TG Budget 2024-25: ఆపరేషన్ @ 2026.. బల్దియాకు సర్కార్ భారీగా నిధుల కేటాయింపు

by Shiva |
TG Budget 2024-25: ఆపరేషన్ @ 2026.. బల్దియాకు సర్కార్ భారీగా నిధుల కేటాయింపు
X

దిశ, సిటీ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం ఆపరేషన్ GHMCకి తెరదీసిందా? అన్న ప్రశ్నకు రాష్ట్ర బడ్జెట్‌లో చేసిన కేటాయింపులే అవునని సమాధానం చెబుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా మహానగరాభివృద్ధికి సర్కారు వరాల జల్లు కురిపించింది. సమైక్య పాలనతో పాటు 2014 తర్వాత ప్రత్యేక పాలనలోనూ ఈ స్థాయిలో నిధులు కేటాయించిన దాఖలాల్లేవు. పైగా గ్రేటర్ ప్రజల జీవితాలను ప్రభావితం చేసే జీహెచ్ఎంసీ, జలమండలి, హెచ్ఎండీఏ, హైదరాబాద్ మెట్రో రైలు వంటి ఇతరాత్ర విభాగాలు స్టేట్ బడ్జెట్ పైనే ఆశలు పెట్టుకుని పంపిన ప్రతిపాదనలకు అంతంతమాత్రంగా నిధుల కేటాయింపులు జరిగేవి.

కానీ ఈ సారి సిటీలో అభివృద్ధి, మౌలిక వసతుల నిర్వహణలో కీలక పాత్ర పోషించే వివిధ విభాగాలు ఊహించని విధంగా సర్కారు నిధులు కేటాయించింది. జీహెచ్ఎంసీ మొదలుకుని జంట నగరవాసుల దాహర్తీని తీర్చే జలమండలితో పాటు గ్రేటర్ పరిధిలో ఔటర్ బయటనున్న స్థానిక సంస్థల పరిధిలో ఆస్తుల పరిరక్షణ, విపత్తుల నివారణ కోసం ఇటీవలే ఏర్పాటు చేసిన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్, అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) కు సైతం రూ. 200 కోట్లను సర్కారు కేటాయించింది. ఆర్థిక సంవత్సరం( 2024-25) కు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో మహానగరానికి పెద్ద పీట వేసిందనే చెప్పవచ్చు.

సమైక్య, ప్రత్యేక పాలనలోనూ గతంలో ఎన్నడూ లేని విధంగా సర్కారు జీహెచ్ఎంసీకి బడ్జెట్ లో తగిన ప్రాధాన్యతనిస్తూ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న జీహెచ్ఎంసీకి రూ.3065 కేటాయింపులు జరపటంతో బల్ది్యాకు కాస్త ఊరట కల్గింది. వర్తమాన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీహెచ్ఎంసీకి రూ. 5 వేల కోట్లను కేటాయించాలని కావాలని అధికారులు కోరగా రూ. 3065 కేటాయించటంతో పాటు హైదరాబాద్ మహానగరంలో ప్రత్యేకంగా మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు ఏకంగా రూ.10 వేల కోట్లను కూడా కేటాయించటం జీహెచ్ఎంసీ చరిత్రలోనే ఫస్ట్ టైమ్ గా చెప్పుకోవచ్చు.

జీహెచ్ఎంసీకి రూ.3065, జలమండలికి రూ.3385 కోట్లు, హెచ్ఎండీఏకు రూ.500 కోట్లు, మెట్రో రైలు విస్తరణ (పాతబస్తీ)కి రూ.500 కోట్లు, ఏయిర్ పోర్టు మెట్రోరైలుకు రూ.100 కోట్లు, హైదరాబాద్ మెట్రో రైలుకు రూ. 500 కోట్లు, హైడ్రాకు రూ. 200 కోట్లు, మూసీ సుందరీకరణ కు రూ.1500 కోట్లు, జీహెచ్ఎంసీ పరిధిలో మౌలిక వసతుల మెరుగుకు రూ. 3050 కోట్లు, ఔటర్ రింగ్ రోడ్డుకు రూ.200 కోట్లు, ఎంఎంటీఎస్ కు జరిపిన రూ.50 కోట్లతో మొత్తం రూ.20 వేల కోట్లు కేటాయించిందంటే మున్ముందు హైదరాబాద్ మహానగరంలో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధితో పాటు ఆత్యాధునిక రవాణ వ్యవస్థ మెట్రోరైలు కూడా కొత్తగా పలు ప్రాంతాలకు అందుబాటులోకి రానుంది. ఈ బడ్జెట్ లో జరిపిన కేటాయింపులతో త్వరలోనే హైడ్రా యాక్షన్ లోకి రావటంతో పాటు మూసీ సుందరీకరణ, నగరంలో మౌలిక వసతులను మెరుగుపరిచే పనులను ప్రారంభించనున్నారు.

మూసీకి మహార్దశ

భాగ్యనగర్ జీవనది అయిన మూసీ ప్రక్షాళన, పరిరక్షణ, సుందరీకరణ కు సంబంధించిన ఆర్ధికంగా లైన్ క్లియర్ అయినట్టేనని చెప్పవచ్చు. ఏళ్ల తరబడి కాలుష్య కాసారంగ మారిన మూసీ ప్రక్షాళన, సుందరీకరణతో పాటు ఎకలాజికల్, హెరిటెజ్, మెట్రో, టూరిజం నాలుగు జోన్లుగా అభివృద్ది చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే కేంద్రాన్ని రూ. 10 వేల కోట్ల అభ్యర్థించినా, ఫలితం దక్కలేదు. కొత్త సర్కారు కొలువుదీరిన నాటి నుంచి మూసీపై ప్రత్యేక చొరవ చూపటంతో పాటు మూసీ సుందరీకరణ కోసం రాష్ట్ర బడ్జెట్ లో రూ.1500 కోట్లను కేటాయించి, సర్కారు చిత్తశుద్ధిని చాటుకుందని చెప్పవచ్చు. మూసీ పరివాహాక ప్రాంతాన్ని పబ్లిక్ ప్రైవేటు పార్టనర్ షిప్ (పీపీపీ) పద్దతిలో అభివృద్ది చేయాలని భావిస్తున్న సర్కారు బడ్జెట్ లో కేటాయించిన రూ.1500 కోట్లను స్థల సేకరణ, మూసీలో కాలుష్య నివారణ కోసం వినియోగించనున్నట్లు సమాచారం.

2026 ఫిబ్రవరిలో ముగియనున్న కౌన్సిల్ పదవీ కాలం

2020 డిసెంబర్ లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగాయి. బీఆర్ఎస్ పార్టీ మెజార్టీ స్థానాలను గెల్చుకుని మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు చేపట్టింది. బీఆర్ఎస్ పార్టీ తరపున బంజారాహిల్స్ డివిజన్ ను గెలుపొంది గద్వాల్ విజయలక్ష్మి మేయర్ గా 2021 ఫిబ్రవరి 11న ఎన్నికయ్యారు. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 11 తో ఆమె తన నాలుగేళ్ల పదవీ కాలం, అలాగే 2026 ఫిబ్రవరి లో కౌన్సిల్ పదవీకాలం ముగియనుంది. హైదరాబాద్ సిటీ అభివృద్ది కోసం బడ్జెట్ లో జరిపిన భారీ కేటాయింపులతో ఎన్నికలొచ్చే లోపు మహానగర ప్రజలకు విజుబిలిటీగా అభివృద్ది పనులు చేపట్టాలన్నది సర్కారు వ్యూహాంగా కన్పిస్తుంది.

Advertisement

Next Story