శిక్షణ పట్టు... ఉద్యోగం కొట్టు...

by Sumithra |
శిక్షణ పట్టు... ఉద్యోగం కొట్టు...
X

దిశ, మియాపూర్ : యువత తాము చదువుకున్న చదువుతో పాటు ఆయారంగాల్లో నైపుణ్యం కలిగి ఉంటేనే ఉద్యోగాన్వేషణలో సఫలీకృతులయ్యే అవకాశాలు మెండుగా ఉంటున్నాయి. అలాంటి నైపుణ్యాన్ని మేం అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపుతామని ముందుకు వచ్చింది లైట్ హౌస్' కమ్యూనిటీ ఫౌండేషన్. జీహెచ్ఎంసీ సహకారంతో లైట్ హౌస్ ఫౌండేషన్ తమ తొలి కేంద్రాన్ని చందానగర్ లో ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యంగా పదోతరగతి ఆ పైన చదివి ఖాళీగా ఉంటున్న వారినే లక్ష్యంగా చేసుకొని ముందుకు సాగుతున్నారు. వారి ఉత్సాహం మేర ఆయా రంగాల్లో శిక్షణ తరగతుల ద్వారా మెలకువలు, నైపుణ్యం అందించి జీవనోపాధి కల్పనలో చేయూతను ఇవ్వనున్నారు.

మురికి వాడల్లోని యువతే లక్ష్యంగా ఏర్పాటు..

ముఖ్యంగా వీకర్ సెక్షన్ కాలనీలైన పాపిరెడ్డి కాలనీ, శాంతినగర్, ఇందిరానగర్ బస్తీలలో యువత అధికంగా ఉండటంతో చందానగర్ అనువైన ప్రాంతంగా గుర్తించారు. ఇందుకు చందానగర్ సర్కిల్ ఉపకమిషనర్ హుడాకాలనీ చందానగర్ ఎంఎంటీఎస్ రైల్వేస్టేషన్ వద్ద నిరుపయోగంగా ఉన్న జీహెచ్ఎంసీ మోడల్ మార్కెట్ భవనాన్ని పరిశీలించి అనువైన ప్రాంతంగా ఎంపిక చేశారు. భవనానికి మార్పు చేర్పులు, కొత్త హంగులు కల్పించేందుకు సీఎస్ఆర్ కింద ప్రిన్సిపల్ గ్లోబల్ సర్వీ సెస్ సంస్థ ముందుకురాగా రూ.80 లక్షలతో అదునాతన వసతులు, సకల హంగులతో తీర్చిదిద్దారు. కార్పొరేట్ కార్యాలయాల స్థాయిలో గదులు ఏర్పాటు చేశారు. మహిళల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ అన్ని చోట్ల సీసీ కెమెరాలు అమర్చారు.

కార్యాలయంలో ముందుగా ఫ్రెంట్ ఆఫీస్, ఐటీ సంస్థలో శిక్షణ కోసం కంప్యూటర్ల గది, పై అంతస్తులో టైలరింగ్, వసతులు కల్పిస్తున్నారు. ఫ్యాషన్ టెక్నాలజీ, మరోచోట బ్యూటీ పార్లర్ కేంద్రం, ట్రైనింగ్ సెంటర్, కౌన్సిలింగ్ సెంటర్ విడివిడిగా గదులు నిర్మించారు. సెంటర్ కార్యకలాపాల నిర్వహణ చూసేందుకు లైట్ హెడ్ మేనేజర్, స్కిల్ డెవలప్మెంట్ మేనేజర్, ప్లేస్మెంట్ కోఆర్డినేటర్, ప్యాషన్ టెక్నాలజీ, కంప్యూటర్ రంగాల నిపుణలు, యువతను గుర్తించి వారి భవిత కోసం అవగాహన కల్పించే కో అర్డీ నేటర్, వారి సహాయకులు మొత్తం కలిపి 8 మంది ఉద్యోగులు వివిధ రకాల సేవలు అందిస్తారు.

అర్హత.. శిక్షణ వివరాలు..

మురికి వాడలకు చెంది 18 నుంచి 35 వయసు గల యువతీయువకులు కనీసం పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఆ తరువాత డిగ్రీ, బీటెక్ ఎంతవరకు చదివినా వారికి తగిన కోర్సును ఎంపిక చేసి శిక్షణ ఇస్తారు. ఉ.9 గంటలకు. మ 2 గంటలకు రెండు బ్యాచ్లుగా శిక్షణ తరగతులు ఉంటాయి. 3 నెలలపాటు ఎంచుకున్న రంగంలో పట్టు సాధించేలా మెలకువలు నేర్పిస్తారు.

నిపుణులైన వారిచే కౌన్సిలింగ్..

బస్తీల్లో పది లేదా డిగ్రీ వరకు చదివిన వారిని గుర్తించి వారు సెంటర్ కు వచ్చేలా అవగాహన కల్పిస్తారు. వ్యక్తిత్వ వికాసం, డిజిటల్ అక్షరాస్యత, స్పోకెన్ ఇంగ్లిష్, కెరీర్ కౌన్సి లింగ్, కౌన్సిలింగ్ ఆధారంగా వృత్తి నైపుణ్యం కోర్సు, ఉపాధి అవకాశాలు లాంటి అంశాలపై అవగాహన కల్పిస్తారు. ఐ.టీ పరిశ్రమలు, టైలరింగ్, బ్యూటీపార్లర్, రీటైల్ స్టోర్స్, హెల్త్, హాస్పిటాలిటీ, కార్యాలయం- నిర్వహణ, ఆటోమొబైల్, హార్డ్వేర్, గ్రీన్ ఎనర్జీ సోలార్, డ్రైవింగ్ విభాగాల్లో శిక్షణను అందించనున్నారు.

Advertisement

Next Story