హడలెత్తిస్తున్న హైడ్రా

by Sridhar Babu |
హడలెత్తిస్తున్న హైడ్రా
X

దిశ, శేరిలింగంపల్లి : హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అసెట్స్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ ( హైడ్రా) ఇప్పుడు ఈ పేరు వినిపిస్తే చాలు అక్రమ నిర్మాణదారులు, బఫర్, ఎఫ్టీఎల్ లో నిర్మాణాలు చేపట్టిన వారు హడలిపోతున్నారు. ఎప్పుడు వస్తారో.. ఎక్కడ కూలుస్తారోనని బెంబేలెత్తుతున్నారు. గత కొద్దిరోజులుగా నగరంలో ఎక్కడ నాలాలను అక్రమించి నిర్మాణాలు చేపట్టినా, చెరువులను అక్రమించి కట్టినా వాటిని గుర్తించి జేసీబీలు, బుల్డోజర్లను రంగంలోకి దించి కూల్చివేతలు చేపడుతున్నారు. సెలవు రోజు,

పండుగలు అనేది కూడా పట్టించుకోకుండా హై స్పీడ్ లో దూసుకుపోతుంది హైడ్రా.. ఇప్పటికే నగరంలో శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్‌, కుత్బుల్లాపూర్‌, జూబ్లీహిల్స్‌ ఇలా అన్నిచోట్ల ఆక్రమణల తొలగింపే లక్ష్యంగా హైడ్రా టీమ్స్‌ యాక్షన్‌లోకి దిగాయి. ప్రభుత్వం కూడా హైడ్రాకు ఫుల్ పవర్స్ కట్టబెట్టడంతో పాటు కమిషనర్ రంగనాథ్ కూడా ఫిర్యాదులు అందిన వెంటనే సంబంధిత చెరువులు, నాలాలను పరిశీలించి అప్పటికప్పుడే చర్యలకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. దీంతో హైడ్రా మరింత వేగంగా పనిచేస్తుంది.

చెరువులు నాలాలపై నజర్..

హైదరాబాద్ మహానగరం రోజురోజుకు విస్తరిస్తున్న తరుణంలోనే నగరంతో పాటు చుట్టుపక్కల ఉన్న చెరువులు, కుంటలు, నాలాలు క్రమంగా కబ్జాలకు గురవుతూ వస్తున్నాయి. ఇప్పటికే చాలా చెరువులు నామరూపాలు లేకుండా పోయాయి. భూగర్భ జలాలు తగ్గిపోవడంతో ప్రతీయేటా వేసవికి ముందే నగరంలో పలుచోట్ల తాగునీటి ఎద్దడి తలెత్తుతుంది. అటు పర్యావరణ సమతుల్యత కూడా దెబ్బతింటుంది.

వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అసెట్స్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ ( హైడ్రా )ను తెరమీదకు తెచ్చింది. ఐపీఎస్ ఏవీ రంగనాథ్ ను కమిషనర్ గా నియమించి విశేష అధికారాలు అప్పగించింది. ప్రత్యేకంగా ఓ టీమ్ ను ఏర్పాటు చేసి చెరువులు, కుంటలు, నాలాల పరిరక్షణపై దృష్టి పెట్టారు.

యాక్షన్ స్టార్ట్

జీహెచ్ఎంసీతో పాటు చుట్టుపక్కల కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో చాలా చెరువులు 60 శాతం వరకూ కబ్జాకు గురైనట్టు హైడ్రా అధికారులు ఇప్పటికే లెక్కలు తేల్చారు. వాటి పరిరక్షణకు హైడ్రా యాక్షన్ మొదలుపెట్టింది. ఇందులో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం హఫీజ్ పేట్ డివిజన్ వైశాలి నగర్ లో ఎఫ్టీఎల్ లో నిర్మించిన మూడు నిర్మాణాలను నేలమట్టం చేశారు. మిగతా చోట్ల కూడా హైడ్రా దూకుడుగా వ్యవహరిస్తుంది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాలనూ కూల్చివేస్తున్నారు. పొలిటికల్‌ ఒత్తిళ్లకు తావులేకుండా ఎక్కడైతే ఆక్రమణలు కనిపించాయో వాటిపై కొరడా ఝుళిపిస్తున్నారు.

శేరిలింగంపల్లిలో నాలాలు, చెరువుల్లో నిర్మాణాలు

శేరిలింగంపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా చెరువులు, కుంటలు, నాలాలపై వేలాది నిర్మాణాలు ఉన్నాయి. ఇది వరకే పలు చెరువులు కనుమరుగు కాగా మిగిలి ఉన్న చెరువులు సైతం కబ్జాకోరల్లో చిక్కుకున్నాయి. చెరువు స్థలాలు అని తెలిసినా మున్సిపల్ అధికారులు అనుమతులు జారీ చేశారు. నాలాలపై నిర్మాణాలు సాగించినా మిన్నకుండి చూస్తున్నారు. టూరిస్ట్ స్పాట్ దుర్గం చెరువు చుట్టూ నిర్మించిన అక్రమ భవనాలకు,

అపార్టుమెంట్లకు బుధవారం హైడ్రా సిబ్బంది నోటీసులు జారీచేశారు. మాదాపూర్ కావూరిహిల్స్ లోని పలు భవనాల యజమానులకు నోటీసులు అందజేశారు. నోటీసు అందిన నెల రోజుల్లోగా అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలంటూ హైడ్రా అధికారులు ఆదేశించారు. గంగారం పెద్ద చెరువు, బచ్చుకుంటతో పాటు ఇరిగేషన్ అధికారులు గుర్తించిన శేరిలింగంపల్లి మండల పరిధిలోని 41 చెరువులు, నాలాల స్థలాలు చాలా వరకు కబ్జాలకు గురయ్యాయి. వీటిపై హైడ్రా కమిషనర్ దృష్టి పెట్టాలని పర్యావరణ వేత్తలు, ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Next Story