అందులో మల్లారెడ్డి కాలేజీ ఉన్నా వదలం.. రంగనాథ్ కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |
అందులో మల్లారెడ్డి కాలేజీ ఉన్నా వదలం.. రంగనాథ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: కూల్చివేతలపై హైడ్రా(Hydra) కమిషనర్ ఏవీ రంగనాథ్(AV Ranganath) వివరణ ఇచ్చారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. హైడ్రా అంటే ఒక బాధ్యత, భరోసా అని అన్నారు. బఫర్ జోన్‌(Buffer zone)లో కాలేజీలు ఉండొద్దని చెప్పారు. అది మల్లారెడ్డి కాలేజీ(Mallareddy College) అయినా.. ఇంకెవరి కాలేజీ అయినా సరే.. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ప్రతీ నిర్మాణాన్ని కూల్చివేస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యా సంవత్సరం(academic year) మధ్యలో కూల్చివేస్తే పిల్లల భవిష్యత్‌పై ప్రభావం పడుతుందని ఆలోచించే సమయం ఇచ్చామని తెలిపారు. కూల్చివేతలపై ముందస్తు సమాచారం ఇస్తున్నామని.. సమయం ఇచ్చినా అడ్డుకునే వారిపైనే కేసులు నమోదు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటివరకు హైడ్రా వల్ల ఎవరూ ఆత్మహత్య చేసుకోలేదని అన్నారు. కొందరి తప్పుడు ప్రచారం వల్లే బుచ్చమ్మ అనే మహిళ ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. తాము ఇప్పటివరకు ఆ బుచ్చమ్మ ఇంటి జోలికి వెళ్లలేదని అన్నారు.

హైడ్రాపై తప్పుడు ప్రచారం చేయొద్దని.. రోగానికి చేస్తున్న వైద్యంగానే భావించాలని కోరారు. నగరంలో అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారు బాధితులు కాదని.. అందరూ బలవంతులే అని అన్నారు. అందుకే పక్కా ఆధారాలతో రంగంలోకి దిగుతున్నామని చెప్పారు. వరదలు వస్తే ముందుగా ఇబ్బంది పడేది హైదరాబాద్ ప్రజలే అని అన్నారు. పేదలు మధ్యతరగతి ప్రజలు చెరువులు ఆక్రమించరు. అక్రమ కట్టడాల వెనుక పెద్దవాళ్లు ఉన్నారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకే ముఖ్యమంత్రి హైడ్రాను తీసుకొచ్చారని గుర్తుచేశారు. చెరువులు, నాలాలు కబ్జా చేస్తుంటే చూస్తూ ఊరుకోం. ఇప్పుడు కాకపోతే.. ఇంకెప్పుడు చెరువులు నాలాలను కాపాడుకోలేమని అభిప్రాయపడ్డారు. పేదలకు ఇబ్బంది చేయాలనేది హైడ్రా అభిమతం కాదని అన్నారు. ఒవైసీ, మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్రెడ్డికికి చెందిన కాలేజీలపై ఫిర్యాదులు వచ్చాయి. తప్పకుండా త్వరలో వాటిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed