ఆ విభాగమంటే చిన్న చూపా?

by Mahesh |
ఆ విభాగమంటే చిన్న చూపా?
X

దిశ, సిటీబ్యూరో : జీహెచ్ఎంసీలోని అర్బన్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ (యూసీడీ) అంటేనే ఉన్నతాధికారులకు చిన్నచూపా? అన్న ప్రశ్నకు ప్రస్తుతం ప్రధాన కార్యాలయంలో ఉన్న పరిస్థితులు అవుననే సమాధానం చెబుతున్నాయి. ఈ యూసీడీ విభాగానికి అదనపు కమిషనర్‌గా పనిచేస్తున్న ఆఫీసర్ విధుల్లో చేరి 6 నెలలు గడుస్తున్నా ఇంత వరకు ఆయనకు చాంబర్ కేటాయించలేదు. గత్యంతరం లేక ఆయన ప్రధాన కార్యాలయంలోని 3వ అంతస్తులోని అదనపు కమిషనర్ (స్పోర్ట్స్) చాంబర్‌లో విధులు నిర్వహిస్తున్నారు. గతంలో కూడా పలు విభాగాధిపతులకు చాంబర్లు కేటాయించడంలో బల్దియా కనబరిచిన వివక్ష చర్చనీయాంశంగా మారిన సందర్భాలున్నాయి. గతంలో జీహెచ్ఎంసీలోనే ఏళ్ల తరబడి విధులు నిర్వర్తించి, బదిలీపై బయటకు వెళ్లి, మళ్లీ జీహెచ్ఎంసీలోకి వచ్చిన, వస్తున్న అధికారుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రధాన కార్యాలయంలో చాంబర్ల కొరత ఏర్పడింది. ఇదే తరహాలో ఇటీవల జీహెచ్ఎంసీకి బదిలీపై వచ్చిన అదనపు కమిషనర్ సత్యనారాయణకు కూడా చాంబర్ లేకపోవడంతో ఆయన కొద్ది రోజులు బుద్దభవన్‌లో విధులు నిర్వర్తించారు. ఆ తర్వాత నాలుగో అంతస్తులో ఉన్న విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్ ఆఫీసును చాంబర్‌గా మార్చి, ఆయనను అకామిడెట్ చేశారు.

అంతేగాక ప్రస్తుతం అదనపు కమిషనర్ (ఫైనాన్స్)గా విధులు నిర్వర్తిస్తున్న గీతా రాధిక కూడా కొద్ది నెలల క్రితం అదనపు కమిషనర్ (ఎస్టేట్)గా విధులు నిర్వర్తించినప్పుడు ఆమె ప్రధాన కార్యాలయంలో చాంబర్ లేకపోవటంతో కొద్ది రోజుల పాటు బుద్ధభవన్‌లోనే అకామిడెట్ చేశారు. ఇటీవల జరిగిన బదిలీల్లో అప్పటి వరకు ఎల్బీనగర్ జోన్‌కు జోనల్ కమిషనర్‌గా విధులు నిర్వర్తించిన పంకజను అదనపు కమిషనర్ (హెల్త్)గా ప్రధాన కార్యాలయానికి మార్చారు. అప్పట్లో కూడా ఆమెకు చాంబర్ ఎక్కడ కేటాయించాలన్నది కొద్ది రోజుల పాటు అధికారులకు తలనొప్పిగా మారింది. ఎట్టకేలకు ఆమెకు చీఫ్ ఎంటమాలజీ చాంబర్ పక్కనే ఉన్న ట్రాన్స్‌పోర్టు సెక్షన్ చాంబర్‌ను కేటాయించారు. కానీ యూసీడీ విభాగం అదనపు కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించి 6 నెలలు గడుస్తున్నా ఆఫీసర్‌కు ఇంకా చాంబర్ కేటాయించకపోవటం, బుద్దభవన్‌లో సిద్దమవుతుందని చెప్పటం ముమ్మాటికీ ఆ విభాగంపైనున్న చిన్నచూపే కారణమన్న వాదనలున్నాయి. జీహెచ్ఎంసీలో కీలకమైన విభాగమైన యూసీడీ విభాగాన్ని బుద్దభవన్‌కు మార్చితే వివిధ రకాల పనులపై యూసీడీ విభాగానికి వచ్చే మహిళలకు, సిబ్బందికి ఇబ్బందికరంగా ఉంటుందన్న వాదనలున్నాయి. ఎస్టేట్, ఫైనాన్స్, ఎలక్ట్రిసిటీ విభాగాల అదనపు కమిషనర్లకు చాంబర్లు కేటాయించడంపై చూపిన శ్రద్ధ, చొరవను యూసీడీ అదనపు కమినర్‌కు కేటాయించటంపై చూపటం లేదన్న విమర్శలున్నాయి.

ఆ ఇద్దరు వస్తే?

గత నెల 30న పురపాలక శాఖ రాష్ట్ర వ్యాప్తంగా 24 మంది స్పెషల్ గ్రేడ్ 1, 2, 3 మున్సిపల్ కమిషనర్లకు కల్పించిన బదిలీల్లో భాగంగా గతంలో జీహెచ్ఎంసీలో విధులు నిర్వర్తించిన మరో ఇద్దరు అధికారులు జీహెచ్ఎంసీలోకి అదనపు కమిషర్లుగా రానున్నారు. గవర్నర్‌కు కార్యదర్శిగా విధులు నిర్వర్తించిన రఘుప్రసాద్, గతంలో చార్మినార్ జోన్ జోనల్ కమిషనర్‌గా విధులు నిర్వహించిన సామ్రాట్ అశోక్ కూడా ఇటీవల జీహెచ్ఎంసీలోకి బదిలీ అయ్యారు. ఈ ఇద్దరు అధికారులకు చాంబర్లను ఎక్కడ కేటాయించాలన్నది అధికారులకు సరికొత్త తలనొప్పిగా మారనుంది. ఏఏ విభాగాలకు వారిని అదనపు కమిషనర్లుగా నియమిస్తారన్నది కూడా చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Next Story