సమన్వయ లోపమా.. సహకరించలేదా?

by Mahesh |
సమన్వయ లోపమా.. సహకరించలేదా?
X

దిశ, సిటీ బ్యూరో : సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ పార్టీ రెండో స్థానంతో సరిపెట్టుకోవడంపై ఆ పార్టీ క్యాడర్ కారణాలను అన్వేషిస్తుంది. అధికార పార్టీ అభ్యర్థిగా బరిలో దిగిన ఖైరతాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఓటమికి పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల కాంగ్రెస్ నేతలతో తలెత్తిన సమన్వయ లోపమా లేక పార్టీ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ గూటికి చేరినందుకు పలు నియోజకవర్గాల నేతలు ఆయనకు సహకరించనందుకే ఆయన అపజయం పాలయ్యారా? అన్నది హాట్ టాపిక్ గా మారింది. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోకి వచ్చే నాంపల్లి, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, సనత్ నగర్, సికింద్రాబాద్, ముషీరాబాద్, అంబర్ పేట అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ పార్టీ నేతలతోనే గాక, ఇతర పార్టీల నేతలతో దానం నాగేందుకు మంచి సంబంధాలున్నాయి. ఆసిఫ్ నగర్ నుంచి మూడు సార్లు , ఖైరతాబాద్ నుంచి ఏకంగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్‌కు ఈ పార్లమెంట్ నియోజకవర్గంపై బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి కన్నా ఎక్కువ పట్టే ఉందని చెప్పవచ్చు.

దానం ఆసిఫ్ నగర్ ఎమ్మెల్యేగా ఉన్నపుడే అప్పట్లో జరిగిన పలు పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన పార్లమెంట్ అభ్యర్థి విజయానికి సమీకరణలు చేశారు. ఆ తర్వాత 2002లో ఆయన నగర మేయర్ గా కూడా పోటీ చేసి అపజయం పాలయ్యారు. నాటి నుంచి నేటి వరకు ఆయనకు పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఏ సెగ్మెంట్ లో ఏ పార్టీ కీలకం, సామాజిక వర్గాల వారీగా ఎవరితో ఎన్ని ఓట్లు వర్కవుట్ చేయాలన్న విషయం బాగానే తెలిసిన నాగేందర్ ఎందుకు విజయం సాధించలేదన్న విషయంపై పార్టీలో విస్తృతంగా చర్చ జరుగుతుంది. సీఎం రేవంత్ నాగేందర్ తరపున ప్రచారం చేస్తూ, కేంద్రంలో వచ్చే ఇండియా కూటమి ప్రభుత్వంలో దానం కేంద్ర మంత్రి కూడా అయ్యే ఛాన్స్ ఉందన్న విషయాన్ని ఓటర్లు, పార్టీ నేతలు వద్దకు తీసుకెళ్లినా, నాగేందర్ ఎందుకు గెలవలేదన్నది నియోజకవర్గం స్థాయి నేతలకు కూడా అంతుచిక్కడం లేదు. 1994లో ఆసిఫ్ నగర్ ఎమ్మెల్యేగా గెలిచిన నాగేందర్ కు కనీసం 30 ఏళ్ల తర్వాతనైనా ఎంపీగా ప్రమోషన్ వస్తుందని భావించిన ఆయన అనుచరగణానికి పార్టీలోనే నేతల అనైక్యత నిరాశే మిగిల్చింది.

నేతలతో గ్యాపే కారణమా?

నాగేందర్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన తర్వాత అసెంబ్లీ సెగ్మెంట్లకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇన్ ఛార్జిలుగా వ్యవహరిస్తున్న నేతలతో వచ్చిన గ్యాప్ ఆయన ఓటమికి కారణమైందని కొన్ని నియోజకవర్గాల్లో చర్చ లేకపోలేదు. ఆయన గతంలో ప్రాతినిధ్యం వహించిన ప్రస్తుత నాంపల్లి నియోజకవవర్గంలోనూ ఆయన తరపున ఓటర్లు వద్దకు వెళ్లి ఓటు అడిగే నేతలు లేకపోవడం ఒక కారణమైతే, ఆయన ఆసిఫ్ నగర్ ఎమ్మెల్యేగా వ్యవహరించినపుడు పలు ప్రాంతాలకు ఇచ్చిన వాగ్దానాలు, హామీలను నెరవేర్చకపోవటం ఆయన ఓటమికి మరో కారణంగా చెప్పవచ్చు. పార్లమెంట్ ఎన్నికల నాటికి హైదరాబాద్ జిల్లాలో ఒక్క అసెంబ్లీ సీటు లేని కాంగ్రెస్ పార్టీ నాగేందర్‌ను గెలిపించుకునేందుకు క్యాడర్ మొత్తం కలిసి పని చేయలేదనే టాక్ లేకపోలేదు. ఎంపీగా నాగేందర్ విజయం సాధించక పోయినప్పటికీ, బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డికి గత ఎన్నికల కన్నా తక్కువ మెజార్టీ రావటాన్ని ఆయన వర్గీయులు సమర్ధించు కుంటున్నట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed