తల్లి మరణం తట్టుకోలేక కొడుకు ఉరేసుకుని ఆత్మహత్య

by Naveena |
తల్లి మరణం తట్టుకోలేక కొడుకు ఉరేసుకుని ఆత్మహత్య
X

దిశ, సికింద్రాబాద్: అనారోగ్య సమస్య కారణంగా తల్లి మరణించడంతో తట్టుకోలేక కొడుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన లాలాగూడ పోలీస్టేషన్ పరిధిలోని లాలాపేటలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ రఘు బాబు తెలిపిన కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి... లాలాపేటలోని వినోభానగర్ ప్రాంతానికి చెందిన లక్ష్మి(52) అభినయ్ (20)లు తల్లీకొడుకులు. వీరిద్దరు ఎనిమిది సంవత్సరాలుగా అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. తల్లి క్యాన్సర్ పేషెంట్. ఆమె కుమారుడు అభినయ్ డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. తల్లి ఆనారోగ్యానికి మందుల ఖర్చుకు, కాలేజీ ఫీజుకై చేతికి దొరికిన పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే, శనివారం మధ్యాహ్నం సమయంలో వీళ్లు నివాసముంటున్న ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండడంతో ఇంటి యజమాని బ్రహ్మాజీ సదరు ఇంటి తలుపులు ఎంత కొట్టినా ఎవ్వరూ కూడా తెరవడం లేదు. దీంతో స్థానిక లాలాగూడ పోలీసులకు సమాచారం అందజేయడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సైతం ఎంతసేపు తలుపు తట్టినా లోపలి నుంచి ఎవరూ స్పందించకపోవడంతో తలుపులు బద్దలుకొట్టి చూడగా హాల్లో అభినయ్ సీలింగ్ ఫ్యాన్ కి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. లోపలికి వెళ్లి చూడగా బెడ్రూంలో తల్లి కూడా మృతి చెంది ఉంది. ఈ క్రమంలో పోలీసులు ఇంటిని పరిశీలించగా మృతురాలు లక్ష్మికి సంబంధించిన మెడికల్ రిపోర్ట్ తో పాటు అభినయ్ రాసిన ఒక సూసైడ్ నోట్ కనిపించింది. అందులో 'నాకు మా అమ్మకు ఆరోగ్య సమస్యలున్నాయి. నాకు తండ్రి కూడా లేడు. మా బంధువుల కోసం వెతక్కండి. ఐ యామ్ సారీ అని ఇంగ్లీష్ లో రాసుంది. కాగా, తల్లి లక్ష్మి అనారోగ్యంతో చనిపోవడంతో అది తట్టుకోలేక అబినయ్ ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. వీరు మృతి చెంది రెండు రోజులు కావచ్చని చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు.

Advertisement

Next Story