దేశానికే రోల్ మోడల్ గా తెలంగాణ కొత్త రెవెన్యూ చట్టం

by Sridhar Babu |
దేశానికే రోల్ మోడల్ గా తెలంగాణ కొత్త రెవెన్యూ చట్టం
X

దిశ, హైదరాబాద్ బ్యూరో : రాష్ట్రంలో గత పది సంవత్సరాల నుండి ధరణి పోర్టల్, ఆర్వోఆర్ చట్టం - 2020 ద్వారా ప్రజలు పడుతున్న కష్టాలు, బాధల నుంచి విముక్తి కల్పించేలా, దేశానికి రోల్ మోడల్ గా త్వరలో కొత్త రెవెన్యూ చట్టం-2024ను తీసుకురాబోతున్నామని రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌరసంబంధాలు, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం అమలు చేసిన ధరణితో సామాన్య ప్రజలు, రైతులు ఇబ్బందులు పడ్డారని, వారు ఎదుర్కొన్న రెవెన్యూ సమస్యల నుంచి విముక్తి కల్పిస్తామని తెలిపారు. రాష్ట్రంలోని 272 మంది స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లతో మంత్రి ఆదివారం ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ ప్రజలైతే కాంగ్రెస్ పార్టీ విధానాలను విశ్వసించి అధికారం అప్పగించారో వారికి అనుగుణంగా సామాన్యునికి అందుబాటులో ఉండేలా రెవెన్యూ సేవలను తీసుకురాబోతున్నాం అన్నారు.

ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక అధికారిని నియమించినట్లు తెలిపారు. కొత్త రెవెన్యూ చట్టం రాకముందే దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని, గత ప్రభుత్వం తొందరపాటు నిర్ణయాలతో రెవెన్యూ వ్యవస్థను బ్రష్టు పట్టించిందని పేర్కొన్నారు. ఇటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా తమ ప్రభుత్వం ఉద్యోగులను, మేధావుల సలహాలను స్వీకరించినట్టు చెప్పారు. నల్గొండ జిల్లా తిరుమలగిరి, రంగారెడ్డి జిల్లా యాచారం మండలాల్లో పైలట్ ప్రాజెక్ట్ ను నిర్వహిస్తున్నామని, అక్కడ ఎదురయ్యే సమస్యలు, మంచి, చెడులను పరిగణలోకి తీసుకుని చట్టాన్ని రూపొందించనున్నట్లు తెలిపారు. ఈ చట్టం కూడా తుది దశకు చేరుకుందని, 2020 రెవెన్యూ చట్టంలో ప్రజలకు మేలు చేసే ఏమైనా మంచి అంశాలు ఉంటే కొత్త చట్టంలో పొందుపరుస్తామని వెల్లడించారు. స్వయంగా తాను తిరుమలగిరి మండలంలో పర్యటించి రైతులతో మాట్లాడినట్టు చెప్పారు. ఈ ఒక్క మండలంలోనే 4,380 ఎకరాలలో సర్వే నిర్వహిస్తే 1300 ఎకరాలు మోఖా మీద లేని వారికి పాస్​బుక్కులు ఉన్నాయనే విషయం బహిర్గతమమైందని అన్నారు. ప్రభుత్వ భూముల పరిరక్షణలో ఏ మాత్రం రాజీ పడొద్దని, ఈ భూముల పరిరక్షణ కోసం ప్రతి మూడు నెలలకోసారి రాష్ట్ర, జిల్లా స్థాయిలో లీగల్ టీమ్ తో సమావేశం నిర్వహిస్తామని పేర్కొన్నారు.

ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, ఎవరు రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నా ప్రభుత్వ భూముల రికార్డులను టాంపరింగ్ చేయకుండా రెవెన్యూ రికార్డులను డిజిటలైజేషన్ చేస్తామని తెలిపారు. కొత్తగా ఉద్యోగంలో చేరిన వారితో పాటు, సర్వీస్ లో ఉన్న ప్రతి ఒక్కరికీ శిక్షణ ఇస్తామని, రెవెన్యూ విభాగం ఉద్యోగులకు సంబంధించి జాబ్ చార్ట్ రూపొందించాలని, ఇందుకోసం ఒక కమిటీని ఏర్పాటు చేసి ఇతర రాష్ట్రాలలో అధ్యయనం చేయాలన్నారు. వ్యవస్థలో ఒకరిద్దరు తప్పు చేయడం వల్ల అందరికీ చెడ్డ పేరు వస్తుందని అభిప్రాయపడ్డారు. మీరు వేసే ప్రతి అడుగు, పని రెవెన్యూ వ్యవస్థకు వన్నె తెచ్చేలా ఉండాలన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరగకుండా రెవెన్యూ యంత్రాంగం పని చేసిందని ప్రశంసించారు. ఉద్యోగుల సమస్యలకు సంబంధించి ఆర్థికేతర అంశాలను తక్షణమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. 33 జిల్లాల్లో సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పోస్టులను క్రియేట్ చేస్తామని, అలాగే 17 మంది రెవెన్యూ అధికారులకు ఐఏఎస్ హోదా కల్పించడానికి చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.

ఎన్నికల సమయంలో బదిలీ అయిన తహసీల్దార్లను పూర్వ స్థానాలకు బదిలీ చేయడానికి దసరాలోపే నిర్ణయం తీసుకుంటామన్నారు. ఉద్యోగులు చెప్పినట్టుగా యునిఫార్మ్ గా అందరికీ ఒకే రకమైన వాహనాలు ఉండాలన్న ఆలోచన చాలా మంచిదేనని, కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్ధం చేసుకోవాలన్నారు. సరైన సమయంలో దీనిపై నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. వాహనాల అద్దెలకు సంబంధించి ఈనెల చివరి వరకు 50 శాతం క్లియర్ చేస్తామన్నారు. గత ప్రభుత్వం మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాలను పెంచింది కానీ అక్కడ మౌలిక సదుపాయాలను విస్మరించిందని, దాదాపు 200 మండలాలకు సొంత భవనాలు లేకపోవడం పరిస్థితికి అద్దం పడుతుందన్నారు. అప్పులు చేసి ఉన్న బిల్డింగ్ లను కూలగొట్టి సెక్రటేరియట్ ను నిర్మించడం అవసరమా అని ప్రశ్నించారు.

కొన్ని జిల్లాల్లో కలెక్టర్ కార్యాలయాలు ఉన్నా కొత్తవి నిర్మించారని పేర్కొన్నారు. రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ మాట్లాడుతూ గత తొమ్మిది నెలల్లో రెవెన్యూ శాఖ మంత్రి ఆధ్వర్యంలో ప్రజలకు అనువైన విధంగా రెవెన్యూ సంస్కరణలు చేపట్టామని, దాదాపు 3.50 లక్షల ధరణి దరఖాస్తులను పరిష్కరించినట్టు తెలిపారు. ఈ సమావేశంలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురుశెట్టి, తెలంగాణ స్టేట్ సివిల్ సర్వీసెస్ డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కె. చంద్రమోహన్, ప్రధాన కార్యదర్శి డి.శ్రీనివాస్ రెడ్డి, కోశాధికారి ఏ. భాస్కర రావు, డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వి. లచ్చి రెడ్డి, ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, ట్రెసా అధ్యక్షులు వంగ రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గౌతమ్ కుమార్ పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed