"గమన్" (1976).. ఒక చక్కటి చూడతగిన సినిమా

by Gantepaka Srikanth |   ( Updated:2025-01-02 12:56:19.0  )
గమన్ (1976).. ఒక చక్కటి చూడతగిన సినిమా
X

ఈ సినిమా చూసిన తరువాత, ఎవరికైనా సరే "మనం ఎంత అదృష్టవంతులం" అనిపించక తప్పదు. ఎందుకనో చివర్లో చెప్తాను.

అది సరే కానీ, అప్పటెప్పటి సినిమానో, దాదాపుగా అర్ధ శతాబ్ధం పూర్వపు సినిమా గురించి ఇప్పుడేమిటోయ్ అంటే, ఒక్కటే సమాధానం. ఈ సినిమాను నేను చూసినది ఇప్పుడే కాబట్టి, అది కూడా యుట్యూబులో 2024 ఆగస్ట్ 24న అప్లోడ్ చేసిన తరువాత ఈ రోజునే(2025 జనవరి 2న) చూశాను కాబట్టి అని నా సమాధానం.

ఈ సినిమా:

*ఒక టాక్సీ డ్రైవర్, అతని గర్ల్ ఫ్రెండ్ ప్రేమ కథ;

*పెళ్ళయ్యిన తరువాత, ముంబాయికి బతుకు తెరువు కోసం వెళ్ళిన భర్త కోసం ఎదురు చూస్తున్న ఒక భార్య కథ;

*తన గ్రామంలో తల్లిని, భార్యను వదిలి ముంబాయి వచ్చిన ఒక అభాగ్యుడి కథ;

*సోదరి కష్టం మీద పడి బతుకుతున్న ఒక నికృష్టుడి కథ, పిచ్చెక్కిన వీళ్ళిద్దరి తండ్రి కథ;

మొత్తం వెరసి కొందరి నిర్భాగ్యుల కథ.

ఈ సినిమాలో అన్నిటికన్నా సంతోషకరమైన విషయం, పాటలన్నీ నేపథ్యంగా (Montage Songsగా) వచ్చేవే తప్ప ఎవ్వరూ పాడుతూ కనపడరు. నాలాంటివాడికి, అదొక పెద్ద రిలీఫ్. పైగా పాటల్లో విషాదభరితమైన పాటలు కూడా వినటానికి కమ్మగా ఉన్నాయి. కారణం ఏమిటా అని చూస్తే సంగీతం "జయదేవ్". ఆయన సంగీత సారధ్యంలో పాటలు బాగుండకపోతే అదొక విషయంగా చెప్పుకోవాలి కానీ, పాటలు మెలొడీతో నిండి ఉండటం సర్వ సామాన్యమైన విషయం. అందుకనే పాటలు అంత హాయిగా ఉన్నాయి. ఈ సినిమాకు జయదేవ్ గారికి ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ ఫిల్మ్ అవార్డు వచ్చింది.

నిజానికి, ఈ సినిమాలో ఛాయా గంగులీ అనే గాయని పాడిన "ఆప్ కి యాద్ ఆతీ రహీ" పాటకు, ఉత్తమ మహిళా నేపధ్య గాయని పురస్కారం నేషనల్ ఫిల్మ్ అవార్ద్ వారు ఆవిడకు ప్రదానం చేశారు. ఆ తరువాత ఆ గాయని ఏమయ్యారు?! మరెన్నో పాటలు పాడారా? లేదు. ఆవిడ ఆ తరువాత సినిమాలలో పాటలు పాడలేదు, ఆకాశవాణి, దూరదర్శన్‌లలో పనిచేసి 2012 లో పదవీ విరమణ చేశారుట. కాకపోతే 1990లో వచ్చిన "థోడాస రూమాని హోజాయె"(Let's Become A Little Bit Romantic) సినిమాకు టైటిల్ పాట పాడారని తెలుస్తున్నది.


ఇక్కడ తప్పకుండా నా మనసులో మాట పంచుకోవాలి. తాము పరిశ్రమకు వచ్చిన మొదట్లోనే ప్రేక్షక ఆదరణ పొందిన అదృష్టవంతులు ఇద్దరో ముగ్గురో ఉంటే, అటువంటి వారి జీవిత కాలం వాళ్ళనే వెర్రిగా అభిమానిస్తారు మన ప్రేక్షకులు. ఇక దేశంలో మరెవ్వరి దగ్గర ప్రతిభే లేనట్టు ప్రవర్తిస్తారు. ఆ కారణానే, దశాబ్దాలుగా సినిమా పాటల సామ్రాజ్యాన్ని కొందరు మాత్రమే ఏలారు, ఏలగలిగారు, మరెవ్వరూ రాలేదు, గిట్టనివాళ్ళు రానివ్వలేదంటారు. ఏది ఏమైనా, ఆ గొప్ప గాయనీ గాయకులు పోయిన తరువాత ఏమయ్యింది!?

ఇప్పుడు సినిమాలలో పాట ఒక మూఢాచారం అయి కూచున్నది తప్ప, అతి కొద్ది సినిమాలలో తప్ప (కెన్ కౌంట్ ఆన్ ది ఫింగెర్స్ ఆఫ్ అవర్ వన్ హాండ్) ఉండవలసిన శ్రావ్యత, సందర్భ శుధ్ధి లోపించి డ్రిల్లుకు ఎక్కువ సర్కస్‌కు తక్కువ అయ్యి, నిర్మాతల మెడకు గుదిబండ అయి కూచున్నది. గుదిబండ ఎందుకు? అవును మరి పాటన్నాక హీరో, హీరోయిన్లే కాక బోలెడు మంది ఎగురుతుంటారు, ఆపైన చరణానికి ఒక లోకేషన్, వీలైతే మాటకొక లొకేషన్‌,(డ్రస్సులు కూడా మార్చేస్తూ యూనిఫారం లాగా ఇదే రకపు దుస్తులు ధరిస్తుంటారేమిటో మరి!) ఈ పాటల లొకేషన్లు ఎక్కువ భాగం విదేశాలల్లో. దీనికోసం అంటే, నిర్మాత సినిమా మొత్తానికి అయ్యే ఖర్చులో సగ భాగం పాటలు తియ్యటానికి పెట్టాల్సివస్తున్నదని చెప్పుకుంటూ ఉంటారు మరి. అందుకని! ఈ పాటలన్నీ డ్రీం సీక్వెన్సులుగా చెలామణి చెయ్యాలి తప్ప, మరొక రకంగా అయితే పాటలో అంతంత మది ఎగరటం కథా పరంగా ఎలా సమర్ధించగలరు?

సరే మళ్ళీ సినిమాలోకి వస్తే, "గమన్" అంటే తెలుగులో గమనం, అర్ధాత్ ప్రయాణం. పైన ఉదహరించిన వారి ప్రయాణం. దర్శకుడు ముజఫర్ ఆలీకి మొట్టమొదటి సినిమా అయినప్పటికీ, చాలా బాగా ఈ సినిమాను తీసి చూపించాడు. ఈ సినిమా తియ్యటంలో ఆయన చూపిన దర్శక ప్రతిభకు జాతీయ ఫిల్మ్ ప్రత్యేక ప్రస్తావన పురస్కారం అందుకున్నారు. కానీ, పాపం ఈ సినిమా తరువాత మరి మూడు సినిమాలే (IMDB Data Base ప్రకారం) తియ్యగలిగాడు, అందులో చివరిది "జానిసార్" 2015 లో తీశాడు. నిజమైన ప్రతిభకు మనం ఇచ్చే గౌరవం అది. పోన్లెండి, ఊరికే తెగ తీసి స్టేల్ అయిపోయి తెర మరుగు అవ్వకుండా, "ఉమ్రావ్ జాన్(1981)" వంటి అద్భుతాన్ని కూడా సృష్టించినది ఈ దర్శకుడే అని చెప్పుకోవటానికి వీలయ్యింది తప్ప ఉమ్రావ్ జాన్(1981) సినిమా తీసిన ఇతనేనా ఈ చెత్తంతా తీసినది అని ఆశ్చర్య పడే అవకాశం ఆయనకు రాకపోవటం ఆయన అదృష్టం.

ఏమిటండీ మీ స్వగతాలూ, సినిమా గురించి చెబుతానని పిలిచి అనేగా మీ ఫిర్యాదు. సరే! ఇది మంచి సినిమా అని ఎందుకు అన్నాను అంటే, సినిమాలో ఒకానొక చోట గులాం హసన్‌గా వేసిన ఫారూక్ షేక్ తన స్నేహితుడు లల్లూలాల్ తివారీ(పైన ఉదహరించిన టాక్సీ డ్రైవర్ అతని గర్ల్ ఫ్రెండ్ జంటలో ఒకాయన) మరణించినప్పుడు ఏడుస్తుంటే, మనకూ ఏడుపు వస్తుంది. అంతలా కథలో లీనమై పోతాము.

అన్నట్టు మర్చిపోయాను, ఇప్పటి ప్రముఖ నటుడు నానా పాఠెకర్‌కు ఇది మొదటి సినిమా. అదే మొదటి సినిమా అవటం వల్ల కాబోలు వీలైనంత సహజంగా నటించాడు. ఈ సినిమాలో ఆయన నటన చూసిన తరువాత, ఇప్పటి నానా పటేకర్ నటనతో పోల్చి చూసి ఈయనేనా తన మొదటి సినిమాలో ఇంత హాయిగా నటించాడు అనుకోకుండా ఉండలేము. ముంబాయిలో గులాం హసన్‌ స్నేహితుడు లల్లూలాల్ తివారీ పాత్రలో కనిపించినది జలాల్ ఆగా. ఇంకా ఈ సినిమాలో పాపం స్మితా పాటిల్ కూడా ఉన్నది కానీ, డైలాగులు పెద్దగా లేని పాత్ర, గులాం హసన్ భార్య పాత్ర, ఆమె గొంతు ఉత్తరం చదువుకుంటూ/చదువుతూ వినపడటం తప్ప, తెరమీద మాట్లాడుతూ కనపడినది చాలా తక్కువ. లల్లూలాల్ తివారీ గర్ల్ ఫ్రెండ్ యశోధరగా (అతను మాత్రం జశోధర అని పిలుస్తూ ఉంటాడు) నటించినావిడ గీతా సిధ్ధార్థ్. అలా కనిపించి మెరిసి వెళ్ళిపోయే పాత్రల్లో ప్రతిమా బేడి, సతీష్ షా, ఇద్దరూ కూడా టాక్సీ ఎక్కిన పాసెంజర్లుగా నటించారు.

సినిమా విషాదభరితమే అయినా కూడా, సినిమా తీసిన విధానం ఇదిగో చూడండి ఎంతటి విషాదాన్ని అందిస్తున్నామో అన్నట్టు విపరీతమైన వయెలిన్‌తోనూ సారంగీతోనూ విపరీతమైన బిజిఎం ఉండదు. అక్కడ నిజంగా జరుగుతున్నది మనం చూస్తున్నట్టుగా తీసి చూపారు దర్శకుడు. ఒక ముసలాయన గులాం హసన్‌ నడిపే టాక్సీ ఎక్కి చక్కటి హాస్యాన్ని అందిస్తాడు. "ఇదిగో అబ్బాయ్ ఏమిటా స్పీడు అని కాసేపు, ఏమిటిది మరీ ఇంత మెల్లిగానా, నీకు టాక్సీ డ్రైవింగ్ లైసెన్స్ కాదు లాగుడుబండి లైసెన్సు ఇవ్వాలని కాసేపు, ఇలా అయితే నేనేమయిపోవాలి, పైగా నా స్పేర్ పార్ట్లు దొరకవు కూడానూ అంటూ టాక్సీలో ఉన్నంతసేపూ మాట్లాడుతూనే ఉండి హాస్య రసం బాగా పోషించాడు.ఆ నటుడి పేరు దిన్షా దాజీ.

కథేమిటో చెప్పనే లేదు. ఏమున్నదండీ, సినిమా మొత్తం పైన మొదట్లో చెప్పిన వారి పేదరికపు బాధ, ఆ నాలుగోవాడి దుష్టత్వం. సినిమా రచయితలు, చేతిలో పనే కదా అని ఉన్నవి లేనివి కష్టాలను పుంజీలకు పుంజీలు సృష్టించి పారేసి, ఇవ్వి నిజమేనా అని ప్రేక్షకులకు ఏవగింపు కలిగి చూడటం మానేసేట్టు చెయ్యకుండా, ఈ సినిమాలో రచయిత, పాత్రలకు వచ్చే కష్టాలను అదుపులో ఉంచి చూసేవారి మనసుకు అయ్యో పాపం అనుకునేంత వరకే ఆ కష్టాలు "పెట్టారు".


దర్శకుడికి సజెషన్ షాట్స్ మీద ప్రీతి ఎక్కువనుకుంటాను, సినిమాలో రెండుసార్లూ పాత్ర మరణించటాన్ని ఆకాశంలో విమానం ఎగిరిపోతుండటంతో సూచిస్తాడు. సినిమాలో షాట్లు కూడా చాలా పొదుపుగా ఉన్నాయి. ఎక్కడా అతి అనిపించదు. స్టుడియో షాట్లే లేవు, అంతా ఔట్‌డోర్‌లోనే, ఎంచుకున్న లొకేల్సులోనే, వెరసి మొత్తం ముంబాయిలోనే (మొదట్లో కాసేపు తప్ప).

ముఖ్యంగా ముంబాయి మహా నగర అంతర్భాగపు పేదరికాన్ని ఈ సినిమాలో యదార్ధంగా చూపారు. 1970ల ప్రాంతపు ముంబాయిని ఈ సినిమాలో చూడవచ్చు, ఆ ముంబాయి కూడా అక్కడున్న మురికివాడలను, అక్కడ నివసించేవారి కష్టాలను చూపారు. నేను మొదటిసారి ముంబాయికి వెళ్ళినది 2002, అక్కడ పన్నెండేళ్ళు నివసించాను. ఇప్పటికీ మురికి వాడల్లో ఉండేవారి కష్టాలు పూర్తిగా తీరిపోలేదు. కానీ, వాటిల్లో కొన్ని కొన్ని ఇళ్ళకు ఏసిలు వచ్చాయి, డిష్ యాంటిన్నాలు వచ్చాయి తప్ప ఆ మురికి వాడలు మాయం అవ్వలేదంటే, ఇళ్ళ కొరత దేశ ఆర్ధిక రాజధాని ముంబాయిలో ఎంతగా ఉన్నదో అర్ధం చేసుకోవచ్చు.

ఇంతంత రాశారు కదా, సినిమా చివరకు ఏమవుతుందో అదన్నా చెప్పండీ. ఏమీ అవదు. సినిమా ఒక దశకు వచ్చి ఆగిపోతుంది. తన గ్రామంలో తల్లి, భార్య పడే కష్టాలు ఉత్తరాల ద్వారా తెలుసుకుని, దూరాభారమైన ఆ ప్రయాణం చెయ్యటానికి సరిపోయే డబ్బులు లేక, అవి సమకూర్చుకునే అవకాశం లేక, తన ఊరు వెళ్ళే రైలు వంక ఆశగా చూస్తున్న గులాం హసన్, అతని హావభావాలతో సినిమా ముగుస్తుంది. మిగిలిన వారేమయ్యారు? వారి కథేమయ్యింది? దర్శకుడు చెప్పలేదు. ఎందుకు చెప్పాలి, అవేమన్నా తీరే కష్టాలైతే, ఫలానా ఫలానా పాత్ర కష్టాలు ఇలా తీరాయి, (పైగా ఫలానావాడు ఆ పాత్ర నటించాడు కాబట్టి) అని చెప్పొచ్చు. కానీ తీరే కష్టాలు కావని దర్శకుడికి తెలుసు, ఏదో ఫాంటసీ సినిమా అయితే, ఏ "బిగ్ బీ" నో ఒక పాత్రకు తీసుకుని చిటికెలో అన్ని కష్టాలూ తీరిపోయినట్టు చూపించాలన్న అభిమతం ఆ దర్శకుడి "శైలి" కాదనుకుంటాను.

తప్పక చూడవలసిన సినిమా 'గమన్'. ఇది కూడా ఫీల్ గుడ్ సినిమానే, ఎందుకు అంటే, మొదట్లోనే చెప్పినట్టు సినిమా చూసిన తరువాత, ఆ సినిమాలోని పాత్రల కంటే మనం ఎంత అదృష్టవంతులం అనిపిస్తుంది. అందుకని ఈ సినిమా తప్పకుండా ఫీల్ గుడ్ సినిమానే.

ఈ సినిమా యుట్యూబులో చూడవచ్చు. లింకు ఈ కింద ఇస్తున్నాను:



శివరామప్రసాదు కప్పగంతు

రిటైర్డ్ బాంకు మానేజరు

(Video Credit to Eye Bound Retro YouTube Channel)

Advertisement

Next Story

Most Viewed