బీసీల న్యాయమైన హక్కులు సాధించడమే లక్ష్యం

by Sridhar Babu |
బీసీల న్యాయమైన హక్కులు సాధించడమే లక్ష్యం
X

దిశ, ముషీరాబాద్ : బీసీల న్యాయమైన హక్కులు సాధించడమే ఏకైక లక్ష్యంగా ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎంపీ ఆర్.కృష్ణయ్య అన్నారు. రాజకీయాలకు అతీతంగా దేశ వ్యాప్తంగా బీసీ ఉద్యమాన్ని విస్తరించడానికే రాజ్యసభ పదవికి రాజీనామా చేసినట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వైఎస్ఆర్ పార్టీ తరపున వచ్చిన రాజ్యసభ పదవికి రాజీనామా చేసిన సందర్భంగా ఆర్.కృష్ణయ్య విద్యానగర్ లోని బీసీ భవన్ లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. బలహీన వర్గాలకు న్యాయం జరిగేంత వరకు వివిధ పద్ధతులలో ఉద్యమాలు చేయడమే తమ విధానమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు న్యాయం చేయడం లేదని, 76 ఏళ్ల తరువాత కూడా చట్టసభల్లో వాటా కోసం పోరాడాల్సిన పరిస్థితి ఉందన్నారు.

ఆంధ్రప్రదేశ్ నుంచి మాజీ ముఖ్యమంత్రి జగన్ ఎంపీగా తనను రాజ్యసభకు నామినేట్ చేశారని, కానీ అక్కడ బీసీల కోసం ప్రశ్నించినా సమాధానం రాలేదన్నారు. రాజ్యసభ పదవీకాలం ఇంకా నాలుగేళ్లు ఉందని, హక్కుల సాధనకు ప్రజా ఉద్యమమే శరణ్యమని, భవిష్యత్ కార్యాచరణ కోసం పదవికి రాజీనామా చేశానని వివరించారు. రాజ్యధికారంలో వాటా కన్నా చట్టసభల్లో బీసీలకు 50 శాతం ఇవ్వాలని, కానీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బడుగులకు 21 సీట్లు మాత్రమే ఇచ్చారని గుర్తు చేశారు. జీవితంలో తాను అనేక పోరాటాలు చేశానని చెప్పిన కృష్ణయ్య బీసీల కోసం చాలా త్యాగాలు చేయాల్సి వస్తుందన్నారు. చట్టసభల్లో 50 శాతం వాటా కోసం పోరాటాన్ని ఉధృతం చేస్తామని, గ్రామ, మండల, జిల్లా కమిటీలు వేసి బీసీ సంఘాలను మరింత పటిష్టం చేస్తామన్నారు. తెలంగాణ ఉద్యమం తరహాలో రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి రావాలని కృష్ణయ్య పిలుపునిచ్చారు. దేశ వ్యాప్తంగా బడుగుల హక్కుల కోసం ఉద్యమిస్తామని చెప్పారు. సొంతంగా రాజకీయ పార్టీ పెట్టే నిర్ణయమేదీ తీసుకోలేదని ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

కాంగ్రెస్ పార్టీలోకి రావాలి

బీసీ భవన్ లో బుధవారం ఉదయం ఆర్.కృష్ణయను కలిసిన నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి కాంగ్రెస్ పార్టీ లోకి రావాలని ఆహ్వానించారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సైతం కృష్ణయ్యతో భేటీ అయ్యారు. బలహీన వర్గాల సంక్షేమం, రిజర్వేషన్ల పెంపు కోసం చేపట్టే ఉద్యమానికి మద్దతు ఇస్తామని, కాంగ్రెస్ పార్టీతో కలిసి రావాలన్నారు. సీనియర్ నేత వి.హనుమంతరావు మాట్లాడుతూ బీసీల కోసం సమయం దగ్గరకు వచ్చింది, కాంగ్రెస్ తో కలిసి రావాలన్నారు.

గ్రామీణ ప్రాంతాలలో బీసీలను మరింత చైతన్యం చేయాల్సిన అవసరం ఉందన్నారు. సామాజిక న్యాయ సాధన కాంగ్రెస్ తో సాధ్యమని చెప్పారు. మండల్ కమిషన్ సూచనలు అమలు చేయాల్సిన అవసరం ఉందని, కుల గణన జరగాలన్నారు. తొమ్మిదవ షెడ్యూలు మార్చి 50 శాతం వాటా పెంచుతామని రాహుల్ గాంధీ చెప్పారన్నారు. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కృష్ణయ్యను కోరారు.

Advertisement

Next Story

Most Viewed