ఉద్యోగుల్లో బదిలీల టెన్షన్.. కిటకిటలాడుతున్న సంఘాల కార్యాలయాలు

by Anjali |
ఉద్యోగుల్లో బదిలీల టెన్షన్.. కిటకిటలాడుతున్న సంఘాల కార్యాలయాలు
X

దిశ , హైదరాబాద్ బ్యూరో: ఏండ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఉద్యోగ, ఉపాధ్యాయుల్లో టెన్షన్ మొదలైంది. కోరుకున్న చోట పోస్టింగ్ దక్కుతుందో, లేదోననే ఆందోళన చెందుతున్నారు. ఉద్యోగుల సాధారణ బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 4వ తేదీన జీఓ నంబర్ 80 జారీ చేసింది. దీని ప్రకారం 5వ తేదీ నుంచి 20వ తేదీ వరకు బదిలీలు కొనసాగనున్నాయి. ఒకే చోట నాలుగేండ్లుగా పని చేస్తున్న వారిని తప్పనిసరి బదిలీ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే . ఇందులో భాగంగా ఒక్కో శాఖలో 40 శాతం మేర బదిలీలకు అనుమతి ఇవ్వడంతో జిల్లాలో ఇక ఉద్యోగ, ఉపాధ్యాయులు బదిలీ కానున్నారు.

గతంలో పలుమార్లు బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ ప్రయోజనం లేకపోగా తాజాగా ప్రభుత్వమే జీఓ జారీ చేయడంతో తమకు అనుకూలమైన చోటుకు వెళ్లేందుకు ప్రయత్నాలు మొదలెట్టారు. 2025 జూన్ 30 లోగా ఉద్యోగ విరమణ చేసే వారు స్వచ్ఛందంగా కోరుకుంటే తప్ప వారిని ట్రాన్స్‌ఫర్ చేయరు. అలాగా పని చేసే చోట రెండేళ్ల సర్వీస్ పూర్తి కాని వారిని బదిలీ చేయరాదని ప్రభుత్వం జీఓలో స్పష్టం చేసింది. అయితే ఏళ్లుగా ఒకే చోట పని చేస్తున్న వారికి స్థానచలనం తప్పని పరిస్థితులు ఉండడంతో వారు తప్పించుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. మరోవైపు జీఓ నంబర్ 317 కింద కేటాయింపులో అన్యాయం జరిగిందంటూ కొంతమంది ఉద్యోగులు ప్రభుత్వానికి ఆన్‌లైన్ దరఖాస్తలు చేసుకున్నారు. వారికి కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చే నివేదికను బట్టి మార్పులు జరిగే అవకాశం ఉంది .

ఉద్యోగ సంఘాల మెట్లు ఎక్కుతున్న ఉద్యోగులు

రాష్ట్రంలో టీఎన్జీఓ, టీజీఓ, నాలుగో తరగతి ఉద్యోగులు, డ్రైవర్స్ అసోసియేషన్ తో పాటు కొన్ని ఉపాధ్యాయ సంఘాలకు ప్రభుత్వం వద్ద గుర్తింపు ఉంది. ఆయా సంఘాల ఆఫీస్ బేరర్లకు బదిలీల నుంచి మినహాయింపు ఉంటుందని ప్రభుత్వం జారీ చేసిన జీఓలో స్పష్టం చేసింది. దీంతో స్థానచలనం గాకుండా ఉండేందుకు గాను సంఘాల నుంచి లెటర్లు పొందేందుకు ఆరాట పడుతున్నారు. గతంలో సంఘాల్లో పని చేసి మానేసిన వారు, ప్రస్తుతం పని చేస్తున్న వారే గాక సభ్యత్వాలు లేని వారు తమను బదిలీ కాకుండా చూడాలని సంఘాల అగ్రనేతలను ప్రాథేయ పడుతున్నారు. ఇటీవల వరకు ఖాళీగా కన్పించిన ఉద్యోగ సంఘాల కార్యాలయాలు ఇప్పుడు ఉద్యోగ, ఉపాధ్యాయుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి.

ప్రధాన యూనియన్ల అగ్రనేతల ప్రసన్నానికి కొందరు పడరాని పాట్లు పడుతున్నారు. ట్రాన్స్‌ఫర్లు పొందేందుకు కొంతమంది, ఆపుకొనేందుకు మరికొంతమంది ఉద్యోగులు అవసరమైతే లక్షలాది రూపాయలు వెచ్చించేందుకు ముందుకు వస్తున్నారని సమాచారం . అయితే సంఘాలతో సంబంధం లేని వారికి ఎట్టి పరిస్థితులో మినహాయింపు లేఖలను ఇచ్చేది లేదని, అటువంటి వారి పట్ల నిక్కచ్చిగా ఉంటామని యూనియన్ల అగ్రనేతలు స్పష్టం చేస్తున్నారు . ఇదిలా ఉండగా మంగళవారం నుంచి ఈ నెల 12వ తేదీ వరకు ప్రభుత్వం ఉద్యోగుల నుంచి ఆప్షన్లు తీసుకోనుంది. 13వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఉద్యోగుల నుండి వచ్చిన ఆప్షన్లను పరిశీలించి 19,20 తేదీలలో బదిలీల ఉత్తర్వులు జారీ చేయనున్నారు.

ఖాళీగా కనబడుతున్న కార్యాలయాలు

బదిలీల కోసం ఉద్యోగులు విధులకు గైర్వాజరవుతున్నారు. కొంతమంది సెలవులు పెడుతుండగా మరికొంత మంది అనధికారికంగా డుమ్మాలు కొడుతున్నారు. దీంతో జిల్లాలోని చాలా కార్యాలయాల్లో సగానికి పైగా ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి. ఈ నెల 20వ తేదీ వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశముందని, విధులకు హాజరౌతున్న ఉద్యోగులు చెప్పడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed