రాష్ట్రంలో ఏడేళ్లలో ఎన్ని అగ్నిప్రమాదాలు జరిగాయో తెలుసా..? తెలిస్తే షాకవుతారు!

by S Gopi |
రాష్ట్రంలో ఏడేళ్లలో ఎన్ని అగ్నిప్రమాదాలు జరిగాయో తెలుసా..? తెలిస్తే షాకవుతారు!
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: భాగ్యనగరంలోని తరచూ అగ్ని ప్రమాదాలు విషాదాన్ని మిగిలిస్తున్నాయి. గడిచిన ఏడేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా అగ్ని ప్రమాదాలతో అనేకమంది చనిపోతున్నారు. నిప్పు రవ్వల్లా ఎగిసి చూస్తుండగానే దావానలంలా వ్యాపిస్తున్న మంటలు ఎంతోమంది జీవిత కష్టార్జితాన్ని స్వాహా చేస్తున్నాయి. కొందరి ప్రాణాలను బలి తీసుకుంటూ వారి కుటుంబాలను రోడ్లపాలు చేస్తున్నాయి. ఏదైనా భారీ ప్రమాదం జరిగినప్పుడు ప్రభుత్వం, అధికార యంత్రాంగాలు కొన్ని రోజులు హడావిడి చేస్తున్నాయి. అగ్ని ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు మాత్రం చేపట్టటం లేదు. ప్రాణాలు కోల్పోయిన... గాయాల పాలైన వారికి నష్టపరిహారం కింద కొంత డబ్బు అందజేస్తున్నారు. అసలు ప్రమాదాలే జరగకుండా చూసే పాపానికి పోవటంలేదు. ఇటీవలే జరిగిన దక్కన్​మాల్​విషాదం... గురువారం రాత్రి జరిగిన స్వప్నలోక్​ప్రమాదం దీనిని స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వం, అధికార యంత్రాంగాల తీరు ఇలా ఉంటే బహుళ అంతస్తుల భవనాలు, షాపింగ్​మాళ్లు, పరిశ్రమలు, గోడౌన్లు, షాపులు, ఆఫీసులు, హాస్పిటళ్లు, థియేటర్ల నిర్వాహకులు కూడా కనీస స్థాయిలో కూడా అగ్ని ప్రమాద నివారణ వైపు దృష్టిని పెట్టటం లేదు. నడుస్తోంది కదా నడుపుదాం అన్నట్టుగా వ్యవహరిస్తూ.. చేజేతులా ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు.

అగ్నిమాపక శాఖ అధికారులు చెబుతున్న ప్రకారం.. ఎలక్ట్రికల్​పరికరాలు, చిమ్నీలు, గ్యాస్​లీకేజీల కారణంగా ఎక్కువగా ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఇక, పరిశ్రమలు, కెమికల్​ఫ్యాక్టరీల యాజమాన్యాలు ఎక్కువ జీతాలు చెల్లించాల్సి వస్తుందని స్కిల్డ్​ఉద్యోగులను కాకుండా అనుభవం లేనివారిని పనుల్లో పెట్టుకుంటుండటం కూడా ప్రమాదాలకు కారణమవుతోంది. బహుళ అంతస్తుల భవనాలు, థియేటర్లు, ఆస్పత్రులు, గోడౌన్లు, షాపులు, ఆఫీసులు, థియేటర్ల యాజమాన్యాలు కనీస స్థాయిలో కూడా ఫైర్​ఫైటింగ్​ఏర్పాట్లు చేసుకోవటం లేదని అధికారులు అంటున్నారు. పేరుకు కొన్ని ఫైర్​ఎస్టింగ్విషర్లు, కొన్ని బక్కెట్లలో ఇసుక, ఫైర్​అలారంలను ఏర్పాటు చేసుకుంటూ మిన్నకుండి పోతున్నారని అధికారులు చెబుతున్నారు. ఇది కొంతవరకూ నిజమే. ఎప్పుడో భవనాలు కట్టినప్పుడు, పరిశ్రమలు ఏర్పాటు చేసుకున్నప్పుడు, ఇండ్లు నిర్మించుకున్నప్పుడు ఏర్పాటు చేయించుకుంటున్న ఎలక్ర్టికల్​వైరింగ్‌ను ఏళ్ల తరబడిగా కొనసాగిస్తున్నారు. ఏవైనా సమస్యలు తలెత్తినప్పుడు మరమ్మతులు చేయిస్తూ కాలం గడుపుతున్నారు. కనీసం రెండు మూడేళ్లకు ఒకసారి కూడా వైరింగ్​సరిగ్గా ఉందా? ఏవైనా సమస్యలు ఉన్నాయా? కూడా పట్టించుకోవటం లేదు. ఫలితంగా ఒక్కసారిగా హైవోల్టేజీ వచ్చినప్పుడో... వైర్లకు పగుళ్లు వచ్చి ఒకదానికొకటి తగిలినపుడో ఎగిసిపడుతున్న నిప్పు రవ్వలు ఘోర ప్రమాదాలకు కారణమవుతున్నాయి. కెమికల్​పరిశ్రమల యాజమాన్యాలు స్కిల్డ్​ఉద్యోగులను పెట్టుకుంటే ఎక్కువ మొత్తాల్లో జీతాలు ఇవ్వాల్సి వస్తుందని ఏమాత్రం నైపుణ్యం, అనుభవం లేనివారిని ఉద్యోగాల్లో పెట్టుకుంటున్నారు. వీళ్లు పని చేస్తున్నప్పుడు ఏ చిన్న పొరపాటు జరిగినా అది అగ్ని ప్రమాదాలకు కారణమవుతోంది.

అధికార యంత్రాంగాల నిర్లక్ష్యం

అధికార యంత్రాంగాల నిర్లక్ష్యం కూడా ఫైర్​యాక్సిడెంట్లకు కారణమవుతున్నది. బహుళ అంతస్తులు, షాపింగ్​మాళ్లు, ఆస్పత్రులు, గోడౌన్లు, టింబర్ డిపోల యాజమాన్యాలు సరైన ఫైర్​సేఫ్టీ ప్రమాణాలు పాటిస్తున్నాయా? లేదా? అన్నది ఎప్పటికప్పడు తనిఖీ చేయాల్సి ఉంటుంది. కొత్తగా నిర్మిస్తున్నవైతే అన్ని ప్రమాణాలు పాటించారన్న నిర్ధారణకు వచ్చినప్పుడే అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, అధికారులు ఆయా భవనాలను తనిఖీలు చేసిన పాపానికి పోవటం లేదు. పైగా, కొందరు అధికారులు ఆమ్యామ్యాలకు మరిగి సరైనా భద్రతా ప్రమాణాలు పాటించనివారికి సైతం అనుమతులు మంజూరు చేసేస్తున్నారు. ఈ కారణంగా కూడా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని అగ్నిమాపక శాఖకు చెందిన కొందరు అధికారులే చెబుతుండటం గమనార్హం.

ఇప్పటికైనా...

వరుస ప్రమాదాలు జరుగుతున్న... ప్రాణాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికైనా అగ్నిమాపక శాఖతోపాటు జీహెచ్ఎంసీ, మున్సిపాలిటీల సిబ్బంది సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం జనం నుంచి వ్యక్తమవుతోంది. భవనాలు, ఆస్పత్రులు ఇలా జనం ఎక్కువగా గుమిగూడే చోట్ల... వ్యాపార సంస్థలు ఎక్కువగా ఉండే భవనాలను క్షుణ్నంగా తనిఖీలు చేయాలని కోరుతున్నారు. సరైన ఫైర్​సేఫ్టీ ఏర్పాట్లు లేని భవనాలు, పరిశ్రమలు, ఆస్పత్రులు తదితర వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని అంటున్నారు. అన్ని ప్రమాణాలను పాటిస్తున్నవారికే అనుమతులు ఇవ్వాలని చెబుతున్నారు. ఇప్పటికైనా ఈ దిశలో అధికార యంత్రాంగాలు స్పందిస్తాయని ఆశిద్దాం. గడిచిన ఏడేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన కొన్ని అగ్ని ప్రమాదాలు – 61,336, ఆహుతైన సంపద విలువ – 1,431 కోట్లు, అగ్నిమాపక శాఖ కాపాడిన సంపద విలువ – 4,547 కోట్లు, ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య – 322, అగ్నిమాపక శాఖ రెస్క్యూ బృందాలు కాపాడిన వారి సంఖ్య – 914, ఏటా పెరిగిపోతున్న అగ్నిప్రమాదాలు మిగిలిస్తున్న విషాదాలివి.

Advertisement

Next Story

Most Viewed