రాష్ట్రంలో వైద్య కళాశాలల సంఖ్య కుదించాలి

by Sridhar Babu |
రాష్ట్రంలో వైద్య కళాశాలల సంఖ్య కుదించాలి
X

దిశ, హైదరాబాద్ బ్యూరో : రాష్ట్రంలో జిల్లాలతో పాటు మెడికల్ కాలేజ్ ల సంఖ్య ను కూడా కుదించాలని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం (టీజీజీడీఏ) సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేసింది. సిబ్బంది, మౌలిక సదుపాయాలు లేకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వం వైద్య కళాశాలలు ఏర్పాటు చేయడంతో ఎంబీబీఎస్ చదువుకు విలువ లేకుండా పోయిందన్నారు. దీనికి తోడు ఎన్ ఎం సీ నుండి అభ్యంతరాలు కూడా వ్యక్తమౌతున్నందున ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు తీసుకోవాలన్నారు . ఈ మేరకు మంగళవారం కోఠి డీఎంఈ ఆవరణలో టీజీజీడీఏ నాయకులు డాక్టర్ బరిగెల రమేష్ , డాక్టర్ పల్లం ప్రవీణ్ కుమార్ , డాక్టర్ ఏ కృష్ణారెడ్డి , డాక్టర్ ఏ.రంగా తదితరులు మాట్లాడుతూ ఐదేండ్లకు పైబడిన వైద్యులందరినీ బదిలీ చేయాలనే ప్రభుత్వ ఆలోచనను పున: సమీక్షించాలని , ప్రస్తుతం పని చేస్తున్న వారిలో 20 శాతం డాక్టర్లను మాత్రమే బదిలీ చేయాలని, అందులో గుర్తింపు పొందిన సంఘం ఆఫీస్ బేరర్లకు మినహాయింపు

ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. ఒకే దగ్గర ఐదేండ్లకు పైబడి పని చేస్తున్న డాక్టర్లందరినీ బదిలీ చేయడం మూలంగా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందే అవకాశం లేదని, అనుభవం ఉన్న వైద్యులు ఉండరని, దీంతో రోగులకు ఇబ్బందులు ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. గతంలో కూడా ప్రభుత్వాలు బదిలీలలో 20 శాతం మందిని మాత్రమే పరిగణలోకి తీసుకునేవారని చెప్పారు . అంతేకాకుండా గుర్తింపు పొందిన సంఘం ప్రతినిధులకు బదిలీలలో మినహాయింపు ఇచ్చేవారని, ఇప్పుడు కూడా అదే తీరును కొనసాగించాలని కోరారు. చారిత్రాత్మక ఉస్మానియా ఆస్పత్రికి నూతన భవనం నిర్మించాలని, ఇందుకు చంచల్ గూడ జైలు లేదా గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్ స్థలాలను పరిశీలించాలన్నారు. నూతన వైద్య కళాశాలల్లో పని చేసే

వైద్యులకు బేసిక్ పే పై 30 నుండి 50 శాతం అలవెన్స్ ఇవ్వడానికి జీఓ విడుదల చేయాలన్నారు. అదనపు డీఎంఈ, ఇతర పదోన్నతులు కల్పించి బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేశారు. స్వచ్చంద పదవీ విరమణ కోరుకున్న వైద్యులకు తక్షణమే అనుమతినిచ్చి వారికి రావాల్సిన బెన్ఫిట్స్ ఇవ్వాలని అన్నారు. కొంతమంది వైద్యులు బదిలీల పేరుతో డబ్బులు వసూలు చేసే కార్యక్రమానికి తెరలేపారని, అటువంటి వారి మాటలు నమ్మరాదని, వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శంకర్ సింగ్ , డాక్టర్ లక్ష్మినారాయణ, డాక్టర్ లాలూ ప్రసాద్ రాథోడ్, డాక్టర్ నరహరి, డాక్టర్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed