గుండెల్లో గుబులు పుటిస్తోన్న హైడ్రా.. ఎవరినీ లెక్కచేయకుండా పని పూర్తి చేస్తోన్న రంగనాథ్!

by Gantepaka Srikanth |   ( Updated:2024-08-21 11:27:38.0  )
గుండెల్లో గుబులు పుటిస్తోన్న హైడ్రా.. ఎవరినీ లెక్కచేయకుండా పని పూర్తి చేస్తోన్న రంగనాథ్!
X

హైడ్రా.. ఇప్పుడు ఈ పేరెత్తితేనే కబ్జాదారుల గుండెల్లో గుబులు పుడుతున్నది. కొందరు రాజకీయ నేతలు శివాలూగుతున్నారు. అక్రమంగా నిర్మాణాలు చేసినవారికి, ఆక్రమణలకు పాల్పడినవారికి కంటిమీద నిద్ర ఉండడంలేదు. ఏటేటా హైదరాబాద్ నగరం అన్నివైపులా విస్తరిస్తుండటం, రియల్ ఎస్టేట్ వ్యాపారుల నిబంధనల ఉల్లంఘన, అధికార నేతలతో అండర్‌స్టాండింగ్.. ఇవన్నీ అక్రమ నిర్మాణాలకు కారణమవుతున్నాయి. గడచిన పదేండ్లలో ఇష్టారాజ్యంగా వెలసిన అక్రమ కట్టడాలు ఇప్పుడు ‘హైడ్రా’ దెబ్బకు విలవిలలాడుతున్నాయి. ఏ రోజు ఏ అక్రమ కట్టడం కూలుతుందోనని అక్రమార్కులు భయపడుతున్నారు. రాజకీయ పలుకుబడినీ లెక్కచేయకుండా ఐపీఎస్ ఆఫీసర్ రంగనాథ్​తీసుకుంటున్న చర్యలు తాజా, మాజీ ప్రజాప్రతినిధులనూ హడలెత్తిస్తున్నాయి. = విశ్వనాథ్​

మూడు లక్ష్యాలు

హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) ముఖ్యమంత్రి ఆలోచనల్లోంచి పుట్టుకొచ్చిన కొత్త వ్యవస్థ. మొత్తం మూడు లక్ష్యాలతో దీనికి జూలైలో అంకురార్పణ చేశారు. చెరువులు, పార్కులు, క్రీడా మైదానాలు, ఓపెన్ స్పేస్, నాలాలు, రోడ్లు, ఫుట్ పాత్‌లు, ల్యాండ్ పార్సిళ్లు లాంటి ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించడం మొదటి టాస్క్. విపత్తులు సంభవించినప్పుడు ప్రజల ప్రాణాలు, ఆస్తులను కాపాడడంతో పాటు సహాయ పునరావాస చర్యలను కల్పించడం. ఇక మూడవ టాస్క్.. జలమయమయ్యే ప్రాంతాలను ముందుగానే గుర్తించి ప్రజలను అప్రమత్తం చేయడం, ప్రజలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యలను వీలైనంతగా నివారించడం. ఒక స్వతంత్ర సంస్థ తరహాలో తనను తాను ట్రెయిన్ చేసుకుంటూ ప్రజలకు సర్వీస్ చేయడం.

పరిధి ఎంతవరకు?

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ పరిధిలోని ప్రాంతంతో పాటు హెచ్ఎండీఏ, ఔటర్ రింగు రోడ్డు వరకు. హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లోని కొంత భాగం ‘హైడ్రా’లో కలిసి ఉంటుంది. జీహెచ్ఎంసీ సహా 27 మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, 33 గ్రామ పంచాయతీలు హైడ్రాలో భాగం. దాదాపు 2000 చ.కి.మీ పరిధిలో హైడ్రా తన కార్యకలాపాలను నిర్వహించనున్నది. హైదరాబాద్ మొదలు ఓఆర్ఆర్ వరకు అన్ని పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల ప్రాంతం హైడ్రా పరిధిగా ఉంటుంది.

విభాగాల మధ్య సమన్వయం..

హైడ్రా పరిధి విస్తృతం కావడం, బహుళ ప్రయోజనాలను ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించడంతో వివిధ ప్రభుత్వ విభాగాల మధ్య పటిష్ట సమన్వయం తక్షణ కర్తవ్యంగా మారింది. నాలుగు జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్ కార్పొరేషన్లు/మున్సిపాలిటీల యంత్రాంగం, 33 గ్రామ పంచాయతీల అధికారులతో పాటు పోలీసు, విద్యుత్, రెవెన్యూ, పురపాలక, పంచాయతీరాజ్, ఇరిగేషన్, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, మెట్రోరైల్, అటవీ, అర్బన్ బయో డైవర్శిటీ, హైదరాబాద్ గ్రోత్ కారిడార్, మూసీ రివర్ డెవలప్‌మెంట్ ఫ్రంట్, ఫైర్.. ఇలాంటి విభాగాలతో సమన్వయం తప్పనిసరి. ఇక నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, వాతావరణ శాఖ, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ లాంటి సంస్థలతోనూ కోఆర్డినేషన్ ఉండనున్నది.

ఎందుకోసం ఈ కొత్త వ్యవస్థ?

హైదరాబాద్ నగర విస్తరణ వేగంగా జరుగుతున్నది. ఏటా సగటున 3.2% చొప్పున జనాభా పెరుగుతున్నది. జాతీయ సగటుతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. పల్లె ప్రాంతాల నుంచి వలసలు ఎక్కువవుతున్నాయి. దీనికి తోడు శివారు ప్రాంతాల్లో ఫార్మా, లైఫ్ సైన్సెస్, బయో టెక్నాలజీ, ఐటీ, ఐటీ అనుబంధ, లాజిస్టిక్స్, వేర్ హౌజింగ్, ఏరోస్పేస్, వివిధ రకాల పరిశ్రమలు, సంప్రదాయేతర ఇంధన వనరుల ఉత్పత్తి ప్యాక్టరీలు.. ఇలా అనేక రంగాలకు చెందిన కొత్త యూనిట్లు వస్తున్నాయి. ఉపాధి కల్పన కారణంగా పట్టణ జనాభా కూడా పెరిగిపోతున్నది. ప్రమాదాలు, విపత్తుల నివారణను దృష్టిలో పెట్టుకుని బహుళ వ్యవస్థల స్థానంలో ఏకీకృత మెకానిజం ఉండాలని ప్రభుత్వం భావించింది. ఓఆర్ఆర్ వరకూ తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ అని సీఎం భావించడంతో ప్రజల మౌలిక సౌకర్యాలను పెంచడం దీని లక్ష్యం.

ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తుంది?

ముఖ్యమంత్రి చైర్మన్‌గా వ్యవహరించే ‘హైడ్రా’లో దాదాపు ఇరవై మంది సభ్యులుంటారు. హైడ్రా కమిషనర్ దీనికి మెంబర్ సెక్రెటరీగా వ్యవహరిస్తారు. పురపాలక, రెవెన్యూ మంత్రులతో పాటు నాలుగు జిల్లాల ఇన్‌చార్జి మంత్రులు కూడా ఇందులో ఉంటారు. జీహెచ్ఎంసీ మేయర్, చీఫ్ సెక్రటరీ, డీజీపీ, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి, పురపాలక ప్రిన్సిపల్ సెక్రెటరీ, కమాండ్ కంట్రోల్ సెంటర్ హెడ్, నాలుగు జిల్లాల కలెక్టర్లు, వివిధ విభాగాల అధికారులు (ఆయా అంశాలపై నిర్ణయాలు జరిగేటప్పుడు) ఇందులో సభ్యులుగా ఉంటారు. ‘హైడ్రా’కు పాలకమండలిగా వ్యవహరించే ఈ టీమ్ అన్ని రకాల విధాన నిర్ణయాలను తీసుకుంటుంది. ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తుంది. దీనికి తోడు తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ స్థాయిలో డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సబ్ కమిటీ కూడా పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి చైర్మన్‌గా, హైడ్రా కమిషనర్ మెంబర్ సెక్రెటరీగా పనిచేస్తుంది.

అక్రమ కట్టడాల కూల్చివేతలతో గాభరా

హైదరాబాద్ మొదలు ఓఆర్ఆర్ వరకు అక్రమంగా వెలసిన కట్టడాలను నియంత్రించడం హైడ్రా మూడు ప్రధాన విధుల్లో ఒకటి. చెరువులను ఆక్రమించి చేసిన నిర్మాణాలను తొలగించడం, నిబంధనలకు విరుద్ధంగా కట్టినవాటిని కూల్చేయడంతో ఆక్రమణదారుల్లో గుబులు మొదలైంది. అధికార, ప్రతిపక్ష తేడా లేకుండా అన్నింటిపైనా ఫోకస్ పెట్టింది. హైడ్రా జూలై 19 నుంచి ఉనికిలోకి వచ్చిన తర్వాత కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన ఐపీఎస్ అధికారి రంగనాథ్​సమగ్ర అధ్యయనం చేశారు. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ నుంచి తెప్పించుకున్న రికార్డుల ద్వారా 1979-2023 మధ్యకాలంలో నగరంలోని 56 చెరువుల విస్తీర్ణం దాదాపు 61% మేర తగ్గిపోయినట్లు నిర్ధారణకు వచ్చారు. సహజ నీటి తావులను డిస్టర్బ్ చేసి కట్టిన భవనాలను కూల్చివేశారు. గండిపేట చెరువు సమీపంలోనే దాదాపు 45 బిల్డింగులను నేలమట్టం చేశారు.

కన్వెన్షన్ సెంటర్లు, ఫామ్ హౌజ్‌లు

సిటీ శివారు ప్రాంతాల్లో, ఓఆర్ఆర్‌కు దగ్గరగా విచ్చలవిడిగా వెలిసిన ఫామ్ హౌజ్‌లు, కన్వెన్షన్ సెంటర్లు, రిసార్టులు నిబంధనలకు విరుద్ధంగా కట్టినట్లు హైడ్రా స్టడీలో తేలింది. స్థానిక సంస్థల నుంచి ఎలాంటి అనుమతుల్లేకుండా నిర్మాణమైనట్లు స్పష్టమైంది. కొన్ని సందర్భాల్లో రాజకీయ సంబంధాలతో చెరువులకు సమీపంలోనే ఎఫ్‌టీఎల్ పరిధిలో, బఫర్ జోన్‌లో రియల్ ఎస్టేట్ వెంచర్లు పడ్డాయని, బహుళ అంతస్తుల భవనాలు వెలిశాయని హైడ్రా గుర్తించింది. వివిధ విభాగాల నుంచి తీసుకున్న పర్మిషన్లను గుర్తించి తొలగింపుపై నిర్ణయం తీసుకోనున్నది. ఉల్లంఘనలకు పాల్పడినవారికి నోటీసులు జారీచేసి కేసులు పెడుతున్నది.

79కిపైగా కూల్చివేతలు

హైదరాబాద్ మహానగరం పరిధిలో హెడ్రా ఆపరేషన్ కొనసాగుతున్నది. అక్రమార్కుల గుండెల్లో హైడ్రా అధికారులు బుల్డోజర్లు పరిగెత్తిస్తున్నారు. ఇప్పటివరకు 70 భవనాలతో పాటు పలు ప్రాంతాల్లో ప్రహరీ గోడలు కూల్చివేశారు. గండిపేటలోనే 20కి పైగా భవనాలను నేలమట్టం చేశారు. చందానగర్ సర్కిల్ హఫీజ్ పేట్ చెరువులో 3, బాచుపల్లిలోని ఎర్రకుంటలో 3, గాజులరామారంలో 42 భవనాలు, గండిపేటలో 3, చిత్రపురి కాలనీలో 7 భవనాలను కూల్చారు. గాజులరామారం మహాదేవపురం, షిరిడి హిల్స్ పార్కు స్థలంలో వెలిసిన నిర్మాణాలను స్వల్పంగా కూల్చివేశారు. గాజులరామారం దేవేందర్ నగర్ లో చెరువు శిఖం భూమితో పాటుగా ప్రభుత్వ భూమిని ఆక్రమించి చేపట్టిన 51 నిర్మాణాలను.. నిజాంపేట కార్పొరేషన్ ఎర్రకుంట చెరువులో వెలసిన మూడు బహుళ అంతస్తుల నిర్మాణాన్ని నేలమట్టం చేశారు.

కబ్జా చేస్తే కూల్చివేతే: రంగనాథ్, కమిషనర్, హైడ్రా

గతంలో జీహెచ్ఎంసీలో భాగంగా ఈవీడీఎం పేరుతో ఉండేది. ఇప్పుడు పరిధి విస్తరించి హైడ్రా అయింది. దీనికి విస్తృత అధికారాలు ఉన్నాయి. రాజకీయ పలుకుబడితో నాకు సంబంధం లేదు. కబ్జాలకు పాల్పడితే కూల్చివేత తప్పదు. డిమాలిషన్ సమయంలో ఎన్నో విమర్శలు వస్తాయి.. ఒత్తిడులూ పెరుగుతాయి. కానీ నా పని నేను చేసుకుంటూ పోతా. జీహెచ్ఎంసీ మొదలు అన్ని విభాగాల నుంచి తగిన సహకారమే లభిస్తున్నది. ఆక్రమణలకు పాల్పడినవారిపై కేసులు తప్పవు. తప్పుడు పత్రాలు తయారుచేస్తే చట్టపరమైన చర్యలూ ఉంటాయి. ప్రత్యేకంగా హైడ్రా కోసం ఓ పోలీసు స్టేషన్‌కు అనుమతి ఇవ్వాలని సీఎంను అడిగాను. పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ప్రభుత్వ స్థలాలు, చెరువులు, పార్కులు, క్రీడా మైదానాలను.. ఇలా ఇల్లీగల్‌గా ఆక్రమించి ఏ నిర్మాణం చేపట్టినా నిర్దాక్షిణ్యంగా కూలుస్తాం. చేసిన ఖర్చంతా ఆక్రమణదారులకు వృథా అవుతుంది. ఇకనైనా అక్రమ నిర్మాణాలను ఆపేయాలి. హైడ్రాకు స్పష్టమైన అధికారాలు ఉన్నాయి. గవర్నమెంట్ ల్యాండ్‌లో ఇల్లీగల్‌గా ఏది కట్టినా కూలక తప్పదు. ప్రజల నుంచి కూడా సహకారం కోరుతున్నాం. త్వరలోనే మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెస్తాం. ప్రజలే విజిల్ బ్లోయర్‌లుగా మారి సమాచారం ఇస్తే సంతోషిస్తాం. హైడ్రా విధి నిర్వహణలో వ్యక్తిగత సంబంధాలుండవు. నిబంధనలు ఎవరు ఉల్లంఘించినా ఒకే తీరులో స్పందిస్తాం.

Advertisement

Next Story