుతుంది. విన్నింగ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌ను కోల్‌కతా వదిలేసుకున్న విషయం తెలిసిందే. వేలంలో కొనుగోలు చేసిన ప్లేయర్లలోనూ కెప్టెన్సీ సామర్థ్యం ఉన్న ఆటగాళ్లు తక్కువే. ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్‌కు పగ్గాలు అప్పగిస్తారని వార్తలు వచ్చాయి. ఆక్షన్‌లో అతన్ని భారీ ధర 23.75 కోట్లు పెట్టి తిరిగి జట్టులోకి తీసుకుంది. దీంతో కేకేఆర్ కొత్త కెప్టెన్ అతనే అని ప్రచారం జరిగింది. కానీ, ఫ్రాంచైజీ అనుభవజ్ఞుడైన అజింక్యా రహానెకు పగ్గాలు అప్పగించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. కేకేఆర్ రహానెను కెప్టెన్సీ కోసమే కొనుగోలు చేసిందని, ప్రస్తుతానికి 90 శాతం కొత్త కెప్టెన్ అతనే అని సంబంధిత వర్గాలు తెలిపాయి.

వేలంలో రహానెను కేకేఆర్ కేవలం రూ.1.5 కోట్లకే దక్కించుకున్న విషయం తెలిసిందే. మొదట రహానె కోసం ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపించలేదు. ఆఖరి రౌండ్‌లో అతన్ని కనీస ధరకే కొనుగోలు చేసింది. సారథిగా రహానె అనుభవం జట్టుకు ఉపయోగపడుతుందని ఫ్రాంచైజీ భావించి ఉండొచ్చు. 2020-21లో ఆస్ట్రేలియా టూరులో రహానె కెప్టెన్సీని ఎవరూ మర్చిపోలేరు. తొలి టెస్టు తర్వాత అప్పటి కెప్టెన్ కోహ్లీ గైర్హాజరులో భారత జట్టును అద్భుతంగా నడిపించాడు. మూడు టెస్టులకు నాయకత్వం వహించగా.. రెండింట విజయాలు, మరో మ్యాచ్ డ్రా అయ్యింది. ఆ సిరీస్‌ను భారత్ 2-1తో సొంతం చేసుకుంది. అలాగే, రెడ్ బాల్ ఫార్మాట్‌లో ముంబైకి రహానె కెప్టెన్.గత సీజన్‌లో అతని నాయకత్వంలో ముంబై రంజీ ట్రోఫీ గెలిచింది.అలాగే, ముంబైకి ఇరానీ కప్ కూడా అందించాడు. అయితే, టీ20ల్లో కెప్టెన్‌‌గా రహానెకు గొప్ప రికార్డేం లేదు. ఇటీవల సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబై అతని స్థానంలో శ్రేయస్ అయ్యర్‌ను కెప్టెన్‌గా నియమించింది. అలాగే, ఐపీఎల్‌లో 2018, 2019 సీజన్లలో రాజస్థాన్ రాయల్స్‌ను నడిపించాడు. 24 మ్యాచ్‌ల్లో కేవలం 9 విజయాలే అందుకున్నాడు. అయితే, రహానె అనుభవంపై కేకేఆర్ నమ్మకంగా ఉన్నట్టు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed