HYDRA : హైకోర్టు ఆదేశాలతో అమీన్‌పూర్‌లో హైడ్రా సర్వే

by M.Rajitha |
HYDRA : హైకోర్టు ఆదేశాలతో అమీన్‌పూర్‌లో హైడ్రా సర్వే
X

దిశ, తెలంగాణ బ్యూరో : పార్కులు, ర‌హ‌దారులు క‌బ్జాకు గురైన‌ట్టు ఫిర్యాదులు రావ‌డంతో హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ.రంగ‌నాథ్‌ ఆదేశాల‌తో అమీన్‌పూర్‌లో మంగ‌ళ‌వారం హైడ్రా ఆధ్వర్యంలో స‌ర్వే నిర్వహించారు. స‌ర్వేలో పాల్గొన్న వారిలో జేడీ స‌ర్వే కార్యాల‌య అధికారుల‌తో పాటు హైడ్రా అధికారులు సైతం ఉన్నారు. ఎక‌రాకుపైగా ఉన్న పార్కు స్థలంతో పాటు.. ర‌హ‌దారుల‌ను గోల్డెన్ కీ వెంచ‌ర్ వాళ్లు క‌బ్జాచేశారంటూ వెంక‌ట‌ర‌మ‌ణ కాల‌నీ వాసుల ఫిర్యాదు చేశారు. ఇరు ప‌క్షాల వాళ్లు కోర్టును ఆశ్రయించ‌డంతో హైకోర్టు ఆదేశాల మేర‌కు హైడ్రా సర్వే నిర్వహించింది. మొత్తం 5 స‌ర్వే నంబ‌ర్లలోని 150 ఎక‌రాలకు పైగా ఉన్న స్థలాన్ని జేడీ స‌ర్వే కార్యాల‌య అధికారులు స‌ర్వే చేశారు. వెంక‌ట‌ర‌మ‌ణ కాల‌నీ, చ‌క్రపురి కాల‌నీ వాసులు, గోల్డెన్ కీ వెంచ‌ర్ నిర్వాహ‌కుల‌తో పాటు.. ప‌రిస‌ర కాల‌నీ వాసులు, గ్రామ‌స్థుల స‌మ‌క్షంలో స‌ర్వే నిర్వహించారు. లే ఔట్లను ప‌రిశీలించడంతోపాటు స‌ర్వే నంబ‌ర్ల ఆధారంగా.. పార్కు స్థలాల‌తో పాటు.. ర‌హ‌దారుల‌ను కాపాడే ప‌నిలో హైడ్రా చర్యలు ప్రారంభించింది. స‌ర్వే నంబ‌ర్లు, హ‌ద్దు రాళ్ల ఆధారంగా భూముల స‌రిహ‌ద్దుల‌ను నిర్ధారించి.. ఎవ‌రి లే ఔట్‌లోకి ఎవ‌రు చొర‌బ‌డ్డార‌నేది తేల్చేందుకు హైడ్రా అధికారుల క‌స‌ర‌త్తు చేస్తున్నారు. ఈ స‌ర్వేలో హైడ్రా, హెచ్ఎండీఏ, మున్సిపాలిటీ, రెవెన్యూ, స‌ర్వే శాఖ‌ల అధికారులు పాల్గొన్నారు.

మియాపూర్ భూములపై ఫోకస్

మియాపూర్ లోని సర్వే నెం.100, 101లో భూముల అన్యాక్రాంతంపై హైడ్రా దృష్టి సారించింది. భూముల వాస్తవ విస్తీర్ణం, ప్రస్తుతం ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూమి వివరాలు, సుమారు 15 ఏళ్లుగా జరిగిన రిజిస్ట్రేషన్ లావాదేవీలపై ఇప్పటికే రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయం నుండి అధికారులు వివరాలు సేకరించిన విషయం తెలిసిందే. అక్రమ రిజిస్ట్రేషన్లు ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూమి ఆక్రమణపైనే ప్రధాన దృష్టి సారించినట్లు తెలిసింది. విలువైన భూములు కావడంతో ప్రత్యేక బృందాల ఆధ్వర్యంలో విచారణ చేయాలని నిర్ణయించారు.

Advertisement

Next Story

Most Viewed