'చేసే ప‌నిలో నిజాయితీ ప్రతిబింబిస్తే గుర్తింపు త‌ప్పకుండా వ‌స్తుంది'

by Vinod kumar |
చేసే ప‌నిలో నిజాయితీ ప్రతిబింబిస్తే గుర్తింపు త‌ప్పకుండా వ‌స్తుంది
X

దిశ, ముషీరాబాద్: ప్రయాణీకుల‌ను సుర‌క్షితంగా గ‌మ్యస్థానాల‌కు చేర‌వేస్తూనే విధి నిర్వహ‌ణలో సామాజిక బాధ్యత‌, మాన‌వ‌తా దృక్ఫథంతో వ్యవ‌హ‌రించిన సంస్థ సిబ్బందికి త‌ప్పక గుర్తింపు ఉంటుంద‌ని టీఎస్‌ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ విసి స‌జ్జనర్‌ అన్నారు. హైదరాబాద్ బాగ్‌ లింగంప‌ల్లి ఆర్టీసి క‌ళా భ‌వ‌న్‌లో బుధవారం జరిగిన ఎక్స్ ట్రా మైల్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి ఆయ‌న ముఖ్య అతిథిగా హాజ‌రై సిబ్బందికి శాలువా, ప్రశాంసా ప‌త్రాలు అంద‌జేసి ఘ‌నంగా స‌న్మానించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. చేసే ప‌నిలో నిజాయితీ ప్రతిబించడంతో సంస్థకు మ‌రింత ప్రాధాన్యత‌ పెరుగుతుంద‌న్నారు.

బ‌స్సులో ప్రయాణీకులు మ‌ర‌చిపోయిన విలువైన వ‌స్తువుల‌ను తిరిగి వాటిని భ‌ద్రంగా అప్పగించి సామాజిక బాధ్యత‌ను చాటుకున్న ఉద్యోగుల సేవ‌లు మ‌రవ‌లేనివ‌ని కొనియాడారు. ఉత్తమ సేవ‌లు అందించే సిబ్బందే సంస్థకు బ్రాండ్ అంబాసిడ‌ర్‌ల‌ని అభివ‌ర్ణించారు. డ్యూటీ స‌మ‌యంలో సామాజిక సేవా భావంతో స్పందించడం గొప్ప విష‌య‌మంటూ, గోల్డెన్ అవ‌ర్‌లో కొంద‌రి ప్రాణాల‌ను కూడా కాపాడ‌గ‌ల‌గ‌డం సిబ్బంది స్ఫూర్తికి నిద‌ర్శన‌మంటూ వారిని అభినందించారు. ఇలాంటి వారికి సంస్థలో త‌గిన ప్రోత్సాహం, గుర్తింపు ఇవ్వాల‌నే ఉద్దేశంతో ప్రతి రెండు నెల‌ల‌కొక‌సారి ప్రత్యేకంగా స‌న్మానించ‌డం జ‌రుగుతోంద‌ని తెలిపారు.

సిబ్బంది శ‌క్తి, సామార్ధ్యాల‌తోనే సంస్థ పురోభివృద్ధి ముడిప‌డి ఉంద‌నే విష‌యాన్ని మ‌ర‌చిపోకూడ‌ద‌న్నారు. రానున్న కాలంలో సంస్థకు మంచి రోజులు రాబోతున్నాయ‌న్నారు. ప్రయాణ స‌మ‌యంలో కొంద‌రి జీవితాల‌ను కాపాడిన 12 మంది ఉద్యోగుల‌కు శాలువా, ప్రశంసా ప‌త్రాల‌ను అంద‌జేశారు. అలాగే, విలువైన వ‌స్తువుల‌ను తిరిగి ప్రయాణీకుల‌కు అప్పగించిన దాదాపు 130 కి పైగా ఉన్న సిబ్బందికి ప్రశాంసాప‌త్రాల‌తో స‌న్మానించి వారి సేవ‌ల్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఆప‌రేటింగ్ ఆఫీస‌ర్ ర‌వింద‌ర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు శ్రీ మునిశేఖ‌ర్, పురుషోత్తం, యాద‌గిరి, చీఫ్ ప‌ర్సన‌ల్ మేనేజ‌ర్ కృష్ణకాంత్, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

Next Story