లిఫ్ట్ అడిగి డబ్బులు లాక్కొనే…ఇద్దరు మహిళలు అరెస్ట్

by Kalyani |
లిఫ్ట్ అడిగి డబ్బులు లాక్కొనే…ఇద్దరు మహిళలు అరెస్ట్
X

దిశ, సికింద్రాబాద్: వాహనదారులను లిఫ్ట్ అడిగి నిర్మాణుష్య ప్రాంతాలకు తీసుకెళ్లి వారి వద్ద నుంచి డబ్బులు లాక్కొనే ఇద్దరు మహిళలను లాలాగూడ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఇన్స్పెక్టర్ రఘు బాబు తెలిపిన వివరాల ప్రకారం.... మల్కాజ్గిరి ప్రాంతానికి చెందిన భాగ్య(44), సఫిల్గూడకు చెందిన వెన్నెల(20)లు బందువులు. అయితే, వీరు కొంత కాలంగా వాహనాలపై వెళ్తున్న వారిని లిఫ్ట్ అడుగుతూ వారిని నిర్మానుష్య -ప్రాంతాలకు తీసుకెళ్తుంటారు. అక్కడ సదరు వాహనదారులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తారు. డబ్బులివ్వకపోతే తమను బలాత్కారం చేసేందుకు చూస్తున్నాడని భయపెడుతూ డబ్బులు లాక్కునే వారు. ఈ క్రమంలో టీజీ జెన్కోలో పని చేసే ఓ ఉద్యోగి నవంబర్ 6వ తేదీన సాయంత్రం 6:30 గంటలకు ద్విచక్ర వాహనంపై నాగారంలోని తన ఇంటికి వెళ్తున్నాడు. తార్నాక బస్టాండ్ వద్ద ఉన్నటువంటి భాగ్య సదరు వాహనదారుడిని లిఫ్ట్ అడిగింది. లాలాపేటలోని జీహెచ్ఎంసీ గ్రౌండ్ వద్దకు తీసుకెళ్లి డబ్బులు డిమాండ్ చేసింది.

అతను ఇవ్వనంటే తనను బలవంతం చేసి ఇక్కడికి తీసుకొచ్చావని పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించి ఫోన్ పే ద్వారా రూ.95 వేలు పంపించుకుంది. ఆ తరువాత కూడా అతనితో పాటు కుషాయిగూడకు వెళ్లి ఏటీఎం ద్వారా రూ.55 వేలు కూడా విత్ డ్రా చేయించి లాక్కుంది. అంతే కాకుండా ఈ నెల 3న భాగ్య తన బంధువులైన వెన్నెలతో సదరు వ్యక్తికి ఫోన్ చేయించి డీటీడీసీ కొరియర్ వచ్చిందని, కుషాయిగూడ డీమార్ట్ వద్దకు వచ్చి తీసుకెళ్లమని చెప్పింది. దీంతో నిజమేమో అనుకొని అక్కడికి వెళ్లిన అతన్ని వారిద్దరు పట్టుకొని మళ్లీ బెదిరించి రూ. 1.7 లక్షలను ఫోన్ పే , ఏటీఎంల ద్వారా వసూలు చేశారు. సదరు వ్యక్తిని టార్గెట్ చేసిన వీరు మళ్లీ ఈ నెల 23న అతని ఇంటి వద్దకు వెళ్లి రెక్కీ నిర్వహించారు. ఈ విషయం తెలుసుకున్న అతను లాలాగూడ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకొని జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించారు. వీరిద్దరిపై ఇది వరకు పలు పోలీస్ స్టేషన్లలో ఇదే విధమైన ఎక్స్ట్రార్ధన్ కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story