టీనేజ్ స్టూడెంట్స్ పై ‘కార్పొరేట్’ ప్రెషర్

by S Gopi |
టీనేజ్ స్టూడెంట్స్ పై ‘కార్పొరేట్’ ప్రెషర్
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: విద్యార్థులు, పిల్లల హక్కుల సంరక్షణకు అనేక చట్టాలున్నా.. అధికార యంత్రాంగాల అలసత్వంతో అవి కాగితాలకు మాత్రమే పరిమితమవుతున్నాయి. సాత్విక్ విషాదాంతం తరువాత కార్పొరేట్ కళాశాలల వ్యవహారశైలి మరోసారి చర్చనీయాంశమైంది. ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులపై లెక్చరర్లు చేయి చేసుకోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. విద్యార్థులపై చేయి చేసుకోవటం ప్రకారం నేరం. అందరి ముందు తిట్టడం, మరొకరితో పోలుస్తూ అవమానపర్చడం, కొట్టడం శిక్షార్హం. కానీ ఆ చట్టాలను పట్టించుకునేవారే లేరు. అంతేకాకుండా చదువులో వెనకబాటు, ఇతర కారణాల వల్ల విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటే.. దానికి బాధ్యులైన వారిపై ఐపీసీ 305 సెక్షన్ ప్రకారం కేసులు నమోదు చేయాలి. నేరం నిరూపణ అయితే కనీసం పదేళ్లకు తగ్గకుండా లేదా యావజ్జీవ శిక్ష, జరిమానా పడే అవకాశముంటుంది.

కౌన్సెలింగ్ అవసరం

విద్యార్థుల మానసిక వికాసానికి ఉపయోగపడాల్సిన చదువులు శ్రీచైతన్య, నారాయణ వంటి కార్పొరేట్ కళాశాలల తీరు వల్ల పక్కదారి పడుతున్నాయి. రిజల్ట్స్ కోసం యాజమాన్యాలు అధ్యాపకులపై ఒత్తిడి తీసుకొస్తుంటే, వారు బట్టీపట్టే విధానాన్ని అమలు చేస్తున్నారు. టార్గెట్ రీచ్ కావడానికి విద్యార్థులను ఒత్తిడికి గురి చేస్తున్నారు. విద్యార్థులకు బోధించే అధ్యాపకులకు కౌన్సెలింగ్ ఇవ్వాల్సిన అవసరముందని మానసిక వైద్య నిపుణుడు గోపి అభిప్రాయపడ్డారు. 14 నుంచి 20 ఏళ్ల మధ్య వయసున్న పిల్లల మనస్తత్వం ఎంతో సున్నితంగా ఉంటుందని తెలిపారు. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్లలో ఉన్న ప్రతిభను ఎలా బయటకు తీయాలన్న అంశంపై పూర్తి అవగాహన ఉండాల్సిన అవసరముందని చెప్పారు. దండించడం, తిట్టడం, ఇతరులతో పోల్చడంతో పిల్లల మనసులు తీవ్రంగా గాయపడతాయని వివరించారు. బాధను ఎవరితో పంచుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నట్లు తెలిపారు. అధ్యాపకులు, పిల్లలకు మధ్య స్నేహ సంబంధాలు ఉందాలని చెప్పారు.

హక్కులపై అవగాహన అవసరం

విద్యార్థులకు ఉండే హక్కులపై విద్యాశాఖ, పోలీసు వర్గాలు అవగాహన కల్పించాలని డాక్టర్ గోపి అన్నారు. ఒక్కో ప్రాంతంలో ఉండే విద్యా సంస్థల పిల్లలతో సమావేశాలు ఏర్పాటు చేసి వారి హక్కులను కాపాడటానికి ఉన్న చట్టాల గురించి తెలియజేయాలన్నారు. విద్యాసంస్థల్లో కరపత్రాల పంపిణీ చేస్తే మరింత ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ఇలాంటి చర్యలతో ఆత్మహత్యలను కొంతవరకైనా నివారించవచ్చని అభిప్రాయపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed